వ‌ల‌స జ‌న నేస్తం..పుసులూరి నారాయ‌ణ‌స్వామి !

519

తెలంగాణాలో సాంప్ర‌దాయ బ్రాహ్మ‌ణ కుటుంబంలో  పుట్టి వ‌ల‌స కార్మిక నేతగా ఎదిగిన సోషలిస్టు నాయకుడు పుసులూరి నారాయ‌ణ‌స్వామి.  బీడీ కార్మికులు, ఇటుక‌బ‌ట్టీ, క‌ల్లుగీత‌, చేనేత‌, బ‌జారు హ‌మాలీలు,  హోటల్ వర్కర్స్, సెక్స్ వర్కర్స్ నుంచి గ‌ల్ఫ్ వ‌ల‌స కార్మికుల‌ దాకా అందరికీ నాయకత్వం వహించి బంద్‌లను, ఆందోళనలను ఆయుధంగా మల్చుకున్న ఫైర్ బ్రాండ్  నేత పుసులూరి నారాయ‌ణ‌స్వామి. తెలుగుదేశం పార్టీలో కీల‌క నేత అయిన‌ప్ప‌ట్టికీ  ఆయన జీవితంతో ప్రధానంగా ముడిపడిన అంశం కార్మిక వర్గమే.  తెలంగాణాలోని అనేకానేక కార్మిక శాఖలకు ఆయన నాయకుడిగా ఎదిగారు.  కాంట్రాక్ట‌ర్ల పాలిట సింహ‌స్వ‌ప్న‌మై  సంచలనాలకు మారుపేరుగా మారారు నారాయ‌ణ‌స్వామి.

ర‌మీజాబీ రేప్‌కేసును నిర‌సిస్తూ జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో రోడా మేస్త్రీ ఛోడో మినిస్ట్రీ నినాదం ఇచ్చిన వ్య‌క్తి నారాయ‌ణ‌స్వామి. జోగినీ వ్యవస్థను రద్దు చేయాలంటూ  సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.మ‌హ‌బూబ్ కీ మెహందీని హైద‌రాబాద్ నుంచి వెళ్లగొట్టిన యాక్టివిస్ట్‌. 12 ప్ర‌శ్న‌ల‌తో రామాకాంత్ ఎన్‌కౌంట‌ర్‌పై కోర్టును ఆశ్ర‌యించి పోలీసుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించాడు.  పొగడ్తలు, విమర్శలు ఎన్నున్నా కార్మిక నేతగా కుల మత ప్రాంతాలకు అతీతంగా  రెబల్ నేతగా ఆయన గుర్తింపు పొందారు.  రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన విశిష్ట నాయకుడు.

బీడీ కార్మికులు, ఇటుక‌బ‌ట్టీ, క‌ల్లుగీత‌, చేనేత‌, బ‌జారు హ‌మాలీలు,  హోటల్ వర్కర్స్, సెక్స్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు, పారి శుద్ధ్య కార్మికులు, హోటల్‌ కార్మికులు మెకానిక్‌లు, షాపు కార్మికులు, తోపుడు బండ్లపై, ప్లాట్‌ఫార్మ్‌లపై చిరువ్యాపారస్తులు,  రవాణా కార్మికులు, ఇండ్లలో పనిచేసేవారు, సెక్యూరిటీ గార్డుల నుంచి గ‌ల్ఫ్ వ‌ల‌స కార్మికుల‌ దాకా అందరికీ నాయకత్వం వహించారు. శ్రామికుల కోసం ఆయన తన జీవన శైలిని మార్చుకున్నారు.

ఈ ప్రయాణంలో కార్మికులతో మాట్లాడుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, వాటిని పరిష్కరిస్తూ, కార్మిక ఐక్యతా సంఘాలను ఏర్పాటు చేస్తూ ఎంతో ఆత్మానందాన్ని పొందటమే కాక, ఎదుటివారిని కూడా ప్రభావితం చేస్తూ, వారు ఎంతటి సమూహం, వ్యక్తి  అయినా,  వారి నుండి, తాను కోరుకున్న విధానంలో  అనుకూలమైన పరిష్కారాలను పొందారు. లేబర్‌ అడ్డాలపై మహిళలకు టాయిలెట్స్‌, వేచి ఉండటానికి షెడ్డులు, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి.  అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి సరిపోయే నిధులు కేటాయించి సక్రమంగా ఖర్చు పెట్టాలని డిమాండ్ ప్ర‌భుత్వం ముందు పెట్టారు.

అనేక దేశాలలో పర్యటించి అక్కడి సామాజిక స్థితిగతులను అధ్యయనం చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలలోని శ్రామికుల స్థితిగతులపై అధ్యయనం చేశారు. అనేక దేశాలతోనూ, దేశాలలోని కార్మిక సంస్థలతోను చక్కని సంబంధాలు కలిగి ఉండి వారిపై తనదైన ముద్ర వేశారు నారాయ‌ణ‌స్వామి.

 – డాక్ట‌ర్ ఫ‌జులుల్లాఖాన్‌