ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

416

– వైఎస్సార్ మత్స్యకార భరోసాతో 1.20 లక్షల కుటుంబాలకు చేకూరిన ప్రయోజనం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

విజయవాడ, మే 18: వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకంతో రాష్ట్రంలోని 1.20 లక్షల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందని, ఇచ్చిన మాటను అధికారంలోకి రాగానే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి మత్స్యకారులకు నగదును బదిలీ చేశారు.

ఈ సందర్భంగా విజయవాడలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకారులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలుస్తూ గత ప్రభుత్వాల కంటే మిన్నగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. చేపల వేటపై నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు మత్స్యకారుల ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున రూ.119.88 కోట్లను సీఎం జగన్ జమ చేశారని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్ళి ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల వైఎస్సార్ బీమాను అమలు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67 కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ. 6.7 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 ఆక్వా ల్యాబ్ లను రూ. 50.30 కోట్లతో నెలకొల్పుతూ ఆక్వా రంగానికి అండగా నిలుస్తున్నామన్నారు. రొయ్య పిల్లలను సబ్సిడీ ద్వారా 35 పైసలకే అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో మేజింగ్ షిప్పింగ్ హర్బలను నిర్మిస్తున్నామని, ఇందు కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించామన్నారు. 50 ఏళ్ళు నిండిన మత్స్యకారులకు వైఎస్సార్ పింఛన్ పథకాన్ని వర్తింపజేశామన్నారు. కృష్ణాజిల్లా పరిధిలో కైకలూరు, గుడివాడ, అవనిగడ్డ, మచిలీపట్నం, కంకిపాడుల్లో ఇంటిగ్రేటెడ్ వైఎస్సార్ ల్యాబ్ లను ఏర్పాటు చేసి మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నామన్నారు. జిల్లాలో ఆక్వా రైతులకు విద్యుత్ పై రూ.1.50 పైసలు సబ్సిడీ చొప్పున 26 వేల మంది రైతులకు రూ. 285 కోట్ల సబ్సిడీ ఇచ్చామని మంత్రి కొడాలి నాని తెలిపారు.

రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించేలా కరోనా విపత్తు సమయంలో కూడా మత్స్యకారులకు వేట నిషేధ భృతిని అందించి తన ఉదారతను చాటుకుందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ. 4 వేల నుండి రూ. 10 వేలకు పెంచారన్నారు. సాంప్రదాయ నావలకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. గత 15 నెలలుగా కరోనా విపత్కర సమయంలోనూ వెనకడుగు వేయకుండా పేదలకు, అర్హులకు వేల కోట్ల రూపాయల ప్రయోజనాన్ని కల్పించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సాగరమాల ఫేజ్ -2 కింద మచిలీపట్నం షిప్పింగ్ యార్డ్ ఆధునికీకరణ పనులను రూ.348 కోట్లతో ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలోని నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం మండలాల పరిధిలో 23 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నామన్నారు.

మొత్తం 2,231 బోట్లతో జీవనోపాధి పొందుతున్న 11 వేల 946 మంది లబ్ధిదారుల కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున వేట నిషేధ భృతిని అందజేస్తున్నామన్నారు. జిల్లాలో 111 కిలోమీటర్ల మేర తీరప్రాంతం కల్గి 49 వేల హెక్టార్లలో మంచినీటి చేపల పెంపకం, 19 వేల హెక్టార్లలో ఉప్పునీటి చేపల, రొయ్యల పెంపకం జరుగుతోందన్నారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 1552 వేటకు వెళ్ళే మోటారైజ్, మెకనైజ్డ్ బోట్లకు లీటరుకు రూ. 9 ల చొప్పున స్మార్ట్ కార్డు ద్వారా డీజిల్ పై ముందస్తు సబ్సిడీ ఇచ్చామన్నారు. గత ఏడాది జిల్లాలో పీఎం మత్స్యకార సంపద యోజన పథకం కింద 356 యూనిట్లకు రూ. 13.85 కోట్లు మంజూరు చేశామన్నారు. అనంతరం వైఎస్సార్ మత్స్యకార భరోసా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగి రమేష్ , వల్లభనేని వంశీమోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు భాషా, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు.