45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు

170

2020-21 సంవత్సర పంట కాలానికి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు – రైతుకు కనీస మద్దతు ధరను సకాలంలో అందిస్తున్నాం
– కల్లం వద్దే ధాన్యం కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుట్టాం
– కోవిడ్ -19 దృష్యా కూపన్ల ద్వారా ధాన్యం సేకరిస్తున్నాం
– నిరు పేదలకు నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి / గుడివాడ, మే 19: రాష్ట్రంలో 2020-21 సంవత్సర పంట కాలానికి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

2017-18 సంవత్సరంలో 18 లక్షల 12 వేల 956 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసి రూ. 2 వేల 853.64 కోట్ల చెల్లించడం జరిగిందన్నారు. అలాగే 2018-19 సంవత్సరంలో 27 లక్షల 52 వేల 702 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 4 వేల 838.03 కోట్ల చెల్లింపులు చేశారని, 2019-20 సంవత్సరంలో 34 లక్షల 73 వేల 414 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 6 వేల 331.41 కోట్లు చెల్లించడం జరిగిందని, 2020-21 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక లక్షా 15 వేల 813 మంది రైతుల దగ్గర నుండి 13 లక్షల 40 వేల 010 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 2 వేల 510 కోట్ల చెల్లింపులు చేశామని తెలిపారు.

ఈ నెల 31 వ తేదీలోగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాల మేరకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఇందు కోసం రైతుభరోసా కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేశామని, తద్వారా 3 లక్షల 01 వేల 540 మంది రైతుల వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ధాన్యం కొనుగోలు నిమిత్తం నమోదు చేశామన్నారు. రాష్ట్రంలో రైతుకు ధాన్యంపై కనీస మద్దతు ధరను సకాలంలో అందిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం నమూనాలను పరిశీలించి రైతు కల్లం వద్దే ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చేశామన్నారు. రైతుకు సంబంధించిన భూమి, పంటసాగు వివరాలను ఆన్‌లైన్లో ఈ – పంట సర్వీస్ ద్వారా నమోదు చేయించి ధాన్యం కొనుగోలు సమయంలో ఆయా వివరాలను సరిపోల్చి ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా దళారి వ్యవస్థను నిర్మూలించడం జరిగిందన్నారు.

కోవిడ్ -19 కారణంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి రైతుకూ ధాన్యం కొనుగోలు తేదీని కూపన్ల ద్వారా తెలియజేసి తద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నామని, ఇప్పటి వరకు ఒక లక్షా 66 వేల 814 కూపన్లను జారీ చేశామన్నారు. కూపన్లలో నిర్ణయించిన తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది రైతు కల్లం వద్దకు వెళ్ళి ధాన్యాన్ని కాటా వేసి మిల్లుకు తరలిస్తారన్నారు. కల్లం వద్ద కాటా వేసిన ధాన్యం పరిమాణానికి తగిన కొనుగోలు రశీదును రైతుకు అందజేస్తారన్నారు. ధాన్యం అమ్మిన రైతుకు రశీదులో పొందుపర్చిన మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కల్లం వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియను తెలంగాణా, ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయన్నారు.

రైతు దగ్గర నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో మరపట్టించి సార్టెక్స్ చేయగా వచ్చిన నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే సేకరించి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలైన లబ్ధిదారులకు అందించేలా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. కోవిడ్ దృష్ట్యా రైతులకు ఉండే సమస్యల పరిష్కారం కోసం జిల్లా, క్షేత్రస్థాయిలో 20 కొనుగోలు కేంద్రాలకు ఒక పర్యవేక్షణాధికారిని సంబంధిత శాఖల నుండి నియమించడం జరిగిందన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో తేమ శాతాన్ని పరీక్షించేందుకు మాయిశ్చరైజర్లను ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధరను కల్పించేందుకు గత సంవత్సరం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సేకరించడం జరిగిందన్నారు. ఈ జిల్లాల్లో తగినన్ని మిల్లింగ్ సదుపాయాలు లేకపోవడంతో పక్క జిల్లాలకు పంపిస్తూ ఏ ఒక్క రైతూ నష్టపోకుండా కనీస మద్దతు ధరను అందించడం జరిగిందని మంత్రి కొడాలి నాని తెలిపారు.