ఆపదలోనూ అరాజకీయం!

473

ఆపదలోనూ అత్యంత భాధ్యతతో కూడిన కర్తవ్య దీక్ష బూనిసేవలందించి సమాదానం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద దబ్బలం పట్టుకొని అందరి నోళ్ళు కుట్టేస్తే రాజ్యమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నట్లు ఎంచక్కా ప్రచారం చేసుకోవచ్చని రాజద్రోహం ఏమిటి? ఇంకెన్నిటి కింద అయినా సరే కేసులు పెట్టేందుకు పూనుకొన్నది. అందరికీ వైధ్యసేవలు,ఆక్సిజన్ అందించడం కంటే అదే సులువైన పనిగా  భావించింది జగన్ ప్రభుత్వం. ప్రజాస్వామ్యమైతే  ఏంటట ?రాజు తలుచు కొంటె దెబ్బలకు కొదవా? కరోనా వచ్చినా,మరొక కల్లోలం మీద పడినా జనం ఎవ్వరూ కనీళ్లు పెట్టుకో కూడదు జగన్ పాలనలో.

మరణ మృదంగ ద్వనితో  రాష్ట్రం మార్మోగుతున్న వేళ అసెంబ్లీలో కరోనా కాకమ్మ కబుర్లు చెప్పిన ముఖ్యమంత్రికి ఆయన  భజన బృంధం గండపెండారాలు తొడిగి రుణం తీర్చుకొన్నారు. ప్రజలకు పొల్లు ప్రవచనాలు ఉదారంగా దానం చెయ్యడంలో జగన్ ని మించిన నాయకుడు లేడు. ప్రజల  కష్టాలు పట్టని పాలకులు ఎలా వుంటారో ప్రజలు తొలి సారి చూస్తున్నారు.జగన్  ప్రభుత్వం ప్రజలను పౌరులుగా పరిగణించడం లేదు.కేవలం  ఓట్లెసి గెలిపించే మరమనుషులు గా మాత్రమే చూస్తున్నారు జగన్. ఏడాది నుండి కరోనా  కరాళ నృత్యం చేస్తున్నా ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడానికి  చేసింది శూన్యం .కరోనా పై యుద్దం చేయాల్సిన ముఖ్యమంత్రి  ప్రతిపక్షాల పై,మీడియా పై యుద్దం చేస్తున్నారు.కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతికి రాష్ట్రం అల్లకల్లోలం అయింది. ఆక్సిజన్ అందని అభాగ్యుల ఆర్తనాధాలు మిన్నంటుతున్నాయి  .ఆసరా దొరక్క జనం ఆక్రందనలు చేస్తున్నారు.ప్రతిరోజూ 23 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతుండగా,100 కి పైగా మరణాలు సంభవిస్తున్నా కోవిడ్ ను ఎదుర్కోవడంలో దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు చెప్పు కొంటున్న అసత్య ప్రచారాల డొల్ల తనాన్ని శ్మశానాలు బయట పెడుతున్నాయి.కరోనా విలయాన్ని ఎదుర్కోవడంలో నాసిరకం నాయకత్వం స్పష్టంగా కనిపించింది.

కరోనా దాడికి  జనం బీతిల్లుతుండగా  కరోనా కట్టడి పై జగన్ ప్రభుత్వం నీరో చక్రవర్తిని తలపిస్తుంది.ఇంత భాధ్యతా రాహిత్యంగా వున్న ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నిస్తే,విమర్శిస్తే,నిరశిస్తే మాత్రం ఓర్వలేక  విశక్షణా రాహిత్యంతో ప్రజాస్వామిక హక్కుల  పీక నులిమి వేయడానికి సిద్దపడింది వైకాపా ప్రభుత్వం.చిన్న విమర్శను సైతం తట్టుకోలేక రాజద్రోహం,దేశద్రోహం వంటి  కటినాతి,కటిన మైన సెక్షన్ల కింద కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం వ్యతిరేక,వాస్తవిక కధనాలను ప్రచురిస్తున్న ఏబీఎన్, టీవి 5 వంటి మీడియా సంస్థల పైనా రాజద్రోహం,దేశద్రోహం వంటి కేసులు ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడటం నిత్యకృత్యం అయింది.ప్రశ్నించే  గొంతులను,మీడియాను ఎదో ఒక విధంగా అణచి వెయ్యడమే  ఎజెండాగా పెట్టుకొన్నారు. తమతప్పులు ఎత్తి చూపే మీడియా ఉండకూడదు. తమ తప్పులు రాసే  కలాలు ఉండకూడదు, ప్రశ్నించే గొంతులు ఉండకూడదు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల పక్షాన నిలుస్తున్న మీడియా పై  రాజద్రోహం,దేశద్రోహం వంటి కేసులు పెట్టె  పాపకార్యానికి పూనుకోవడం  బాధాకరం.

బ్రిటీష్ వారు భారతీయులను తొక్కి పెట్టేందుకు తెచ్చిన నల్ల చట్టాలు నేటి పాలకులకు అక్కరకు రావడంతో  చప్పుడు లేకుండా వాటినే కొనసాగిస్తున్నారు. భాధ్యతా యుతమైన పౌరులు క్రియాశీలంగా వ్యవహరించకపోతే అధములు పాలకులుగా అవతారమెత్తి చట్టాలు చేసి మన జీవితాలను శాసిస్తారని కొన్నేళ్ళ క్రితం ప్లేటో  మహాశయుడు చేసిన వ్యాఖ్య నేడు నిజమైంది. తమను వ్యతిరేకించే ప్రత్యర్ధుల పై రాజకీయ కక్ష సాధించడానికి చూపుతున్న శ్రద్ద, వేగం ప్రజలు ప్రాణాలు కాపాడటం పై చూపడం లేదు. రాగ ద్వేషాలకు అతీతంగా,రాజ్యాంగ బద్దంగా పాలన సాగిస్తామని పదవి ప్రమాణం చేసి అధికార పీటాలు అధిష్టించిన పాలకులు ఏదో  ఒక వంకన పత్రికా స్వేచ్చను,భావ ప్రకటనా స్వాతంత్రాన్ని కబళించే కుట్రలకు పాల్పడుతున్నారు. న్యాయస్థానాలు భావ ప్రకటన స్వేచ్చకు మరొకసారి  గొడుగు పట్టాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి.దాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వాలు చేసే చట్టాలను,చర్యలను తోసిపుచ్చడం న్యాయస్థానాల ప్రాధమిక విధికావాలి .తమకు ఎదురు రావడమే మహాపరాధమన్నట్లు ఎక్కడికక్కడ ప్రభుత్వం వీరావేశం ప్రదర్శించడంతో రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కుల పరిరక్షణ కోసం పదే,పదే సుప్రీం కోర్టును ఆశ్రయించక తప్పని దురదృష్ట కర వాతావరణం నేడు నెలకొన్నది.

పత్రికలు తీవ్రంగా విమర్శించి నప్పుడే పత్రికా స్వాతంత్రానికి నిజమైన గౌరవం దక్కినట్లు అన్నారు మహాత్మాగాంధి.ఆ స్పూర్తి పత్రికల తో పాటు ఎలక్ట్రానిక్  ప్రసార మాధ్యమాల్లో పరిమళించి నప్పుడే భావ ప్రకటనా స్వేచ్చ గుబాళిస్తుంది.అత్యున్నత రాజ్యాంగం గల దేశం మనది.అది వ్యక్తి స్వేచ్చకు బరోసాగా నిలుస్తుంది. మీడియా గొంతు నులిమెందుకు జీఓ 2340 జారీ చేసింది జగన్ ప్రభుత్వం.నిజం మాట్లాడినా,నిజాలు రాసినా,చూపినా ఏకంగా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శించడంలో రాటు తేలిపోయిన పోలీసులు  చట్టాలకు అడ్డగోలు భాష్యాలు చెప్పి సాదారణ పౌరుల మీద పడి పోతున్న దౌర్జన్యాలు వ్యక్తి  స్వేచ్చ పత్రికా స్వాతంత్రాల పై కత్తి కట్టడమే. మీడియా స్వాతంత్రానికి సమూలంగా గోరీకట్టే  నిరంకుశ దొరణిని  ఎప్పటికప్పుడు తుంచి వెయ్యకపోతే  ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు.

ప్రభుత్వ యంత్రాంగాన్ని తీవ్రంగానే విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి వుంది. హింసను ప్రేరేపించి నట్లు అయితేనే ప్రభుత్వం ఎవరి మీద అయినా రాజద్రోహం  కేసు పెట్ట గలదు  అని 2015 లో బాంబే హైకోర్టు స్పష్టం  చేసింది. బ్రిటీష్ కాలం నాటి  రాజద్రోహం వంటి అధికరణలు  ఇప్పటికీ ఇక్కడ  కొనసాగుతుండగా  పదేళ్ళ నాడే బ్రిటన్ వాటిని  తన రాజ్యాంగం నుంచి తొలగించింది.

అసమర్ధ,అసంబద్ద పరిపాలనతో పరువు,ప్రతిష్టలు కోల్పోయిన పాలకులు పరువు ప్రతిష్టలు అంటూ గింజుకోవడం  విడ్డూరంగా వుంది. పరువు నష్టం, రాజద్రోహం వంటి  పెట్టుడు కోరలతో  తమకు నచ్చని భిన్నగళాలను,మీడియాను కర్కశంగా  నమిలేసే నిరంకుశత్వం పెరిగిపోతుంది. అంతర్జాలంలోని  సోషల్ మీడియా  వేధికల ద్వారా యువత కలబోసుకొనే  చర్చల పైనా  కత్తిని ఘులిపించి అమానుష నిర్భంధానికి పాల్పడుతుంది  ప్రభుత్వం. కావునా పరువు నష్టం చట్టాన్ని  శిక్షర్హ నేరాల చిట్టాల నుంచి తొలగించడం భావ ప్రకటన స్వేచ్చ పరిరక్షణలో మొదటి ప్రాధాన్యత కావాలి. మీడియాను కూడా  రాజద్రోహం కేసుల్లో ఇరికించే ప్రయత్నాన్ని న్యాయస్థానాలు అడ్డుకోవాలి.

ప్రభుత్వం మీద విమర్శకు కూడా ఆస్కారం లేకపోతే ఎన్నికలు ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? జగన్ తనది రాచరిక పాలన  అని,బ్రిటీష్ వారి ప్రభుత్వం అనుకొంటున్నారా ? ఒక ఎంపీ ప్రభుత్వం మీద చేసిన విమర్శలను ప్రసారం చేసినందుకు  ఎబియన్, టీవి 5 మీడియా వ్యవస్థల పై  రాజద్రోహం, దేశద్రోహం వంటి కేసులు పెట్టె  దుస్సాహసానికి ఒడిగట్టిన జగన్  మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆయన పెత్తందారులను మించిపోవడమే  కాదు నియంతలా  వ్యవహరిస్తున్నారు,మీడియా,ప్రతిపక్షాలు ప్రభుత్వానికి భజన చేయాలని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో  అదెలా సాధ్యం?మీరు ప్రతి పక్షంలో వున్నప్పుడు గత ప్రభుత్వం పై  విషం కక్క లేదా ? ఒక  ఎంపీ  చేసిన  వ్యాఖ్యల్లో రాజద్రోహం వుందని భావిస్తే, అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి, మంత్రులు,స్పీకర్,అనేక మంది  అనేక సార్లు  ఒక కులం పై  దాడి చేయలేదా? మరి మీ పై దేశద్రోహం కేసులు పెట్టాల్సిన అవసరం లేదా ?వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీకి కూడా కులాన్ని ఆపాదించడాన్ని ఎలా సమర్ధించుకొంటారు ?  మీడియాను  ఇంతగా వివాదాస్పదం చేయడం ఎక్కడనా వున్నదా?  తమ లోపాలను  ఎత్తిచూపితే  సవరించు కోవడం విజ్ఞులు లక్షణం. అలా కాకుండా మమ్మల్నే విమర్శిస్తారా అంటూ దేశద్రోహం  కేసులు పెట్టడం బరితెగించడం కాదా?.  మేము చెప్పిందె  వేదం చేసిందే  బ్రమ్మాoడం  అన్న విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో  చెల్లదు. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే,ఉన్నది ఉన్నట్లు రాస్తే ఉలుకెందుకు? వాస్తవాలను  విస్మరించి  అంతా బ్రమ్మాoడం అని,ఇతరులు కూడా ఆదే నమ్మాలని,తన మీడియా చెప్పేవే వాస్తవాలని,అవే చూడాలని,అవే  చదవాలని  జగన్ అండ్ కో ఉద్దేశ్యoగా కనిపిస్తుంది.

ఏపీ లో అధికార పక్షం ధోరణి రోజు,రోజుకు శృతి మించి విపరీతపోకడలు ప్రదర్శిస్తుంది. ఎంతసేపు ప్రశ్నించే వారిని  వేధించడం,అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నది ప్రభుత్వం. ప్రతి పక్షాన్ని,నచ్చని మీడియాను అణచివేత కోసమే అధికారంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది తప్ప,అభివృధ్ధికోసం వచ్చినట్లు లేదు. పాలనా వైఫల్యాలను,అక్రమాలను  దాచిపెట్టి జనాన్ని కుడి, ఎడమల దగా చెయ్యాలన్న దురుద్దేశ్యంతో  ఏబీఎన్,టీవీ 5 చానల్స్  అక్రమ కేసులు బనాయించారు. ఈ ధోరణిని అరికట్టలేకపోతే ప్రజాస్వామ్య మనుగడ పెను ప్రమాదంలో పడటం కాయం.  తప్పును తప్పుగా చెప్పకూడదు,చూపకూడదు అంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు?.

మీరు ఏం చేసినా నోరు ఎత్తవద్దని హుకూం జారీ చేస్తే  మీడియా  చెతులు కట్టుకుని నిలబడలా?నిజాలు ప్రజల ముందుంచడం మీడియాది నేరమా? ప్రభుత్వ వైఫల్యాలు లేనప్పుడు,తెరవెనుక లావాదేవీలు లేనప్పుడు మీడియా అంటే అసహనం ఎందుకు?

ఒక ప్రక్క నాది పారదర్స క ప్రభుత్వం అంటూ బాకాలూదుతూ, మరో పక్క రహస్యాలు ఎందుకు?మీడియా నోరు,కళ్ళుచెవులు మూస్తే ప్రజలకు దిక్కెవ్వరు?  అంతా బ్రమ్మాoడం అని చెప్పుకుంటున్నవారు మీడియాకు  ఎందుకు భయపడుతున్నారు?ప్రభుత్వం లో జరుగుతున్నది ప్రజలకు తెలియకుండా దాచిపెట్టాలని చూడటం సమర్ధనీయమా?. రాజకీయ ప్రయోజనాలకోసం రూ1246 కోట్ల విలువైన మీడియా సామ్రాజ్యం స్థాపించి నచ్చని పత్రికల పై. ప్రతిపక్షం పై  మీరు విషం కక్కువచ్చు. మీ సొంత  మీడియాలో నిరాధారా  ఆరోపణలతో  కధనాలు రాయవచ్చు,చూపవచ్చు. కానీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను, అక్రమాలను, అసమర్ధతను ఇతర మీడియా సంస్థలు రాయకూడదు,చూపకూడదా ?,టీవీ చానల్స్ ప్రజాహితం కోసం, ప్రజల్ని చైతన్యం చేయడం కోసం పనిచేస్తాయి.

కావునా పత్రికా స్వేచ్ఛ కు  సంకెళ్లు వేస్తే పుట్టగతులు ఉండవ నే విషయాన్ని పాలకులు గుర్తించాలి. అన్యాయాలకు,అవినీతికి,చేతకాని తనానికి భజన చేయడానికి మీడియా మీ గడిలో బానిస కాదుకదా?  ఏది ఏమైనా అసమర్ధ పాలనతో మసక బారిన ప్రతిష్టను కాపాడుకోవడానికి, రాష్ట్రాన్నిఅధోగతి పాలు చేసిన పాపం  తనకు చుట్టుకో కుండా వుండేందుకు  ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి జగన్  ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధుల పైకి ఏసిబిని,  సిఐడి ఉసి గొల్పుతూ,మీడియా పై  రాజద్రోహం వంటి కేసులు బనాయిస్తుంది. ప్రతీకార రాజకీయంపై చూపిస్తున్న పట్టుదల రాష్ట్రాభివృద్ది పై,ప్రజా ప్రయోజనాలు నెరవేర్చడంపై  చూపడం లేదు.

-నీరుకొండ ప్రసాద్