పరిషత్ ఎన్నికల రద్దు నిర్ణయం దురదృష్టకరం

238

– పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు పట్ల రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి చెందారు.
– ప్రజా క్షేత్రంలో గెలవలేకే.. టీడీపీ అడ్డదారులు
– దొంగదెబ్బలతో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకోవడమే టీడీపీ విజయమా..?
– ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగితే.. టీడీపీకి ఎందుకు అంత ఆనందం..?
– ప్రజా జీవనంలో ఉండటానికే టీడీపీకి అర్హత లేదు
– టీడీపీ దుర్మార్గంగా ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్
– టీడీపీ రక్తంలోనే వంకరతనం, కుట్రలు ఉన్నాయి..
– కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ పరిషత్ ఎన్నికలు సమర్థవంతంగా పూర్తి చేశాం.
– చీఫ్ జస్టీస్ నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతోనే ఎన్నికలు నిర్వహించాం.
– బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజా తీర్పును తాత్కాలికంగా అడ్డుకోవడమే విజయంగా భావిస్తూ టీడీపీ సంబరాలా..?
– ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్‌ఆర్‌సిపికే ప్రజలు పట్టం..
– రఘురామకృష్ణరాజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం రాజద్రోహమే(124ఏ) అని సుప్రీం అభిప్రాయపడిందని భావిస్తున్నాం..
– సిఐడి కేసులో అభ్యంతరాలు ఏమీ లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని భావిస్తున్నాం.
– రఘురామ న్యాయవాది విజ్ఞప్తి మేరకే.. హైకోర్టు మెడికల్ బోర్డును నియమించింది.
– రమేష్ ఆసుపత్రికి తరలిస్తే.. ఏవిధమైన నివేదిక వస్తుందో ఊహించే డ్రామాలు..
– ప్రభుత్వాసుపత్రికి వద్దు.. రమేష్ ఆసుపత్రికి పంపించాలని అడగటంలో హేతుబద్ధత ఎక్కడిది..?
– ఫ్యాక్చర్ అయితే.. కారులో కాళ్ళు పైకెత్తి చూపించగలరా..?
– చంద్రబాబు కుట్ర బయటకు వస్తుందనే.. ఎదురుదాడి చేస్తున్నారు
– వైయస్‌ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి   సజ్జల రామకృష్ణారెడ్డి

ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్‌ ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని, ఈ తీర్పు పట్ల రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారని వైయస్‌ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్రప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…

–  ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణాధారం. చాలా కాలంగా పెండింగ్‌లో వున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమైన ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలు గత ఏడాది ఎప్పుడో జరగాల్సి ఉండగా వాయిదాపడ్డాయి. అతి తక్కువ సమయంలో పూర్తి కావాల్సి వుండగా కరోనా పేరుతో వాయిదా వేయించారు. సర్పంచ్, దీనికన్నా వెనుక ఉన్న మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఏడాది తరువాత మొన్న జరిగిన ఈ ఎన్నికలను సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువు ఆదేశాలు పాటించలేదనే కారణంగా వెలువడిన హైకోర్ట్  సింగిల్ జడ్జ్ తీర్పు దురదృష్టకరం.

–  పరిపాలనలో అత్యంత ముఖ్యమైన విభాగం స్తంభించి పోవడానికి, ప్రజల తీర్పు పాలనలోకి ఆచరణలోకి రాకుండా గండికొట్టినట్లయ్యింది. ఇది ఇబ్బందికరం. ఇప్పుడు ఉన్న కోవిడ్ విపత్తు సమయంలో ప్రజలకు సేవలు అందించేందుకు బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధుల ఎన్నిక అవసరం. కీలకమైన ప్రాణాధారమైన ప్రజాస్వామ్యానికి ఈ ఎన్నికలు అవసరమని, రాష్ట్రప్రభుత్వం,  అధికారయంత్రాంగం, ఉద్యోగులు, ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటర్లు ఉత్సాహంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఒక యజ్ఞంలాగా ఆ ప్రక్రియను పూర్తి చేశారు. దీనిలోని సీరియస్‌సెన్‌ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని అధికారపార్టీగా మా అభిప్రాయం.

–  గతంలో హైకోర్ట్ సింగిల్ జడ్జి ఇదే తీర్పు చెప్పినప్పుడు, అప్పటి చీఫ్ జస్టీస్‌ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ దానిని పక్కకు తీసి, ఎన్నికలు జరపండి, ఓట్ల లెక్కింపు ఆపమని చెప్పింది. దాని తరువాత విచారణ జరుగుతుందని చెప్పింది. ఆ మేరకే ఎస్‌ఇసి ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ పూర్తి చేసింది. ఆరోజు న్యాయస్థానం వెలువరించిన ఉత్తర్వుల్లోని సీరియస్‌నెస్‌ ను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం రావాలి. దానిని పూర్తిగా పక్కకుపెట్టడం సమంజసం కాదని అధికారపార్టీగా మా అభిప్రాయం. అయితే ఈ అంశంలో ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదు. ఇది ఎన్నికల కమిషన్‌కు, హైకోర్ట్ కు మధ్య జరగుతున్న వ్యవహారం.

–  న్యాయస్థానంను ఆశ్రయించిన పిటీషనర్లు రాజకీయ ఉద్దేశాలతోనే  వెళ్ళారు. సాంకేతికంగా దానిలోని అంశాలను బేస్‌ చేసుకుని, అంతకుముందు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే ఈ దాగుడుమూతలు మొదలైంది. ప్రభుత్వం ఎన్నికలకు సంసిద్దత వ్యక్తం చేస్తే, ఇదే పిటీషనర్లు, వారి వెనుక వున్న రాజకీయపార్టీలు, శక్తులు, వారికి సహకరిస్తున్న వారు, వారి డైరెక్షన్‌ ప్రకారం నడుస్తున్న ఆనాటి ఎస్‌ఈసి కరోనా పేరుతో వాయిదా వేశారు. వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పుడు ఎన్నికలు జరగాలని, సుప్రీంకోర్ట్ వరకు వెళ్ళారు. ప్రతిసారీ ప్రజాక్షేత్రంలో గెలవలేమని తెలిసినప్పటి నుంచి ఏదో ఒక దొంగదెబ్బ తీయాలని, జరుగుతున్న ప్రక్రియను ఆపాలని చంద్రబాబు నేతృత్వంలో టిడిపి ప్రయత్నించింది. ఈ ఎన్నికలు ఎంత ఆలస్యం జరిగితే అంత మేలు జరుగుతుందని, త్వరలో కౌన్సిల్‌లో ఖాళీ అవుతున్న పదకొండు ఎమ్మెల్సీ స్థానాలు దీనితో ముడిపడివున్నాయని భావించారు. ఎన్నికలు జరిగి వైయస్‌ఆర్‌సిపి ఎక్కువ స్థానాల్లో గెలిస్తే, ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైయస్‌ఆర్‌సిపికే దక్కుతాయనే భయంతోనే ఈ ఎత్తుగడలతో .. లిటిగేషన్‌లతో ఆటంకాలు కల్పించారు.

– హైకోర్ట్ తీర్పుపై తెలుగుదేశం నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని కూడా మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలు దేనికి, ఎవరికి చెంపపెట్టో చెప్పాలి. ఈ రోజు ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం జరిగింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి, ప్రజలు ఓట్లు వేశారు. బ్యాలెట్ బాక్స్‌లో ప్రజా తీర్పు నిక్షిప్తమై ఉంది. దానిని ఆపగలగడమే చెంపపెట్టు అనుకుంటే వారికి చేతులెత్తి దండం పెట్టడం మినహా మరేం అనలేం. మరో పదిసార్లు ఎన్నికలు జరిపినా, రాజకీయంగా శ్రీ వైయస్ జగన్ చేస్తున్న మంచిపనుల వల్ల ప్రజల దీవెనలకు పార్టీకి ఎప్పుడూ ఉంటాయి.

–  తెలుగుదేశం ఎన్నికల ప్రక్రియను దుర్మార్గపు కుట్ర, ఎత్తుగడలతో అపహాస్యం చేస్తోంది. అందులో తాత్కాలికంగా తమకు విజయం దక్కిందని అనుకుంటే, ఆ పార్టీ అసలు ప్రజాజీవనంలో ఉండటానికే అర్హత లేదు. మీకు ప్రజల మీదే గౌరవం లేదు. ప్రజలు పాల్గొన్న ఎన్నికలు రద్దయ్యాయని సంతోషిస్తున్నారంటే… చాలా జుగుప్సాకరంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పు ఫైనల్ అని విశ్వసించే రాజకీయపార్టీలకే స్థానం ఉంటుంది. దొంగదెబ్బలతో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డం కొట్టడం ద్వారా పండుగ చేసుకోవడం జుగుప్సాకరంగా ఉంటుంది. టిడిపి నేతలు దింపుడుకళ్ళెం ఆశతో ఉన్నారు.

–  నిత్యం అర్థం లేని ఆరోపణలు చేయడం, తమ కుట్రలకు అనుగుణంగా జరిగే పరిణామాలపై సంతోషపడటం తెలుగుదేశంకు అలవాటుగా మారింది. ఈ తాజా పరిణామాలపై ఎన్నికల కమిషన్ కోర్ట్ లో చూసుకుంటుంది. అధికారపార్టీగా దీనిపై ప్రజాబాహుళ్యాన్ని ప్రతిబింభించే పార్టీగా దీనిపై కలత చెందుతున్నాం. ఇది అన్యాయం, దారుణమైన తీర్పు. ఇంతమంది రిస్క్‌ చేసి, కోవిడ్ సమయంలో ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసినందుకు సంతోషించాలి. దానికి అభినందనలు చెప్పాలి. అరవై శాతంకు పైగా ప్రజలు ఎన్నికల్లో పాల్గొన్నారు. దీనిని గర్వంగా చెప్పుకోవాలి. వాస్తవానికి, చిన్నచిన్న అంశాలు సాంకేతికంగా ఇబ్బందులు వున్నా వాటిని కూడా మన్నించాలి.
–  తెలుగుదేశం, దాని వెనుక ఉన్న శక్తులకు దివాలాకోరుతనం, కుట్రలు తప్ప ఏమీ తెలియవు. వారి రక్తంలోనే వంకరితనం, కుట్రలు ఉన్నాయి.  వారికి ఈ జన్మకు వివేకవంతమైన ఆలోచనలు రావు. ప్రతిసారీ అడ్డదారులతోనే బతుకుతున్నారు. ప్రజలు మా పార్టీ వైపు ఉన్నారు. పార్టీ పట్ల అభిమానంతో ఉన్నారు .ఈ రోజు ఈ తీర్పు చూసి రాష్ట్రంలోని ప్రజలు దిగ్ర్భాంతికి గురయ్యారు. దీనిపై న్యాయప్రక్రియలో భాగంగా  సహజంగానే డివిజన్ బెంచ్‌కు పోతుంది. న్యాయం నిలబడుతుందని నమ్ముతున్నాం.

రఘురామకృష్ణరాజు వ్యవహారంపై..
–  సుప్రీంకోర్ట్‌లో ఎంపి రఘురామకృష్ణరాజు కు సంబంధించి గత వారం రోజులుగా జరుగుతున్నది  హైడ్రామా. సిఐడి పెట్టిన రాజద్రోహం కేసు, ఆయన కాలికి గాయం అయ్యిందా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది.ఆర్మీ ఆసుపత్రిలో జరిగిన పరీక్షల్లో నివేదిక సుప్రీంకోర్ట్ కు చేరింది. రఘురామకృష్ణరాజు చేసిన దుర్భాషలు, రెచ్చగొట్టేరకంగా చేసిన వ్యాఖ్యలను 124A కింద తీసుకుని పెట్టిన ఎఫ్‌ఐఆర్, ఇతర దర్యాప్తు ప్రక్రియలో అభ్యంతరాలు ఏమీ లేవని సుప్రీంకోర్ట్‌ అభిప్రాయపడిందని భావిస్తున్నాం. హద్దూపద్దూ లేకుండా ఎవరైనా సరే చేస్తున్న వ్యాఖ్యలు, సమాజంలోని వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించకుండా ఈ ఉదంతం కనువిప్పు కలిగిస్తుంది. మా ప్రభుత్వానికి వ్యక్తిగత ద్వేషాలు లేవు. పాజిటీవ్ దృక్పథంలో ప్రజల మంచి కోసం ప్రయత్నం చేస్తున్నాం. జగన్ గారు ఎవరినీ ప్రత్యర్ధులుగా, శత్రువులుగా భావించడం లేదు. పరిధి దాటితే దాని పరిణామాలను చట్టపరిధిలో ఎదుర్కోవాల్సి వస్తోంది. రెండేళ్లు అయినా ప్రత్యర్థి పార్టీలు తమ అనుకూల మీడియా ద్వారా చేయిస్తున్న కుట్రలు, దుష్ర్రపచారాలు, పట్టించుకోకుండా జగన్ గారు తమ పనితాము చేసకుంటూ పోతున్నారు. ప్రజల సంక్షేమం పైనే దృష్టి పెట్టారు.

– ప్రాథమిక సాక్ష్యాలు ఉండటం వల్లే అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ళ నరేంద్ర, కొల్లు రవీంద్రల మీద కేసులు నమోదయ్యాయి. అంతేకానీ ఎవరిపైన అయినా వ్యక్తిగత కక్షతో, ఆధారాలు లేకుండా కేసులు పెట్టించే ప్రయత్నం చేయలేదు. తెలుగుదేశం హయాంలో శ్రీ వైయస్ జగన్ పై ఎన్ని అబద్ధపు కేసులు బనాయించారో అందరికీ తెలుసు. కానీ మేం అటువంటి విధానాలకు దూరం. రఘురామకృష్ణరాజును రమేష్‌ ఆసుపత్రికి పంపాలని ఏ బేసిస్‌పై అడుగుతున్నారు? ఆ ఆసుప్రతి యాజమాన్యం టిడిపి అనుకూల వ్యక్తులది. అక్కడికే ఎందుకు తీసుకువెళ్ళాలనే దానికి వారి దగ్గర సమాధానం లేదు. ఆ ఆసుపత్రికి పోకపోవడమే నేరం అయినట్లు మాట్లాడటం టిడిపి వారి బరితెగింపుతనం. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి అది. కమర్షియల్‌గా వ్యాపారం చేసుకుంటున్న, కేసులు ఉన్న ఆసుపత్రి అది. దానిని గురించి ప్రశ్నించడం ఆశ్చర్యం వేస్తోంది. చట్టప్రకారమే సిఐడి చర్యలు తీసుకుంది.

–  తెలుగుదేశంకు ఏ వ్యవస్థలు, ఏ శక్తులు వారికి అండగా ఉన్నాయో అందరికీ తెలుసు. వారుచేస్తున్నదే సరైనదనే విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు హైకోర్ట్ బెయిల్‌కు పోయిన సందర్బంలోనూ టార్చర్‌ అనే మాట లేదు, బెయిల్ రాకపోవడంతో టార్చర్‌ చేశారనే వాదనకు తెరతీశారు. వారి అడ్వోకేట్ రిక్వెస్ట్ మీద ఆయనను మెడికల్ బోర్ట్ ముందుకు తీసుకువెళ్లి పరీక్షలు చేయించాము. మేజిస్ట్రేట్‌ కోర్ట్‌లో రమేష్‌ హాస్పటల్స్‌కు తీసుకువెళ్ళాలని వాళ్ళు కోరతారు. ఎందుకు రమేష్‌ ఆసుపత్రికే తీసుకుపోవాలి? ఒక ప్రైవేటు ఆసుపత్రికి ఎలా తీసుకువెళ్లాలని అడుగుతారు? అదేమైన ఛారిటీతో మంచిపేరు ఉన్న ఆసుపత్రి కాదు. ప్రభుత్వ ఆసుపత్రిపైన విశ్వాసం లేదని ఎలా అంటారు? కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను సీఎం గారికి ఎలా ముడిపెట్టి ఆరోపణలు చేస్తారు? ఇందులో ఎక్కడ హేతుబద్దత ఉంది?

–  ప్రతిపక్షంగా మీ కక్షసాధింపు మాపైన ఎక్కువ అయ్యింది. పవర్‌ను వెనుక నుంచి నడపడం తెలిసిన వారు, మీడియా బలం చూసుకుని, మా ప్రభుత్వాన్ని చికాకు పెట్టడంలో నిజంగానే సఫలీకృతం అవుతున్నారని అనిపిస్తోంది. అయినా కూడా నిబ్బరంగా అన్నింటిని ఎదుర్కొంటాం. ప్రజల దీవెనలు మా పార్టీకి, మా ప్రభుత్వానికి ఉన్నాయి. రోజురోజుకు జగన్ గారి పట్ల ఆదరణ పెరుగుతోంది.

–  రఘురామకృష్ణరాజును పోలీసులు మైక్రో లెవల్‌లో కాలి వేలి దగ్గర గాయం చేయగలరా? అది సాధ్యమా? నిజంగా ఫ్యాక్చర్ అయి ఉంటే వాపు వస్తుంది, కనీసం నడవలేరు. కారులో వెళుతూ కూడా ఆయన కాలు పైకి ఎత్తి చూపారు, కోర్ట్‌కు నడుచుకుంటూ వచ్చారు. నిజంగా ఫ్యాక్చర్ అయితే చాలా నొప్పి ఉంటుంది. అటువంటి ఛాయలు ఎక్కడా లేదు. ఆయనపై ఎటువంటి టార్చర్  జరగలేదు, అటువంటి అవకాశం కూడా లేదు, ఒక ఎంపీని పనికట్టుకుని పోలీసులు వ్యక్తగత కసితో దాడి ఎందుకు చేస్తారు? మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఎటువంటివి జరగలేదు. బెయిల్ రద్దు కావడంతో ఈ డ్రామకు తెరలేపారు. అదికూడా చంద్రబాబు డైరెక్షన్‌లోనే ప్రారంభించారు. ఈ కుట్ర కేసులో ఆధారాలతో సహా దొరికిపోతామనే భయం వారిలో ఉంది. మేం ప్లెయిన్‌గా ఉంటున్నాం, వారు కుట్రలు పన్నుతున్నారు. ప్రభుత్వాన్ని కూడా తమ తెలివితేటలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు.