ఆనందయ్య – వావ్ ఇట్స్ ఎ మిరాకిల్!

728

( విష్వక్సేనుడు వినోద్)

నెల్లూరు వైద్యం చాలా ఫెమస్ అయింది.
కంట్లో చుక్క మందు వేస్తే ఆక్సిజన్ లెవెల్స్ పది నిమిషాల్లోనే పెరిగిపోతోంది.
కరోనా మందు తింటే 2 రోజుల్లోనే పాజిటివ్ కాస్తా నెగెటివ్ అయిపోతోంది.
వావ్ ఇట్స్ ఎ మిరాకిల్. వైద్య చరిత్రలోనే అద్భుతం.
రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, సామాన్య ప్రజానీకం మొత్తం ఆనందయ్య కరోనా మందుకోసం క్యూ గడుతున్నారు.
సూపర్….
ఆనందయ్య మందు కావొచ్చు, పతంజలి కరోనిల్ కావొచ్చు, గోమూత్రం, ఆవు పేడ కావొచ్చు… ఇలా ఏదైనా సరే కోవిడ్-19 ని కట్టడిచేసి జనాలను కాపాడితే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి?
ఆయుర్వేదమా, నాటు వైద్యమా, హోమియోపతినా, యునానీనా , అల్లోపతినా, సిద్ధనా అన్నది కాదు విషయం, అది ఏదైనా జబ్బును కరెక్టుగా నయం చేసిందా లేదా అనేదే ముఖ్యం.

అయితే వీటికి శాస్త్రీయ రుజువు, సరైన మెడికేషన్ పద్ధతులు, పనితీరుపై క్లీనికల్ ట్రైల్స్ లేకపోతే ఎలా? ప్రజలదేముంది ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏదో చిన్న ఆశతో ఎక్కడికైనా పరుగులు తీస్తారు. పైగా అది ఫ్రీ అంటే….. చెప్పక్కర్లేదు.
రిటైర్డ్ హెడ్మాస్టర్ ఒకాయన – పది నిమిషాల్లో నేను ఊపిరి పీల్చుకుంటున్నాను, అంతకుముందు అసలు ఒంట్లో ఓపిక లేక పడుకొని వచ్చాను అని ఒక వీడియోలో చెప్పాడు. కంట్లో ముందుకు ఒంట్లో శక్తికి పొంతన ఉన్నదా?

మన దేశంలో కోవిడ్ డెత్ రేట్ 2% కన్నా తక్కువ ఉంది. అంటే, నూరు మందికి కోవిడ్ వస్తే అందులో ఇద్దరు కన్నా తక్కువ మరణిస్తున్నారు. 98 మందికి పైగా 14 రోజుల్లోనే కొలుకుంటున్నారు.
ఈ లెక్కన నేను కరోనా పేషేంట్స్ కి మంచి నీళ్ళు ఇచ్చి, కరోనాకి ఇదే మందు అంటే 98% సక్సెస్ రేటుతో నా వైద్యం పనిచేసినట్టు లెక్క!!

ఏ ముందుకు అయినా సరే క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. ఆ మందు సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపణ కావాలి. కరోనా విషయంలో 100 మందిలో 98 మందికి 14 రోజుల్లో ఆటోమాటిక్ గా తగ్గిపోతుంది. మిగతా ఇద్దరి గురించే బాధ.
ఆనందయ్య గారు తయారుచేసిన ముందుపై కనీసం ముందస్తు ట్రైల్స్ చేశారా? అంటే ఒక నెల రోజుల టైంలో కనీసం 1000 మందిపై శాంపిల్స్ ప్రయోగించి అందులో ఎంతమంది కోలుకున్నారు? కోలుకున్న తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలావుందీ? ఎన్ని క్రిటికల్ కేసులు హ్యాండిల్ చేశారు అనే లెక్క ఒకటి ఉండాలి కదా?

అదెలాగో లేదు. ఇప్పుడు అయినా సరే, మందు ఎవరెవరికి వేశారు, వేసిన తర్వాత వాళ్ళకు క్యూర్ అయిందా లేదా అన్న సమాచారం అయినా ఉండాలి కదా??
అసలు మందు పంపిణీలో సమాచార సేకరణ జరుగుతుందా?
సమాచారమే లేకపోతే ఎంతమందికి వేశారు? ఎంతమందికి తగ్గింది? ఎంతమంది పోయారు? అనే వివరాలు ఎలా తెలుస్తాయి.
ఏ ముందైనా సరే ధర్మబద్ధంగా, శాస్త్రీయంగా, నైతికంగా ఆధారాలు ఉంటే తప్ప మనుషులపై ఆ మందు ఒక రోగాన్ని నయంచేస్తుందని ప్రయోగించడం కరెక్టా?

జనాలు వేయించుకుంటున్నారు కదా, పైగా ప్రీ, ఇందులో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా, మెడికల్ మాఫియా, ఠాగూర్ సినిమాలో లాగా మోసాలు లేవు కదా, వేయించుకుంటే పోయేదేముంది? ఒకవేళ పనిచేస్తే ప్రాణాలు దక్కుతాయి కదా?? అని చాలా మంది వాదిస్తారు. వాళ్ళు చెప్పేది నిజమే. సైడ్ ఎఫెక్టులు లేకపోతే ఏదైనా తినొచ్చు, తాగొచ్చు. కానీ, ప్రపంచాన్ని కుదిపేసిన ఒక భయంకరమైన జబ్బుకు సమర్థవంతమైన మందని ముందస్తు ట్రైల్స్ & డేటా లేకుండా ఎలా నమ్మిస్తారు??

కేంద్ర ప్రభుత్వం వెంటనే నిష్టాతులైన ఒక టీమ్ పెట్టి ఆనందయ్య గారి మెడిసిన్ ని ట్రైల్స్ కి అనుమతి ఇచ్చి, శాస్త్రీయంగా రుజువైతే ప్రజలందరూ హాయిగా నిద్రపోవచ్చు. కరోనా ఎదుర్కొనే మెడిసిన్ కనిపెట్టిన ఆనందయ్యకు భారతరత్న తో పాటు నోబెల్ కూడా ఇచ్చి సత్కరించాలి. ఆనందయ్య కు సెక్యూరిటీ పెంచి, ఆయన ఫార్ములా కు పేటెంట్ ఇవ్వాలి. ఇలాంటి వైద్య విధానాలపై శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించాలి.

ఒకవేళ ఇవేవీ నిజం కాకపోతే జనాల్లో సైoటిఫిక్ టెంపర్ పెంచాలని అర్థం. శాస్త్రీయ నిరూపణ లేకుండా ఇలాంటి మందులను పబ్లిసిటీ చేయకుండా, జనాలకు ఇవ్వకుండా ప్రభుత్వం తగుజాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. ఎవడో ఏదో చేస్తున్నాడని నిజాన్ని వదిలేసి నమ్మకంతో చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదని అర్థం!

మనమంతా కొండ గొర్రెలమ్ అని అర్థం!!
ఏదేమైనా… ఆనందయ్య ట్రీట్మెంట్ నిజం అయ్యి, ఈ కరోనా భూమ్మిద లేకుండా సచ్చిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను.