‘ఆక్సిజన్‌ కొరత’ మరణాలన్నీ…ప్రభుత్వ హత్యలే:బివి రాఘవులు

286

‘దేశంలో ఆక్సిజన్‌ కొరతతో వందల మంది చనిపోతున్నారు. అవన్నీ ప్రభుత్వ హత్యలే. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. కోవిడ్‌ నివారణకు, ఆక్సిజన్‌ ప్లాంట్లకు, వెంటిలేటర్లకు, వ్యాక్సిన్‌ ఉత్పత్తికి, కరోనా కిట్ల ఉత్పత్తికి, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేదంటారు కానీ ప్రధాని నూతన నివాసం, సెంట్రల్‌ విస్టా పనులకు మాత్రం డబ్బులుంటాయి.

పాతకాలపు రాజు దర్పాన్ని ప్రదర్శించినట్టుగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు. కరోనా రెండో దశ భారత్‌లో విజృంభిస్తుందని డబ్ల్యూహెచ్‌ఒ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు మోడీ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించారు. వాటిని పెడచెవిన పెట్టి కుంభమేళా, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించి దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కారణమైంది.’అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రశ్న: దేశంలో కోవిడ్‌ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఏమంటారు?
రాఘవులు : కోవిడ్‌ రెండోదశ పూర్తిగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేతగానితనంవల్లనే వచ్చింది. మొదటి దశ అంతమైంది అనుకోవడం పొరపాటు మళ్లీ రెండోదశ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. కరోనా మీద విజయం సాధించామని, ప్రపంచ దేశాలకు భారత్‌ నేర్పే పరిస్థితి వచ్చిందని అహంకారంతో ప్రకటనలు చేశారు. విశ్వగురు స్థానంలోకి వచ్చామని ప్రకటించారు. అది నిజమే అనుకునేటట్టుగా ప్రధాని మోడీ గడ్డాన్ని పెంచి, సంప్రదాయ గురువు వేషాన్ని ధరించడం ప్రారంభించారు. కేంద్రం, మోడీ విశ్వగురు భ్రమలో తేలిపోతూ లక్షల మంది ఒకచోటికి వచ్చే కుంభమేళాకు అనుమతిచ్చారు. దీంతో దేశం నలుమూలలకు కరోనా వ్యాధి పాకిందని అనేక మంది ప్రస్తావించడం తెలుసు. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కరోనా జాగ్రత్తలు పాటించకుండా ప్రధాని మొదలుకొని బిజెపి నాయకులు నిబంధనలను ఉల్లంఘించి లక్షల మందితో సభలు నిర్వహించారు. కరోనా విజృంభణకు కారకులయ్యారు. మొదటిదశ అనుభవాల నుంచి నేర్చుకున్న వాటినీ కేంద్రం అమలుకు నిరాకరించింది. 162 ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని విస్మరించింది. దేశ ప్రజలందరికీ అవసరమైన వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు చర్యలు తీసుకోలేదు. స్వదేశీ టీకాలను తయారుచేసిన మొదటి దేశమనీ, ప్రపంచాన్ని రక్షించడంలో ముందున్నామని ప్రకటించారు. కానీ కొద్దిమోతాదులో ఉత్పత్తి చేసిన కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌ను విదేశాలకు ఎగుమతి చేశారు. తీరా ఈ దేశంలోని ప్రజలకు టీకాల కొరత ఏర్పడింది. జనాభాను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి చేయడానికి భారీస్థాయిలో కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటే రెండు ప్రయివేటు సంస్థలపై ఆధారపడే పరిస్థితిని కల్పించింది. వాటి వ్యాపారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలోని ఇతర సంస్థలను ప్రోత్సహించి ప్రభుత్వరంగంలో టీకా ఉత్పత్తి కేంద్రాలను మెరుగుపరిచే చర్యలు తీసుకోలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు రెండోదశ ఉధృతమయ్యాక టీకా గురించి వెతుకులాట ప్రారంభించింది. టీకా ఫార్ములాను అన్ని సంస్థలకూ ఉచితంగా ఇచ్చి ఉత్పత్తి చేయాలని ఆదేశించకుండా విదేశీ సంస్థల వద్ద కొనుగోలు చేయాలని చెప్పి బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటున్నది. రాష్ట్రాలకు టీకా సరఫరా విషయంలోనూ అస్తవ్యస్థంగా వ్యవహరించింది. విదేశీ, ప్రయివేటు సంస్థల వద్ద మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేయాలని చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వమే ప్రయివేటు సంస్థలు ఎక్కువ ధరలకు అమ్ముకునేందుకు విధానపరంగా ప్రోత్సహిస్తున్నది. అందరికీ టీకా వేయాలంటే ప్రస్తుతం ఉన్న పద్ధతుల ప్రకారమైతే కొన్నేండ్లు పడుతుంది. ఈలోపు లక్షల మంది కరోనా బారిన పడే ప్రమాదముంది. రెండోదశ కరోనా మోడీ ప్రభుత్వ వైఫల్యం కారణంగా వచ్చిందని చెప్తున్నాం.

ప్రశ్న : దేశంలో ఆక్సిజన్‌ కొరతతో చాలా మంది మరణిస్తుంటే కేరళ ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసింది. అదెలా సాధ్యమైంది?
రాఘవులు : కరోనా రెండోదశ ఉధృతం కాకుండా నివారించే అవకాశం ఉన్నా మోడీ ప్రభుత్వం వైఫల్యం మూలంగా కోట్లాది మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. రాష్ట్రాలకు తగినంత ఆక్సిజన్‌ సరఫరా చేయకపోవడంతో వందల మంది మరణించారు. తిరుపతిలో రుయా ఆస్పత్రిలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 11 మంది, హిందూపూర్‌, విజయనగరం, ఢిల్లీ, కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరత వల్ల రోగులు చనిపోయారు. అనేక ఆస్పత్రులు ఆక్సిజన్‌ లేదని రోగులను చేర్చుకోవడం లేదు. దీంతో అనేక మంది రోగులు రోడ్లమీదే ప్రాణాలు వదిలిన ఘటనలు చూస్తున్నాం. అనేక పరిశ్రమల్లో అవసరాల కోసం ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. తాత్కాలికంగా దాన్ని కోవిడ్‌ రోగుల కోసం మళ్లించవచ్చు. ఇతర అవసరాల కోసం వాడుతున్న ట్యాంకర్లను స్వల్ప మార్పులతో ఆక్సిజన్‌ ట్యాంకర్లుగా వినియోగించవచ్చు. కేంద్రం ఆ పని చేయలేదు. వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ సరఫరా, కోవిడ్‌ వైద్యం ఇలా అన్నీ లాభం కోసమే అన్నట్టుగా కొన్ని సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చేలా కేంద్రం వ్యవహరించింది. కానీ కేరళలో దీనికి పూర్తి భిన్నం. చిన్న రాష్ట్రంలో పెద్దగా ఆర్థిక వనరుల్లేని ప్రభుత్వమైనా కరోనా తాకిడి ఎక్కువున్న రాష్ట్రమైనా అక్కడి వామపక్ష ప్రభుత్వం ఉన్న వనరులతోనే ప్రజలను ఆదుకునేందుకు కృషి చేసింది. దీనికి జాతీయ, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ముందుచూపుతో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను పెంచింది. ప్రభుత్వ వైద్యం, ఆస్పత్రులను పటిష్టం చేసింది. వాటిలో పడకలు చాలకపోతే హోటళ్లను తీసుకుని కోవిడ్‌ వైద్య కేంద్రాలుగా మార్చింది. పంచాయతీలు, మున్సిపాల్టీలు, ప్రజాప్రతినిధులను రంగంలోకి దించింది. ఆయా పరిధిలో సహాయ కార్యక్రమాలను చేపట్టేటట్టు ప్రోత్సహించింది. వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ సరఫరా కోసం ఇతర రాష్ట్రాలతో కలిసి వామపక్ష ప్రభుత్వం మోడీ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుండి కృషి చేస్తున్నది.

ప్రశ్న : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, ఫలితాలపై మీరేమంటారు?
రాఘవులు : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనా రెండోదశను ఎదుర్కోకపోవడం ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపింది. బిజెపికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అస్సాంలో గెలిచినా సీట్లు తగ్గాయి. పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్‌ నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. దీన్ని బిజెపి గెలుపుగా చూడలేం. బెంగాల్‌లో బిజెపికి శృంగభంగం జరిగింది. కేరళలో ఉన్న ఒక్క స్థానం కోల్పోవడమే కాకుండా ఓటింగ్‌ తగ్గింది. తమిళనాడులో బిజెపి ప్రభావం చూపలేకపోయింది. ఈ ఫలితాలతో బిజెపి దేశవ్యాప్తంగా రాజకీయంగా వెనకడుగు వేయాల్సి వచ్చింది. మోడీ-షా వైఫల్యం కారణంగానే ఓడిపోయామని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల శ్రేణుల్లో అసంతృప్తి పెరిగింది. మోడీ బలమైన నాయకుడు అన్న భావన పూర్తిగా కొట్టుకుపోయింది. రాబోయే కాలంలో దేశ రాజకీయాల్లో మార్పులు సంభవించే అవకాశముంది. లౌకిక వ్యవస్థను రక్షించుకోవాలనుకునే శక్తులకు ఊతం దొరికింది. ప్రాంతీయ పార్టీలు బతకాలంటే బిజెపితో సర్దుబాటులో ఉండాలన్న అభిప్రాయం ఉండేది. కోవిడ్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రధానికి లేఖ రాశాయి. అందులో కొన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులున్నారు. బిజెపిని ఎదిరించి మాట్లాడే ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రాంతీయ పార్టీలకు కలిగింది. దురదృష్టవశాత్తూ జగన్మోహన్‌ రెడ్డి, కెసిఆర్‌ ప్రతిపక్ష పార్టీల లేఖలో సంతకాలు చేయలేదు. కానీ కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖలు రాశారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తేనే రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయి. ఒంటరిగా ఉండి బిజెపి పెత్తనాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. బిజెపిని ప్రశ్నించకపోతే ప్రాంతీయ పార్టీల మనుగడకే ప్రమాదం వస్తుంది.

ప్రశ్న : బెంగాల్‌లో ఒక్క సీటు గెలవకపోవడం, కేరళలో రెండోసారి అధికారంలోకి రావడాన్ని ఎలా చూస్తారు?
రాఘవులు : ఇవి మిశ్రమ ఫలితాలు. బెంగాల్‌లో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. కేరళలో వామపక్ష ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. తమిళనాడులో సిపిఎం భాగస్వామిగా ఉన్న కూటమి విజయం పొందింది. అస్సాంలో కూటమి అధికారంలోకి రాకపోయినా సిపిఎం అసెంబ్లీలో ప్రాతినిధ్యం సంపాదించింది. బెంగాల్‌లో అపజయాన్ని తీవ్రంగా తీసుకోవాలి. 34 ఏండ్లు పాలించిన పెద్దరాష్ట్రంలో క్రమేణా ఎన్నికల్లో బలహీనపడుతున్నది. కొంత బలాన్ని పుంజుకుంటుందని భావించాం. అది జరగలేదు. బెంగాల్‌లో వచ్చిన ఫలితాలను తీవ్రంగా పరిగణిస్తున్నది. ఎందుకు ఇలాంటి ఫలితాలు వచ్చాయనేది విశ్లేషిస్తుంది. రాజకీయంగా, పరిపాలనా పరంగా, సైద్ధాంతికంగా ఎక్కడ లోపాలు జరిగాయో గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరముంది. రాబోయే కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్మొహమాటంగా చర్చించి తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలని నిర్ణయం తీసుకుంటాం.

ప్రశ్న : కోవిడ్‌ నేపథ్యంలో మీ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?
రాఘవులు : కోవిడ్‌ విపత్తు సందర్భంగా సిపిఎం అనేక రూపాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నది. ఇంత జనాభాకు సేవ చేయాలన్నా, కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, వ్యవస్థలు పూనుకోవాలి. అవి పూనుకునేటట్టుగా ప్రజా ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి తేవాలి. మిగతా రాజకీయ పార్టీలను సమీకరించి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కృషి చేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలు ప్రధానికి లేఖ రాయడంలో, రాష్ట్రపతి వద్దకు ప్రతినిధి బృందం వెళ్లేందుకు ప్రయత్నించింది. కోవిడ్‌ నిబంధనలకు లోబడి వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనలు చేస్తున్నది. పౌరసమాజాన్ని చైతన్యపరిచి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ బాధితులకు వివిధ రూపాల్లో సహాయం చేస్తున్నది. అనేక రాష్ట్రాల్లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి రోగులకు మానసిక ధైర్యం ఇవ్వడంతోపాటు వైద్య సేవలు అందిస్తున్నది. అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పించే పనులు చేస్తున్నది. ప్రయివేటు ఆస్పత్రులు బెడ్‌కు రూ.20 వేలు, కార్పొరేట్‌ ఆస్పత్రులు రూ.లక్ష వసూలు చేస్తున్నాయి. మా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాలు ప్రజలకు ఊరట కల్పిస్తున్నాయి. మాకున్న శక్తి మేరకు సౌకర్యాలు, సహాయం చేస్తున్నాం. అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు, వ్యక్తులు సహాయం చేసేందుకు ముందుకు రావాలి. బెంగాల్‌లో 60 వేల మంది కార్యకర్తలు కోవిడ్‌ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. సామూహిక వంటశాలలు ఏర్పాటు చేసి భోజనాన్ని సకాలంలో అందిస్తున్నారు. మా పార్టీ కార్యాలయాలను కోవిడ్‌ కేంద్రాలుగా వినియోగించుకోవాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాం. ఐసోలేషన్‌ కేంద్రాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సూచించాం. అయినా ముందుకు రాలేదు. అందుకే మా పార్టీ ఆధ్వర్యంలోనే ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు సహాయం చేస్తున్నాం.

ప్రశ్న : లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి?
రాఘవులు : మొదటిదశలో కేంద్ర ప్రభుత్వం లాకౌడౌన్‌ను అనాలోచితంగా ప్రకటించడంతో అస్త్యవస్థం చేసింది. రెండోదశ ఉధృతి అంతకన్నా ఎక్కువగానే వచ్చింది. కానీ లాక్‌డౌన్‌కు కొన్ని పరిమితులుండాలి. అదీ తాత్కాలికంగానే విధించాలి. ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌లో ఉండాలి తప్ప పోలీసులతో నిర్బంధంగా ప్రయోగించడం సరైంది కాదు. భౌతిక దూరం, మాస్క్‌లు ధరించి, శానిటైజర్‌ వాడుతూ జాగ్రత్తలు పాటించాలి. గొలుసుకట్టును బద్దలు కొట్టడానికి లాక్‌డౌన్‌ ఉండాలి. కరోనా ఉధృతంగా ఉన్నచోట ఒక విధంగా, తక్కువ కేసులు ఉన్నచోట మరో విధంగా విధించాలి. ఇది పోలీసు కార్యక్రమంలా ఉండరాదు. తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపడం సరైంది కాదు. కేరళలో లాక్‌డౌన్‌ విధించినా అది పూర్తి భిన్నంగా అమలవుతున్నది. అక్కడ ప్రజల భాగస్వామ్యంతో ఇబ్బందుల్లేకుండా ఉన్నది.

ప్రశ్న : సుప్రీం కేంద్రాన్ని, హైకోర్టులు రాష్ట్రాలను అనేక విషయాల్లో తప్పు పడుతున్నాయి. దీనిపై ఏమంటారు?
రాఘవులు : రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ నివారణకు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులు ఘాటు వ్యాఖ్యలు చేశాయి. సుప్రీం కోర్టు సైతం ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించకపోతే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కేంద్రాన్ని హెచ్చరించింది. ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సిన్‌ ఉత్పత్తి, కోవిడ్‌ నిబంధనలు పాటించడం, కుంభమేళా, ఎన్నికలను నిర్వహించడం వంటి పరిణామాలపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని పలు సూచనలు చేయడం మంచి పరిణామం. కోవిడ్‌ రెండో దశలో కోర్టులు ప్రజానుకూల వైఖరిని ప్రదర్శించాయి.

ప్రశ్న : ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మోడీ ప్రభుత్వం సెంట్రల్‌ విస్టాను నిర్మించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
రాఘవులు : మోడీ ప్రభుత్వం కరోనా కట్టడి, ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమైంది. దేశంలో ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోయింది. కరోనాతో బాధపడే వారు ఒకవైపు, ఈ కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయిన వారున్నారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పేద కుటుంబాలకు నెలకు రూ.7,500 నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశాం. కోవిడ్‌ ఉధృతికి కారణమైన ప్రభుత్వం చేసిన పాపానికి ఇది పరిహారంగా భావించాలి. వ్యాక్సిన్‌ కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన మోడీ ప్రభుత్వం రూ.4 వేల కోట్లు ఖర్చు చేసింది. ఆక్సిజన్‌ కొరత, వ్యాక్సిన్‌ లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పిఎం కేర్‌ ఫండ్‌ పేరుతో కార్పొరేట్‌ సంస్థల నుంచి విస్తారంగా విరాళాలు వసూలు చేశారు. వాటిని రాజకీయ పరపతి కోసం వాడుకుంటున్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్లు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్ల కోసం కేంద్రం వద్ద డబ్బులేదు. ఆక్సిజన్‌ కొరతతో వందలమంది ప్రజలు చనిపోతున్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ఈ సందర్భంలో పార్లమెంటు సెంట్రల్‌ విస్టా నిర్మిస్తున్నారు. ఆ డబ్బును కోవిడ్‌ నివారణకు ఖర్చు పెట్టాలని పెద్దఎత్తున డిమాండ్‌ వస్తున్నది. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇది ఇమేజ్‌ బిల్డింగ్‌ ప్రభుత్వం. పాతకాలపు రాజు తరహాలో ప్రధాని మోడీ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బు వృధా చేస్తున్నారు.

ప్రశ్న : ఈ విపత్తు సమయంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి ఎలా ఉందంటారు?
రాఘవులు : బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారి నిర్వాకం వల్ల దేశంలో ఇంత ఘోరమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కోవిడ్‌ బారి నుంచి ప్రజలను రక్షించాల్సిన తరుణంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు మోడీ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు పాజిటివిటీ క్యాంపెయిన్‌ను చేపట్టాలని భావిస్తున్నారు. కోవిడ్‌ను ఎలా నియంత్రించగలిగామో ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. ప్రజలు బాధల్లో ఉంటే వారి ప్రతిష్టను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనుభవం నుంచి ఈ ప్రభుత్వం నేర్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలు ఉద్యమాల ద్వారా రాజకీయ నిర్ణయంతో బిజెపి సర్కారుకు బుద్ధి చెప్పాలి. అప్పుడే జ్ఞానోదయం కలుగుతుంది

                          @ప్రజాశక్తి దినపత్రిక నుండి సేకరణ