నందివాడ మండలంలో 1,639 మంది లబ్ధిదారులకు ఇళ్ళపట్టాలిచ్చాం

328

– 43 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సేకరించాం
– జనార్ధనపురంలో 379 మందికి ఇళ్ళపట్టాలను పంపిణీ చేశాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, మే 22: గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలోని 23 గ్రామాల్లో 1,639 మంది లబ్ధిదారులకు ఇళ్ళపట్టాలను పంపిణీ చేశామని, వీరంతా ఇళ్ళు నిర్మించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. నందివాడ మండలం జనార్ధనపురంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో ఉన్న రెండు లేఅవుట్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇళ్ళనిర్మాణంలో కీలకమైన లెవలింగ్ పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి మంత్రి కొడాలి నాని పరిశీలించారు.

అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంపై సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. జగనన్న కాలనీల్లో వసతుల కల్పనతో పాటు టిడ్కో ఇళ్ళ నిర్మాణంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. జగనన్న కాలనీల్లో జూన్ 1వ తేదీ నుండి పనులను ప్రారంభించాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారన్నారు. కాగా నందివాడ మండలంలో 27 ఎకరాల ప్రభుత్వ భూమిని, 16 ఎకరాల ప్రైవేట్ భూములను ఇళ్ళపట్టాల పంపిణీ కోసం సేకరించామన్నారు. మండలంలోని జనార్ధనపురం గ్రామంలో 379 మందికి రెండు లేఅవుట్లలో ఇళ్ళపట్టాలను కేటాయించామన్నారు. ఇందు కోసం 10.83 ఎకరాల భూమిని సేకరించామన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణానికి నీరు, విద్యుత్ వంటివి అవసరమని, వెంటనే ఆ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్మోహనరెడ్డి సూచించారన్నారు. ప్రతి లేఅవుట్ లోనూ మోడల్ హౌస్ ను నిర్మిస్తామన్నారు. ఇళ్ళు నిర్మించే ప్రాంతంలో తగిన వసతులను కల్పించడం ముఖ్యమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పక్కా లేఅవుట్లను రూపొందించామన్నారు. ఈ లేఅవుట్లలో సీసీ రోడ్లు, భూగర్భ సీసీ డ్రైన్లు, నీటి సరఫరా, విద్యుద్దీకరణ, ఇంటర్నెట్ వంటి వసతులను కల్పిస్తామన్నారు.

ఈ ఏడాది జూన్ నెల్లో జగనన్న కాలనీల్లో ఇళ్ళనిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ నాటికి బేస్ మెంట్ పనులు పూర్తవుతాయన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి గోడల నిర్మాణ పనులు, ఆ తర్వాత 2022 జూన్ నాటికి ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని వైఎస్సార్ జగనన్న కాలనీల్లోని 8,679 లేఅవుట్లలో నీటి సరఫరాకు సంబంధించి రూ.920 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. మొదటి దశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 8,905 లేఅవుట్లలో ఇళ్ళ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. ఇళ్ళ నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదని సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. కోవిడ్ సమయంలో ఇళ్ళనిర్మాణ పనులు చేపట్టడం వల్ల ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందుతుందన్నారు. కార్మికులకు కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పారు. స్టీల్, సిమెంట్, ఇతర మెటీరియల్స్ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు కూడా జరుగుతాయని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో జీ శ్రీనుకుమార్, మండల తహసీల్దార్ అబ్దుల్ రెహ్మాన్ మస్తాన్, జనార్ధనపురం సర్పంచ్ దారా మరియమ్మ, వైసీపీ నేతలు పాలడుగు రాంప్రసాద్, కొండపల్లి కుమార్ రెడ్డి, కొప్పుల జయరాజు, బోనం శివాజి, బేతాళ రామారావు, కొల్లారెడ్డి నారపరెడ్డి, జనార్ధనపురం పాపారావు, దుర్గారావు, కొండ తదితరులు పాల్గొన్నారు.