సారూ.. హామీ ఇచ్చి సంవత్సరమాయె… మీ మాట ఏమాయె?

241

గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి విజ్ఞప్తి

సార్ సరిగ్గా సంవత్సరం క్రితం(18-5-2020) ప్రగతిభవన్లో జరిగిన ప్రెస్ మీట్లో మిమ్మల్ని కలిసి లాక్డౌన్ వల్ల జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై మీకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీరు పది నిమిషాలపాటు మా సమస్యలు సావధానంగా విని రెండుమూడు రోజుల్లో సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ సంవత్సరం గడిచింది. మళ్లీ లాక్డౌన్ వచ్చింది. ఈ మధ్య కాలంలో మీరు న్యాయవాదులు, ప్రయివేటు ఉపాద్యాయులతో పాటు పలువురికి సహాయం అందించారు. చాలా సంతోషం. కానీ అనేక ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులకు సహాయం అందించలేదు. తెలంగాణ మీడియా అకాడమీ తరపున పాజిటివ్ వచ్చినవారికి కొంత సహాయం అందిస్తున్నారు. అలాగే కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు ధన్యవాదాలు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభించి లాక్డౌన్ కు ముందు నుండి ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఏదో కొద్దిమంది తప్ప వేలాదిమంది అద్దె ఇళ్లాల్లోనే ఉంటున్నారు. పౌష్టికాహారం ఏమోకానీ మామూలుగా రెండుపూటలా సరైన తిండిలేనివారే చాలామంది ఉన్నారు. దీనికితోడు ఇంటి అద్దెలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ కష్టకాలంలో ప్రతి జర్నలిస్టు కుటుంబానికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

హెల్త్ కార్డులపై అన్ని హాస్పిటల్స్ లో కరోనాకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోండి
ఇటీవలి కాలంలో కరోనాతో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతూ అనేకమంది జర్నలిస్టులు చనిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లభించక, ప్రయివేటు హాస్పిటల్స్ లో చేరే ఆర్ధికస్థోమతలేక ఇళ్ళల్లోనే చికిత్స పొందుతూ మరణించారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు అప్పులపాలయ్యాయి.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్(ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఆ పథకంతో సమన్వయం చేస్తూ జర్నలిస్టుల హెల్త్ కార్డులపై కరోనా చికిత్స అందేలా తగు ఆదేశాలు ఇచ్చి జర్నలిస్టులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.