మారోజు వీరన్న బాటలో బహుజనుల నడక!

578

ప్రజల ఆపదను తన ఆపదగా చేసుకుని తాను ముందు నిలబడు వాడే నిజమైన విప్లవకారుడని చెప్పి ఆచరణాత్మక ఉద్యమాలు చేసిన కామ్రేడ్ మారోజు వీరన్న మహాత్మా జ్యోతి బా పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్, చదువుల తల్లి, ఆరోగ్య మాత సావిత్రి బాయి పూలేల నిజమైన వారసుడుగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి పీడిత ప్రజలకు అండగా నిలిచాడు. అరె తమ్మీ, ఊకే సిద్ధాంత భజన కాదుర బై ముందు ఆచరణ, ఆచరణే గీటురాయి, ఆచరణే సిద్ధాంతాన్ని పదును పెడుతుందని బోధించి ఉద్యమకారులను ముందుకు నడిపిన  నాయకుడు మారోజు వీరన్న.

ప్రజల ఆపదను తన ఆపదగా చేసుకుని తాను ముందు నిలబడు వాడే నిజమైన విప్లవకారుడని చెప్పిన కామ్రేడ్ మరోజు వీరన్న చూడ్డానికి కళ్ళుండాలని, లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండాలని, ఆచరించే దమ్ముండాలని, అన్నింటికీ మించి ప్రజల పట్ల ప్రేముండాలని బోధించి ఆచరించిన వాడు వీరన్న. ఆనాడు వీరన్న చెప్పిన మాటలను, తన ఆచరణాత్మక ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడమంటే నేటి కరోనా కష్ట కాలంలో ఉద్యమకారులుగా, సంఘాలుగా, ప్రగతిశీల శక్తులుగా, బాద్యత గల ప్రజలుగా మనమేమి  చేయాలో నిర్ధేశితమవుతుంది.

కరోనా మహమ్మారి రూపంలో ఏర్పడ్డ ఆరోగ్య సంక్షోభం ప్రపంచాన్ని పీడిస్తూ ముఖ్యంగా ఇండియాను ఎక్కువగా పట్టి పీడిస్తున్న సందర్భంలో ప్రజా  ఉద్యమకారులుగా వారి  కర్తవ్యాలను రూపొందించుకోవడం చాలా అవసరం. ప్రతిపక్షాలతో పాటు ప్రగతిశీల ఉద్యమకారులు సైతం కరోనా సమస్యపై నిమిత్తమాత్రులుగా ఉంటున్నారు. అవగాహన లోపంతో కార్పోరేట్ వ్యవస్థపై పోరు చేస్తూనే మళ్ళీ అదే ఆసుపత్రుల్లో చేరుతున్న ఉద్యమకారులు ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్లో ఆలోచించుకోవాలి.

ప్రజారోగ్యంపై ఉద్యమించాల్సిన ప్రగతీశీల శక్తులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారంటే దోపిడీ సమాజానికి  పరోక్షంగా సహకరిస్తున్నట్లే అవుతుంది. ఆరోగ్య దోపిడీని వర్గ పోరాటంలో బాగంగానే చూడాల్సిన శక్తులు ప్రజారోగ్య సమస్యపై పోరాటం చేయకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ప్రాణం పోవడం ఖాయమని, ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే ప్రాణంతో పాటు డబ్బు కూడా పోతూ ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మారోజు వీరన్న లాంటి ఆలోచన, ఉద్యమాలు చేసి కరోనా కష్టాల నుండి ప్రజలను బయట పడేయాల్సిన అవసరముంది.

మారోజు వీరన్న ఒక విద్యార్థి నాయకుడుగా, గాయకుడుగా ఎన్నో ఉద్యమాలను నిర్వహించి వీరన్నంటే పి.డి.ఎస్.యు, పి డి ఎస్ యు  అంటే వీరన్న అనేంతగా తన ఉద్యమాలతో ప్రగతిశీల విద్యార్థి విభాగాన్ని నిలబెట్టాడు. క్యాపిటేషన్ పీజు కు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాలకు ట్యూషన్ ఫీజు గురుంచి ఉద్యమించి పాలకుల పీఠాలను కదిలించాడు. దేశంలో సగానికి పైగా జనాభా గల బి.సి లకు విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించాలని మండల్ కమీషన్ నివేదికకు వ్యతిరేకంగా ఆధిపత్య కులాలు చేసిన తప్పుడు ఉద్యమానికి వ్యతిరేకంగా మండల్ అనుకూల ఉద్యమంలో అందరికంటే ముందు నిలిచారు. మతవాద విద్యార్థి ఉద్యమాలకు ఎదిరించి పోరాడిన ఘనత వీరన్నకే దక్కుతుంది.

ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పై కాల్పుల సందర్భంలో కూడా అందరికన్నా ముందే రోడ్డు మీదకు వచ్చి ఉద్యమించాడు.  పి.డి.ఎస్.యు ఒక పార్టీకి అనుబంధ సంఘమైనా పార్టీ ఆదేశాల కోసం యాంత్రికంగా ఎదురు చూడకుండా సృజనాత్మకంగా తనకు తాను పథ నిర్దేశనం చేసుకుని ప్రజా సమస్యలపై ఉద్యమించేవారు. రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులపై జల సాధన ఉద్యమాన్ని ముందుకు తెచ్చి పల్లెల్లో ప్రజలను, విద్యార్థుల తల్లిదండ్రులను రైతాంగ జలసాధన ఉద్యమాల్లో బాగం చేశారు. వీరన్న ఉద్యమంలో బాగంగా నిజాం కాలేజి మైదానంలో ఎన్నో సభలు జరిగాయి. రైతాంగ సమస్యలపై, జలసాధన పోరాటం లాంటి  సామ్రాజ్యవాద వ్యతిరేక సభలంటే వీరన్న లేకుండా  ఊహించలేం.

త్యాగాల తెలంగాణ తల్లి ఎంతో మంది త్యాగదనులకు జన్మనిచ్చింది. వారిలో మరోజు వీరన్నది ఒక ప్రత్యేక స్థానం. తల్లి దండ్రుల కులాంతర వివాహ పంట తానై, సాయుధ పోరాట వారసత్వమై, సర్దార్ సర్వాయి పాపన్న, వీర బ్రహ్మం వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సీమాంధ్ర అగ్రకుల పెత్తనంలో నలిగిపోతున్న తెలంగాణ విముక్తికై మలిదశ ఉద్యమ కెరటాన్ని ఎగురవేసాడు మారోజు వీరన్న. 1997లో సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ మహాసభను స్థాపించడం జరిగింది. కుల రహిత సమాజ స్థాపనకై కులం పై విప్లవ పార్టీల సంస్కరణ వాదం పై, సాంప్రదాయిక కమ్యూనిస్టు ఉద్యమాలపై తిరుగుబాటు జెండా ఎత్తి మే 17 కామ్రేడ్స్ గా కుల రహిత సమాజం కోసం కుల ప్రజాస్వామిక సంఘాల నిర్మాణం చేపట్టిన వీరన్న బాంచోల్లని బందమేసి శూద్రులని ముద్రలు వేసి మన తాత తండ్రుల నుండి మన శ్రమని మెక్కిన దొరలు అంటూ పాటందుకుని అందుకోర గుతపందుకో ఈ దొంగల తరిమేటందుకు అంటే అగ్రకులదోపిడీ  పాలకులకు వెన్నులో వణుకు పుట్టేది.

యువతరమా, నవతరమా అంటూ విద్యార్థులు మీరే నవ నిర్మాతలు మీరేనంటూ విద్యార్థులకు యువకులకు మార్గనిర్దేశనం చేసేవాడు. మారోజు వీరన్న తెలంగాణ మహాసభను రెండు లక్ష్యాలతో ప్రారంభించాడు. ఒకటి ప్రత్యేక తెలంగాణ రెండవది తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన. అగ్రకుల ఆంధ్ర వలస పాలకుల మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్నాక ముందుకొచ్చిన తెలంగాణ ఉద్యమంలో బహుజన రాజ్య స్థాపన వెనక్కి వెళ్లి నేటి దొర పాలనకు, ఆయన నిరంకుశానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. బహుజన నేతలే టార్గెట్ గా తన పాలన కొనసాగిస్తున్నారు.

ఆనాటి ఆలే నరేంద్ర నుండి నేటి ఈటల రాజేందర్ వరకు ఆయన నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన ఎందరినో రాజకీయ సమాధి చేస్తూ దోపిడీ పాలన కొనసాగుస్తున్నాడు. మారోజు వీరన్న బాటలో నడిచి సూర్యాపేటలో తెలంగాణ మహాసభకు అధ్యక్షత వహించి, తెలంగాణ కోసం పి.డి యాక్ట్ కు గురైన డాక్టర్ చెరుకు సుధకార్ ను, టిఆర్ఎస్ కు చిల్లి గవ్వ లేనప్పుడు అన్ని విధాల సహకరించిన గాదె ఇన్నయ్యను, తెలంగాణ భవన్ కు ఆశ్రయమిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లను ఎందరినో రాజకీయ సమాధి చేసిన కెసిఆర్.. నేడు కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి రాష్ట్రంలో ఆరోగ్య దోపిడికి, ఫార్మా సిటీ నిర్మాణానికి అవకాశమిస్తున్నాడు.

హక్కులు, ఆత్మగౌరం, రాజ్యాధికారం, కుల రహిత, వర్గ రహిత సమాజ స్థాపణకై మార్క్స్, లెనిన్, మావోలకు తోడు పూలే అంబేడ్కర్ లను జతకలిపిన వీరన్న మనసా వాచా నమ్మిన దాన్ని, బోధించిన దాన్ని ఆచరించి ప్రాణాలర్పించిన అమరుడు మరోజు వీరన్న నేటి దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి ఆదర్శం కావాలి 1999 మే 16 న సీమాంధ్ర పాలకులు వీరన్న ను బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి సంబర పడ్డారు. కానీ వీరన్న త్యాగ ఫలంతో తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం మరింత విస్తృతమై  2014 లో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. సుదీర్ఘ కాలం పాటు అవిశ్రాంత పోరాటాలు చేసిన ప్రజలు ఉద్యమ పార్టీయని టిఆర్ఎస్ ను గెలిపిస్తే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయినట్లు ప్రస్తుత తెలంగాణ పాలకులు సీమాంధ్ర ఫార్మా దోపిడీ దారుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన వైనం ముందుకొచ్చింది.

సీమాంధ్ర పాలనలో తెలంగాణ భూతల్లిని నాశనం చేసి ప్రపంచ దనికులుగా అవతరించిన సీమాంధ్ర ఫార్మా కంపిణీల ఏజెంటుగా మారిన పాలకులు వారి సౌలభ్యం కోసం ప్రపంచ రాజధానిగా ఫార్మాసిటీ ఏర్పాటుకు పూనుకుంటున్నారు. ఈ ఫార్మా సిటీ వల్ల  తెలంగాణను ప్రపంచ కాలుష్య రాజధానిగా మారనుంది. అధికారాలన్ని అధి నాయకుడి చేతుల్లో కేంద్రీకరించుకుని మంత్రులను చెంచాలుగా మార్చుకుని ఆత్మగౌరవంతో నిలబడ్డ ఉద్యమకారుల్ని తీవ్ర అణచివేతకు పాల్పడుతూ తెలంగాణ ఉద్యమ శిఖరం, ముదిరాజ్ బిడ్డ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రిపదవి నుండి తొలిగించి పార్టీ బహిష్కరణ కత్తిని ఆయన మెడపై వేలాడదీసాడు.

ఒక వైపు రాష్ట్రంలో కరోనా రూపంలో ఆరోగ్య సంక్షోభం ఏర్పడ్డ పరిస్థితుల్లో రాష్ట్ర అధి నాయకుడు తీసుకుంటున్న అస్తవ్యస్థ నిర్ణయాలు రాష్ట్రాన్ని మరింత సంక్షోభంలో కి నెడుతున్నాయి. మరో దిక్కు నుండి ప్రపంచాదిపత్యం కోసం సామ్రాజ్య వాద దేశాలు కొత్త పంథాలో సాగిస్తున్న దోపిడీ వ్యూహాలలో భాగంగా కరోనా వైరస్ పుట్టించడం జరిగింది. తూర్పు పడమర చైనా, అమెరికా ఆధిపత్య వ్యూహాలకు తోడు మన దేశపు దళారి పాలకుల వల్ల ఇండియాలో తీవ్ర ఆరోగ్య సంక్షోభం నెలకొంది. సామాజిక దోపిడీ, శ్రమ దోపిడీ, ప్రకృతి వనరుల దోపిడితో తెగ బలిసిన దోపిడీ వర్గాలు నేడు కరోనా బూచి చూపిస్తూ జీవితాంతం పోగేసుకున్న నాలుగు రాళ్లను ఒక్కసారిగా ఊడ్చేసుకోవడంతో పాటు ప్రాణాలను కూడా బలిగొంటున్నారు.
ఈ ఫార్మా కార్పొరేట్ ధనదాహం నూతనంగా ఏర్పడ్డ మన తెలంగాణ రాష్ట్రాన్ని రాజధానిగా చేసుకుని గొంతు నులుముతుంది. అనేక పోరాటాలు, త్యాగాలతో, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో త్యాగాలను మరిపించే అధి నాయకుడి విధానాల వల్ల తెలంగాణ గడ్డమీద రాజన్న రాజ్యమంటూ మళ్ళీ సీమాంధ్ర రాజకీయ గొంతులు లేస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో మరోజు వీరన్న మార్గంలో పయనించడమంటే ప్రజలకు కరోనా బూచి చూపిస్తూ ప్రజా ధనాన్ని దోచుకుంటూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న అగ్రకుల కార్పొరేట్ దోపిడీ వర్గాలపై పోరాటం చేయడమే మన కర్తవ్యమవుతుంది. ప్రజారోగ్య పరిరక్షనే నేటి ప్రధాన అంశంగా ఉద్యమ శక్తులు ముందుకు సాగాలి. అన్ని ఉద్యమాలను కొద్ది కాలం పక్కన పెట్టి ఆరోగ్య ఉద్యమం చుట్టూ ఉద్యమాలు తిరగాలి.

సాయిని నరేందర్, బత్తుల సిద్దేశ్వర్లు
9704672813