అందరినీ పాస్ చేసిన సబితా ఇంద్రారెడ్డి…

587

కరోనా ఉధృతి నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉత్తిర్ణులను చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  నిర్ణయం మేరకు అందరిని ఉత్తిర్ణులను చేశామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 2020-21 విద్యా సంవత్సరంలో భౌతిక తరగతుల నిర్వహణ సాధ్యం కాని సమయంలో డిజిటల్ తరగతులను నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, ఇది గౌరవ ముఖ్యమంత్రికి విద్యా రంగం పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని అన్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073  మంది విద్యార్థులను ఉత్తిర్ణులను చేసినట్లు మంత్రి తెలిపారు. వీరిలో 5, 16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని అన్నారు. రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు కాగా, 2,53,661 మంది విద్యార్థులు బాలికలు ఉన్నారని తెలిపారు. 2,10,647  మంది విద్యార్థులు  10/10 జి.పి.ఎ. సాధించినట్లు మంత్రి  వెల్లడించారు.

ఇంటర్నల్ అసెస్మెంట్  మార్కుల ఆధారంగా కేటాయించిన గ్రేడ్ ల వివరాలను  WWW  .bse .telangana.gov.in,   http.//results .BSETELANGANA .ORG వెబ్ సైట్ లలో సాయంత్రం మూడు గంటల నుంచి పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సూచించారు.  విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్.ఎస్ .సి. బోర్డుకు పంపిన యెడల వెంటనే సరిదిద్దడం జరుగుతుందని తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్ లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని  తమ భవిష్యత్ ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి కోరారు.