ఇలాగైతే స్టేషన్లు ముట్టడిస్తాం:నెల్లూరు ఎస్పీకి సోమిరెడ్డి లేఖ

197

న్యాయం చేయాల్సిన పోలీసులే దాడులు, అక్రమ కేసులతో అమాయకులను వేధించడం దుర్మార్గమని మాజీ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఎస్పీకి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాశారు. పరిధి దాటి వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కొడవలూరు ఎస్సై టీడీపీ సానుభూతిపరులను వైసీపీ నేత గెస్ట్ హౌస్‌కి పిలిపించి వారి సమక్షంలో కొడుతుండటం అమానుషమన్నారు. వైసీపీ నేత పిలిస్తే వెళ్లి కలవలేదని టీడీపీ సానుభూతిపరుడు ఒబ్బాని శ్రీనివాసులును కులం పేరుతో దూషించి, లాఠీలు విరిగేలా కొట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దాడులకు పాల్పడటమే గాక తిరిగి బాధితులపైనే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కొడవలూరు ఎస్సైపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే అఖిలపక్షంతో కలిసి స్టేషన్ల ముట్టడికి వెనుకాడబోమని సోమిరెడ్డి లేఖలో స్పష్టం చేశారు.