హామీలు కొండంత ..కేటాయింపులు గోరంత‌

266

– ఇది అయోమ‌యం జ‌గ‌న్ నాధం బ‌డ్జెట్‌
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

రాష్ట్రంలో ప్ర‌తీ రంగానికి కొండంత హామీలు ఇచ్చిన జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం, బ‌డ్జెట్ లో మాత్రం గోరంత కేటాయించింద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ విమ‌ర్శించారు. జ‌గ‌న్‌ని పొగిడేందుకు త‌ప్పించి, ఈ తూతూమంత్ర‌పు బ‌డ్జెట్‌తో జ‌నానికి ఒరిగేదేమీ లేద‌న్నారు. ఇది మోస‌పూరిత అయోమ‌యం జ‌గ‌న్ నాధం బ‌డ్జెట్ అని ఆరోపించారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మూడేళ్ల‌లో పూర్తి చేస్తామ‌న్న కడప స్టీల్ ప్లాంట్, రెండేళ్లు పూర్త‌యినా అతీగ‌తీ లేదన్నారు. స్టీల్‌ఫ్యాక్ట‌రీకి మొత్తం 11 వేల కోట్లు అంచనా వ్యయం అయితే, ఈ బడ్జెట్ లో ఇచ్చింది రూ.250 కోట్లు కేటాయించారంటే దీనిపై ఉన్న చిత్త‌శుద్ధి తేట‌తెల్ల‌మైంద‌న్నారు. అవ్వా తాతలకు 3 వేలు పింఛ‌ను చేస్తామ‌న్న హామీ తుంగ‌లో తొక్కార‌ని, 250 లెక్క పెంచుతామ‌న్న మాట మార్చుడుకి కూడా ఈ బ‌డ్జెట్‌లో ప్ర‌స్తావ‌న లేద‌న్నారు.

ఆర్భాటంగా 56 బీసీ కార్పొరేషన్ల‌ను ఏర్పాటు చేశారు కానీ ఒక్క రూపాయి కేటాయించ‌క‌పోవ‌డం బీసీల‌కు న‌మ్మ‌క‌ద్రోహం చేయ‌డ‌మేన‌న్నారు. కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌కు రూ.500 కోట్లు, వ్యాక్సిన్ ల కోసం  రూ.500 కోట్లు కేటాయించారంటే ఈ ఏడాది క‌రోనాతో స‌హ‌జీవ‌నం త‌ప్ప‌న‌ట్టేన‌ని అన్నారు. విధ్వంస‌పాల‌న‌, క‌రోనా మ‌హ‌మ్మారితో అన్నిరంగాలూ సంక్షోభంలో ప‌డితే 2021-22లో రెవెన్యూ రాబడిని రూ.1.77 లక్షల కోట్ల‌ని ఎలా అంచనా వేస్తార‌ని ప్ర‌శ్నించారు. అధ్వాన‌పాల‌న పుణ్య‌మా అని రియల్‌ ఎస్టేట్‌, రవాణా తదితర రంగాలన్నీ మైనస్‌ వృద్ధి రేటు నమోదు చేయ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు.

చంద్రబాబు గారి హయాంలో తలసరి ఆదాయం రూ.82,000 నుంచి రూ.1,64,000 కి 50 శాతం పెరిగితే, జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో 1.03 శాతం మాత్ర‌మే పెర‌గ‌డం స్ప‌ష్టంగా గ‌మ‌నించొచ్చ‌ని అన్నారు. లేని ఆదాయాన్ని వేల కోట్లు పెంచి చూపించిన బుగ్గన గారు, అప్పులు మాత్రం తక్కువ చేసి చూపించ‌డం ఇది అంకెల గార‌డీ బ‌డ్జెట్ అని స్ప‌ష్ట‌మైంది. ఈ ఏడాదికే పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌న్న ప్ర‌భుత్వం  కేవలం రూ.4,510.41 కోట్లు కేటాయించడంలో ఆంత‌ర్య‌మేంట‌ని ప్ర‌శ్నించారు. 2019-20లో రెవెన్యూ లోటును కేవలం రూ.1,778.52 కోట్లకే పరిమితం చేస్తామనిచెప్పి, ఏకంగా రూ.26,440.52 కోట్లకు చేర్చార‌ని, 2020-21లో రూ.18,434.14 కోట్లకు రెవెన్యూ లోటు పరిమితం చేస్తామని, ఏకంగా రూ.34,926.80 కోట్లకు చేర్చార‌ని, ఇలాగే కొనసాగితే రాష్ట్రం దివాళా తీయటం ఖాయమ‌న్నారు.జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న‌తో వ్యవసాయ వృద్ధి రేటు 4.16 శాతానికే పరిమితమైంద‌ని, నిరుద్యోగం గణనీయంగా పెరిగింద‌ని, పారిశ్రామిక వృద్ది రేటు -3.26 శాతానికి, సేవారంగం వృద్ధి రేటు -6.71శాతానికి పడిపోయాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

పేద‌ల‌కు రూ. 50,940 కోట్లతో ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన జగన్ రెడ్డి, బడ్జెట్ లో మాత్రం కేవలం రూ. 5,661 కోట్లే కేటాయించార‌న్నారు. గత ఏడాది బ‌డ్జెట్‌లో నీటిపారుద‌ల రంగానికి రూ.11,800 కోట్లు కేటాయించిన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు 5238 కోట్లు ఖ‌ర్చు పెట్టి, ఏ ప్రాజెక్టునీ పూర్తి చేయ‌లేక‌పోయిందన్నారు. అగ్రిగోల్ద్ బాధితులకు రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఈ బడ్జెట్ లో 200 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నార‌ని ఆరోపించారు.20-21 గాను అగ్రిగోల్డ్ బాధితులకు కేవలం 5లక్షలు మాత్రమే ఖర్చు చెయ్యడం దారుణమని అన్నారు.

2019-20లో మద్యం ఆదాయం రూ.6,914కోట్లు అయితే, 2020-21లో రూ.11,575 కోట్లకు చేరుకుంద‌ని, వ్యాట్‌ తో కలిపి రూ.18వేల కోట్లకు చేరింద‌ని, మ‌ద్యంపై ఆదాయం మూడింత‌లు పెంచుకోవడాన్ని జ‌గ‌న్‌రెడ్డి భాష‌లో మ‌ద్య‌నిషేధం అంటారా? అని ప్ర‌శ్నించారు. కొఠారి కమిషన్, విద్యా రంగ నిపుణులు సూచన మేరకు, విద్యా రంగానికి 30 శాతం బడ్జెట్ కేటాయించాలని  సూచిస్తే కేవలం 10 శాతం మాత్రమే కేటాయించ‌డం ఈ ప్ర‌భుత్వానికి విద్యారంగంపై ఉన్న చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు.
చంద్రబాబు హయాంలో అప్పులు విషయంలో ఆర్ధిక క్రమశిక్షణ పాటించగా, ఇప్పుడు జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో అప్పులు తేవ‌డ‌మే రోజూవారీ ప‌నిగా మారిపోయింద‌ని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మూడు రాజ‌ధానుల పేరుతో 500 రోజులుగా ఆడుతున్న‌ది డ్రామాయేన‌ని బ‌డ్జెట్ సాక్షిగా తేట‌తెల్ల‌మైంద‌న్నారు. గ‌త బ‌డ్జెట్లో కొత్త రాజ‌ధాని కోసమంటూ 500 కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖ‌ర్చుచేయ‌కుండానే, ఈ ఏడాది మ‌ళ్లీ మ‌రో 500 కోట్లు కేటాయించ‌డం అంతా డ్రామా అని తేలింద‌న్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన 11వ పిఆర్‌సి, సిపిఎస్‌ రద్దు అంశంపై బడ్జెట్‌లో ఊసేలేక‌పోవ‌డం ఉద్యోగుల‌ను జ‌గ‌న్‌రెడ్డి మ‌రోసారి  మోస‌గించార‌న్నారు. ప్ర‌తీ ఏటా రూ.3వేల కోట్లతో ధరల నియంత్రణ నిధిని ఏర్పాటుచేస్తామని ఊదరగొట్టి, ఈఏడాది బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయించడం జ‌గ‌న్‌రెడ్డి రైతుల ప‌ట్ల చూపుతున్న‌ది స‌వ‌తిత‌ల్లి ప్రేమ అనేది అర్థ‌మైంద‌న్నారు. విత్తన పంపిణీకి గతేడాది రూ.192 కోట్లు ఖర్చు చేసి, ఈ ఏడాది బ‌డ్జెట్‌లో స‌గానికి కోత వేసి రూ.100 కోట్లు ఇవ్వ‌డం అన్యాయం అన్నారు. బ‌డ్జెట్‌తో పేరుతో త‌న భ‌జ‌న చేయించుకున్న జ‌గ‌న్‌రెడ్డి అన్ని రంగాల‌కు కోత‌లు పెట్టార‌ని నారా లోకేష్ పేర్కొన్నారు.