క్షత్రియ సేవా సమితి స్థాపన వెనుక కథ ఇదీ..

458

పూసపాటి సంజీవి కుమార స్వామి రాజా ( 1898 -1957 ) ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ఎన్నిక అయిన 12 వ ముఖ్యమంత్రి రాజావారు .  రాజా వారు తరువాత స్వాతంత్య్రం వచ్చాక ఒరిస్సా  రాష్ట్రానికి గవర్న ర్ గా కూడా పని చేసారు . తల్లి ముత్తమ్మ, తండ్రి సంజీవ రాజా. వీరిది కృష్ణా  జిల్లా పూసపాడు . వారు రాజపాళ్యం లో ఉండేవారు తరువాత .

కుమార స్వామి రాజా వారు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకోవడం వల్ల ఆయన వాళ్ళ మేనత్త మంచమ్మ గారి వద్ద పెరిగారు . చిన్న నాటి నుండే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆయన అందరితో కలివిడిగా కలిసి పోయేవారు. ఉన్నత చదువులు అయ్యాక ఆయన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. గాంధీ గారి శిష్యులుగా అనేక కార్యక్రమాలు రూపొందించి ప్రజాసేవ చేసారు . హోమ్ రూల్ ఉద్యమం , సహకార ఉద్యమాలలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రములో చురుకైన పాత్ర పోషించి ప్రజలను ఉద్యమ బాట పట్టేట్టు చేసారు . ఆనాటి ప్రభుత్వం ఆయన్ని జైలు పాలు చేసింది.

తరువాత ఉమ్మడి మద్రాస్ రాష్ట్రములో 1946 నుండి 1947 వరకూ వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన ఆయన రైతులకు ఎన్నో సదుపాయాలు కలిగేట్టు చేసారు . టంగుటూరి ప్రకాశం పంతులు గారి తరువాత 1949 నుండి 1952 వరకూ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. న్యాయ వ్యవస్థ అనేది పాలకులకు అనుబంధంగా ఉంటే అది దుర్వినియోగం అవుతుందని ఆయన దానిని పాలక వ్యవస్థ నుండి వేరు చేసి ప్రత్యేక ప్రతిపత్తి కలిగి ఉండాలని నాటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్ చేసి కృతకృత్యులయ్యారు.

తరువాత ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన రాజగోపాలాచారి పాలనలో తెలుగుల పరిస్థితి ముఖ్యముగా రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారడముతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు బీజం పడింది . తరువాత ఆయన 1954 నుండి 1956 వరకూ ఒడిస్సా  రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసారు . ఆయన ఆస్తులన్నీ ప్రజా సేవకే వినియోగించారు . గాంధీ కళా మందిరం, స్వర్ణోత్సవ మైదానము వంటివి వారి కృషి ఫలితమే.

తరువాత ఆయన పేద క్షత్రియుల కోసం క్షత్రియ సేవా సమితి స్థాపించి దానికి కూడా తమ ఆస్తులలో కొంత భాగం కేటాయించారు . 1957 జులై ఎనిమిదిన గుండె పోటుతో మరణించారు . తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చిహ్నం అయిన శ్రీవిల్లిపుత్తూర్ గుడి చిహ్నం ఆయన సూచించినదే . నాకు పిల్లలు లేరు .. యావద్ ప్రజలు నా పిల్లలే అంటూ తన యావదాస్తులను ఆయన ప్రజా ప్రయోజనార్థమే వినియోగించారాయన ..

                                                                                         – వీరనరసింహరాజు..