ఆర్ఎంపీలు కోవిడ్ చికిత్సలు చేయొద్దు

377

షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్
 10 మండలాల ఆర్ఎంపీ వైద్యులకు ఏసీపీ సూచన
 నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

కోవిడ్ పరిస్థితులలో గ్రామీణ వైద్యులు ఆర్.ఎం.పి, పీఎంపీలు కోవిడ్ చికిత్సలు చేయొద్దని తద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు తీసుకురావద్దని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్ హెచ్చరించారు. సోమవారం షాద్ నగర్ ఏసీపీ కార్యాలయ ఆవరణలో గ్రామీణ వైద్యుల సంఘం ప్రతినిధులు తిరుపతి యాదవ్, బాలకృష్ణ, రవి యాదవ్, వెంకటేష్, రఘుపతి తదితరులతో మాట్లాడారు. గ్రామాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఆర్ఎంపీ వైద్యుల వద్దకు చికిత్స కోసం వస్తున్న వారిని వెంటనే అప్రమత్తం చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని సూచించారు. సాధారణ ఇంకా ఇతర వ్యాధి కోవిడ్ లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేయాలని అనవసరంగా వారికి చికిత్స చేయొద్దని వారి ప్రాణాలకు ముప్పు తెవొద్దని కోరారు. గ్రామాల్లో చాలా మంది వైద్యుల వద్దకు చికిత్సకోసం ప్రజలు వెళ్తున్నారని ఈ సందర్భంగా రోగికి విలువైన మూడు నాలుగు రోజుల కాలయాపన అక్కడే జరుగుతుందని, ఆ తర్వాత పరిస్థితి తీవ్రమై పెద్ద ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ప్రజల విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రాథమిక చికిత్స చేసి ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలని సూచించారు. ఎవరైనా పోలీసు, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. చికిత్స పేరిట కాలయాపన చేసి చిన్నాచితక మందులు ఇచ్చి కొందరు కక్కుర్తి పడుతున్నారని ఏసిపి  పేర్కొన్నారు. అనవసరంగా రోగులను మభ్య పెట్టి కాలయాపన చేయడం ద్వారా విలువైన ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. తన డివిజన్ పరిధిలోని 10 మండలాల గ్రామీణ వైద్యులకు ఈ సమాచారం ఇవ్వాలని సూచించారు. పరిస్థితి చేయి దాటాక ఎవరూ ఏమీ చేయలేరని ప్రతి ఒక్కరు గురుతరమైన బాధ్యత వహించాలని సూచించారు..