ఊరూరా జ్వ‌ర స‌ర్వేతో స‌త్ఫ‌లితాలు:స‌బిత‌ ఇంద్రారెడ్డి

334

ప్ర‌జ‌లు స్వీయ జాగ్ర‌త్త‌లు పాటిస్తూ క‌రోనా ర‌హిత స‌మాజం కోసం కృషి చేయాల‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. లాక్‌డౌన్ సంద‌ర్భంగా ఇండ్ల‌లోనే ఉంటూ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. అంద‌రికి వ్యాక్సిన్ కోసం ప్ర‌భుత్వం గ్లోబ‌ల్ టెండ‌ర్లు ఆహ్వానించింద‌ని చెప్పారు.

వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట‌లో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప‌ర్య‌టించారు. జూనియ‌ర్ కాలేజీలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నిర్వ‌హిస్తున్న ఐసోలేష‌న్ కేంద్రాన్ని మంత్రి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఊరూరా నిర్వ‌హిస్తున్న స‌త్ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. లక్షణాలున్న వారిని గుర్తించి, మందులు ఇస్తూ సూచనలు చేస్తుండటంతో చాలా వరకు కరోనా కేసులు తగ్గుతున్నాయ‌ని వెల్ల‌డించారు. గ్రామాల్లో స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు.. ఏఎన్ఎంలు, ఆశ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ప‌నిచేయాల‌ని సూచించారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు హోం ఐసోలేష‌న్‌లో ఉండేలా, వైర‌స్‌ వ్యాప్తి చెంద‌కుండా కృషి చేయాల‌న్నారు.

క‌రోనా క‌ట్ట‌డిలో ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్ కృషి ఎంతో గొప్ప‌ద‌ని చెప్పారు. ఆశ కార్య‌క‌ర్తలు, ఏఎన్ఎంలు, వైద్యుల సేవ‌లు అమోఘ‌మ‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో అనంత‌గిరిలో 2 వంద‌ల ప‌డ‌క‌ల ద‌వాఖానను అందుబాటులోకి తెస్తామ‌ని వెల్ల‌డించారు. జిల్లా కేంద్రమైన వికారాబాద్‌లో ఆర్టీపీసీఆర్ కేంద్రం ఏర్పాటు చేస్తామ‌న్నారు.

జిల్లాలో క‌రోనా మ‌హ‌మ్మారికి సంబంధించిన అన్ని ర‌కాల మందులు, ఇంజెక్ష‌న్లు, ఆక్సిజ‌న్ త‌గిన మోతాదులో అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. జిల్లాలోని ద‌వాఖాన‌ల్లో ఇప్ప‌టికే మంచాల సంఖ్య‌ను పెంచామ‌న్నారు.

మోమిన్‌పేట‌లో నిర్వ‌హించిన‌ జ‌ర్వ స‌ర్వేలో 250 మందికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించార‌ని, వారంద‌రికి వెంట‌నే కిట్‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ త‌న సొంత ఖ‌ర్చుల‌తో ఐసోలేష‌న్ కేంద్రాన్ని నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌ని చెప్పారు.