కరోనాపై పోరులో అధికారులే క్షేత్రస్థాయి కమాండర్లు!

169

జిల్లా కలెక్టర్ల సమీక్షలో ప్రధాని మోదీ

దిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. మహమ్మారిపై పోరులో అధికారులే క్షేత్రస్థాయి కమాండర్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జిల్లా స్థాయిల్లో కరోనా ఉద్ధృతిపై నేడు పది రాష్ట్రాల అధికారులతో ప్రధాని మోదీ వర్చువల్‌ పద్ధతిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్‌ కట్టడిలో అధికారులు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కొవిడ్‌ కట్టడికి అమలు చేస్తున్న ప్రణాళికలను అధికారులు ప్రధానికి వివరించారు.

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటోంది. ఈ సమయంలో కరోనాపై పోరులో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిల్లో పరిస్థితులు అధికారులకే బాగా తెలుసునని.. క్షేత్రస్థాయిలో కొవిడ్‌ కట్టడికి స్థానిక కంటైన్మైంట్‌, భారీగా నిర్ధారణ పరీక్షలు, కచ్చితమైన సమాచారం వారి కీలక ఆయుధాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కొవిడ్‌ కట్టడికి అధికారులకు మోదీ పలు సూచనలు చేశారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌తో పాటు కొవిడ్‌ నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అంతేకాకుండా పాజిటివ్‌ వచ్చిన బాధితులను ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ వృథాను అరికట్టడం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సమయంలో పీఎం కేర్స్‌ నిధుల సహాయంతో జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని అధికారులు ప్రధానికి వివరించారు.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ కట్టడిని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో గ్రామీణ ప్రాంత ప్రజల కృషిని ప్రశంసించారు. కొవిడ్‌ కట్టడి చర్యలపై జరిపిన ఈ సమావేశంలో కర్ణాటక, బిహార్‌, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌, దిల్లీ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఇదిలాఉంటే, దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కొవిడ్‌ మరణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 4329 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 2లక్షల 78వేలు దాటింది..