ఉక్కు పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: బాబు

128

వైజాగ్ ఉక్కు పరిరక్షణకు టీడీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. కరోనా విపత్కర కాలంలో రోజుకు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దేశానికి ఊపిరి పోసింది వైజాగ్ ఉక్కు కర్మాగారమన్నారు. వెయ్యి పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు కూడా ముందుకొచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడుతోందని చెప్పారు. అటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కబళించాలని కొందరు వైసీపీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 100 రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో ఒక్కమాట కూడా మాట్లాడని వైసీపీ, అసెంబ్లీలో తీర్మానం చేయడం ప్రజలను మోసం చేయడం కాదా..? అని ప్రశ్నించారు. వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైందని… వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.