పైవారికి చెప్పే చేస్తున్నారు!

662

( మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు ఎపిసోడ్ చూస్తుంటే.. ‘‘మేం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు అన్నీ చెప్పే చేస్తున్నాం’ అని అప్పుడెప్పుడో చెప్పిన,  వైసీపీ పార్లమెంటరీపార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి మాటలు గుర్తుకొచ్చాయి. నిజమే. రఘురామకృష్ణంరాజుకు నర్సాపురంలో రాజకీయంగా స్థానబలం లేకపోవచ్చు. కానీ ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న వ్యక్తేనన్నది కాదనలేని సత్యం. రాజకీయాల్లోకి రాకముందు ఆయనో వ్యాపారవేత్త. సహజంగా వ్యాపారవేత్తలకు ఉండే పలుకుబడికి, కేవీపీతో వియ్యం వల్ల రెట్టింపవడం అదనపుబలం.  పార్టీతో సంబంధం లేకుండానే పార్లమెంటులో ఒక స్టాండింగ్ కమిటీకి చైర్మన్ అవడమంటే మామూలు విషయం కాదు. అది ఎంపీలందరికీ సాధ్యమయ్యేది కాదు. స్పీకర్ విచక్షణ మేరకు ఆ పదవి వచ్చిందంటే, ఆయన సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఇక ఆయన తరచూ ఇచ్చే విందులకు రాజ్‌నాధ్‌సింగ్ సహా బీజేపీ అగ్రనేతలు హాజరవుతుంటారు. ఇక సొంత పార్టీ ఎంపీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకే గతి లేని అపాయింట్‌మెంట్లు రాజుగారికి అలవోకగా లభిస్తుంది.

అంతేనా? మిల్క్‌స్టార్ సచిన్ టెండూల్కర్ నుంచి, మిల్క్‌బాయ్ మహేష్‌బాబు వరకూ ఎవరి బర్త్‌డే జరిగినా, వారితో తాను దిగిన ఫొటోలు పెట్టి మరీ రాజుగారు గ్రీటింగ్స్ చెబుతుంటారు. అసలు ఇమ్పటిదాకా సంఘ్ కీలకనేత దత్తాత్రేయ హోసబలేని బీజేపీ ఎంపీలు కూడా కలసి ఉండకపోవచ్చు. కానీ రాజు గారికి మాత్రమే అది సాధ్యమయింది.  ఆయన రేంజ్ అదీ! పైగా ఆయన ఎక్కడెక్కడి లింకులనూ వెదికి పట్టేయడంలో నిష్ణాతుడు. అసలాయన జగనన్నతో కొట్లాట ప్రారంభించిన తర్వాతే రాజు టాలెంటేమిటో తెలిసింది. రాజకీయాల్లో ఇంత టాలెంటున్నవాడు లేటుగా ఎలా ఎంట్రీ ఇచ్చారని చాలామందికి పెద్ద సందేహమే వచ్చింది. రాజుతో జర్నలిస్టుగా ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా నాకే ఇంత తక్కువ తెలిసిందంటే, ఇక వ్యాపారవేత్తలు, సినిమాస్టార్లు, పొలిటీషియన్లకు ఆయన గురించి ఇంకా ఎక్కువే తెలిసి ఉండాలి.  కాబట్టి.. రాజుగారికి  ై‘పెవారి’ వద్ద బోలెడంత పలుకుబడి ఉందనుకోవడం సహజం. అది నిజం కూడా. అయితే.. అది ఆయన వ్యక్తిగత పలుకుబడి.

అయినా మరి ఎందుకు అరెస్టు చేశారని ఎవరైనా అమాయకంగా ప్రశ్నించవచ్చు. మరదే ఆటంటే! మొన్నీమధ్య సీపీఐ కామ్రేడ్ నారాయణ చెప్పింది అర్ధం చేసుకుంటే సింపుల్. అమిత్‌షా, కేసీఆర్‌కు తెలియకుండా రాజు అరెస్టు జరగదని చికెన్ నారాయణ తేల్చిపారేశారు. ఏమాటకాట కుండబద్దలు కొట్టడంలో నారాయణ తర్వాతే ఎవరైనా. మొన్నామధ్య తిరుపతి రుయా ఆసుపత్రిలో, గాలి ఆడక చనిపోయిన వారి సంఖ్యపై మల్లగుల్లాలు పడుతుంటే.. ఇదిగో.. మీ నిర్వాకం వల్ల ఇంతమంది చనిపోయారంటూ మృతుల పేర్లు కూడా ప్రకటించి లెక్క తేల్చిపారేశారు. అది వేరే విషయం! ఇప్పుడు రాజు అరెస్టు విషయంలో ఆయన చెప్పిందే నిజం. అసలు రాజును అరెస్టు చేసేందుకు సీఐడీ వాళ్లు హైదరాబాద్ వెళ్లినప్పుడు జరిగిన పెనుగులాట సమయంలోనే, ‘పైవారి’నుంచి అరెస్టుకు అనుమతి లభించిందని, ‘పైవారి’ గ్రీన్‌సిగ్నల్ తర్వాతనే సీఆర్‌పీఎఫ్ కూడా తగ్గిందన్నది ఒక ప్రచారం. అది అబద్ధం కాదన్నది మనం మనుషులం అన్నంత నిజం!

నర్సాపురంఎందుకంటే శివుడాజ్ఞలేనిదే చీమయినా కొంచెం సాహసించి కుడుతుందేమో గానీ, దేశంలో అమిత్‌షా ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదన్నది మనం నిఝంగా  నిజం. ఈడీలు, సీబీఐలు, బ్యాంకులూ ఇలా ఒకటనేమిటి? సర్వ వ్యవస్థలూ గృహమంత్రిగారి కనుసన్నలోనే నడిచేవి. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకటి-రెండు దశల్లో జరిగితే, బెంగాల్లో మాత్రం ఏకంగా ఎనిమిది ఎపిసోడ్లు లాగించారంటే దేశంలో ఎవరి కనుసన్నల్లో వ్యవస్థలు నడుస్తున్నాయో గ్రహించనివాడు అమాయకుడి కింద లెక్క.  కాకపోతే.. రెండురోజుల క్రితం.. బెంగాల్‌లో సీబీఐ అరెస్టు చేసిన తన  ఇద్దరు టీఎంసీ మంత్రులపై సివంగిలా లేచి, ధర్నా చేసిన మమతక్క గత్తరకు భయపడి, సాయంత్రానిక ల్లా బెయిలిచ్చి పంపారనుకోండి. అది వేరే కథ!

ముందే అనుకున్నట్లు.. రాజుగారి కథలో కూడా జగనన్న అండ్ కో, ఈ వ్యవహారాన్ని ముందస్తుగా గృహమంత్రి గారి అనుమతి తీసుకున్న తర్వాతనే సీఐడీని పంపారన్నది నిస్సందేహం. మరి ఇక్కడ రాజుగారి పలుకుబడి ఏమయిందని మళ్లీ మరో  భేతాళ ప్రశ్న వేయవచ్చు. ఎస్. ఇక్కడ కేంద్రపాలకులకు రాజు కంటే జగన్ ముఖ్యం. రాజ్యసభలో ఆయన పార్టీ మద్దతు ముఖ్యం. ఇంకా స్టేట్ పాలిటిక్సుకు సంబంధించి సవాలక్ష అవసరాలుంటాయి. కాబట్టి ఎవరి ఆట వారిదే!  కాకపోతే చూడ్డానికి అందరిమాట విన్నట్లే కనిపిస్తారు. చివరాఖరిలో తామేం చేయాలో అదే చేస్తారు.

అయినా.. ఏపీలో టీడీపీకి అడ్వాంటేజీ వచ్చే పనులకు కమలదళాలు ఎలా మద్దతునిస్తాయి జనం పిచ్చి కాకపోతే? రాజు ఎపిసోడ్‌ను తొలి నుంచీ నానా గత్తర చేస్తుంది టీడీపీనే. హోం సెక్రటరీకి లేఖ కూడా రాసిందాయె. బీజేపీకి రాష్ట్రంలో బలం లేదాయె. ఆయనే ఉంటే మంగలి ఎందుకన్నట్లు.. అంత బలం ఉంటే, మండల ఎన్నికల నుంచి తిరుపతి ఉప ఎన్నిక వరకూ ఎందుకు గుండుకొట్టించుకున్నట్లు? కాబట్టి రాజు ఎపిసోడ్‌లో సానుకూల నిర్ణయం తీసుకుంటే అది టీడీపీకే లాభం. వైసీపీకి  నష్టం!  ఇప్పట్లో వైసీపీకి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే అది రాజకీయంగా కేంద్రానికే నష్టం. టీడీపీ యవ్వారం తేలేంత వరకూ ఈ దొంగాట నడిపించాల్సిందే. ఇలా పరిపరివిధాల కూడికలూ-తీసివేతలూ వేసుకున్న తర్వాతనే, రాజు గారి అరెస్టుకు ‘పైవారు’ అనుమతించారన్నది మెడపై తల ఉన్నా ఎవరికినా అర్ధమవుతుంది.
సరే.. సోము వీర్రాజులు, సత్యకుమార్లూ, పురందీశ్వరులూ, జీవీఎల్లూ వంటి కమలనాధులు కూడా రాజు అరెస్టు, తర్వాత పరిణామాలను ఖండించారు కదా అని మరో ప్రశ్న వేయవచ్చు. ఎస్. ఖండించారు.ఖండించినంత మాత్రాన రాజుగారిని విడుదల చేయాలని కాదు దాని అర్ధం! మేమూ సానుభూతి ప్రకటించామని, రాజుగారు విడుదలయ్యాక పాత పేపర్లు చూసి ఆయన తెలుసుకోవడానికన్నమాట!  కాబట్టి శాస్త్రప్రకారం ఖండించారు.  కాలం కలసివచ్చి రేపు అదే రాజు గారు తమ పార్టీలోకే రావచ్చు. అప్పుడు ఆయనతో అనేకానేక అవసరాలు రావచ్చు. ముందుచూపన్నమాట! అయితే ఇందులో సత్య, విష్ణుకుమార్‌రాజు వంటి సీరియస్‌గా ఖండించిన నేతలూ లేకపోలేదు. వారి సంఖ్య తక్కువ.

ఇక కేసీఆర్ సహకారం లేనిదే అరెస్టు జరగదన్న కామ్రేడ్ నారాయణ మాటను, అంత వీజీగా కొట్టిపారేయడానికి లేదు. తెలంగాణ లో తనను షర్మిలక్క ఇబ్బంది పెడుతున్నా, రాజకీయంగా.. ఇంకా అనేక కోణాల్లో జగన్-కేసీఆర్ హమ్‌సబ్ ఏక్ హైనే! మామూలుగా అయితే ఆంధ్రా అంబులెన్సులనే తెలంగాణలోకి రానీయకుండా గత్తర చేసిన కేసీఆర్ సర్కారు.. 30 మంది సీఐడీ పోలీసులను ఎలా అనుమతిస్తుందన్నది ప్రశ్న. కేసీఆర్ సర్కారు అనుకుంటే ఠాట్.. ఈ సమయంలో ఇలాంటి వాటిని మా రాష్ట్రంలో అనుమతించను. కావాలంటే రాజు మీ రాష్ట్రానికో, ఢిల్లీకో వెళ్లినప్పుడు అరెస్టు చేసుకోండని జగనన్న సర్కారుకు నిర్మొహమాటంగా చెప్పవచ్చు. కానీ అలా చెప్పలేదే? ఎంచక్కా లోకల్ పోలీసులు కూడా ఏపీ సీఐడీలతో వచ్చారంటే.. కేసీఆర్ సాయం లేనిదే అరెస్టు జరగదన్న నారాయణ మాటను ఎలా నమ్మకుండా ఉంటాం? మరి షర్మిలక్క పెడుతున్న ఇబ్బందుల సంగతేమిటని మళ్లీ భేతాళుడి అన్నయ్యలా ప్రశ్నించవచ్చు. నిజమే. అదొక ఆట.

తన తండ్రిని అన్యాయంగా అరెస్టు చేశారని రాజుగారి కొడుకు, కుమార్తె ఢిల్లీలో అమిత్‌షా సన్నిధికి వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడాయన ఏమంటారు?.. అయ్యో అలానా? నాకూ అరెస్టు చేసిన తర్వాతనే తెలిసింది. అయినా ఒక ఎంపీని స్పీకర్ అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారు? అయినా అది స్టేట్ సబ్జెక్ట్ కదా? ఫర్వాలేదు. నేను చూస్తాను. నాకు చేతనయిన సాయం చేస్తా. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి పంపిస్తారు. అంతే కదా?! ఇది కూడా ఒక ఆట!  సో. రాజకీయాల్లో ఎవరి ఆట వారిదన్నమాట! మీకు అర్ధమవుతోందా…?