డ్రామాలు చేసి,గగ్గోలు పెట్టి చట్టం నుంచి తప్పించుకోవాలని చూస్తే కుదరదు

147

– రఘురామకృష్ణరాజు రాజద్రోహాన్ని సమర్థిస్తున్న అసాంఘిక శక్తుల మీద కూడా విచారణ జరగాలి.
– రఘురామకృష్ణరాజును ఎవరూ కొట్టలేదని వైద్య బృందం నివేదికతో వీళ్ళ డ్రామా బయటపడింది
– సంగం డెయిరీ, ఈఎస్ఐ స్కాముల్లో అరెస్టు అయిన ధూళిపాళ్ళ, అచ్చెన్నాయుడులను పోలీసులు కొట్టారని చెప్పలేదే..?
– కోవిడ్ సమయంలో చట్టాలు పనిచేయకూడదా..? అన్యాయాలు, అక్రమాలు చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకోవాలా..?
– జైలుకు వెళ్ళకుండా తప్పించుకునేందుకే.. రఘురామకృష్ణరాజు ఆసుపత్రి నాటకం
–   వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  

1. ఒక బలమైన నేరారోపణ చేయబడిన నిందితుడ్ని ఏపీ పోలీసులు అరెస్టు చేసి, చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, వారికి సంబంధించిన కొన్ని తోక పార్టీలు, వారి అనుకూల మీడియా.. రాష్ట్రంలో ఏదో అన్యాయం, అక్రమం జరిగిపోతున్నట్టు, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నట్టు గత రెండు రోజులుగా గగ్గోలు పెడుతున్నాయి.
– పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజును ఎందుకు అరెస్టు చేశారో అందరికీ తెలిసిన అంశమే. ఆయన తెలుగుదేశం, జనసేన పార్టీలను ఓడించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన పార్లమెంటు సభ్యుడు.  అటువంటి వ్యక్తి ఇటీవలకాలంలో ప్రభుత్వంమీద, ముఖ్యమంత్రిగారి మీద ఏరకంగా విమర్శలు చేస్తున్నారు, రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు.
– ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడని మాటలు ఆయన మాట్లాడుతున్నారు. ఎవరైనా ఒక దశ వరకు విమర్శలు చేస్తే వాటిని భరించవచ్చు.
– చంద్రబాబు సలహా మేరకు టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అండదండలతో, వారే ఇటువంటి భాష రాసి ఇస్తే మాట్లాడినట్టుగా ఉన్న 46 సీడీలను కూడా పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు, నిందారోపణలే పనిగా పెట్టుకుని రచ్చబండ పేరుతో రఘురామకృష్ణరాజు రోజుకు గంట, రెండు గంటలు దూషిస్తుంటే, వాటిని ఆ రెండు ఛానళ్ళు లైవ్ కవరేజిలు ఇచ్చి మరింత ప్రోత్సహించాయి.
– ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అరేయ్, తురేయ్ అని మీసం తిప్పడం, కులాల్ని, మతాల్ని రెచ్చగొట్టడం, బూతుపదజాలం, నీచమైన భాష, హావభావాలతో రాష్ట్రంలో అశాంతిని, హింసకు ప్రేరేపించడం చేస్తున్నాడు.
– దేనికైనా ఒక హద్దు ఉంటుంది. చట్టం తన పని తాను చేయాలి. సామాన్యుడైనా, పార్లమెంటు సభ్యుడైనా, మంత్రి అయినా, ప్రతిపక్ష నాయకుడు అయినా చట్టానికి వ్యతిరేకంగా, సమాజంలో అశాంతిని సృష్టించి కుట్రలు చేయాలని చూస్తే.. చట్టం చూస్తూ ఉరుకుంటుందా..?

2.  ఎంపీ రఘురామకృష్ణరాజు నేరానికి పాల్పడుతున్నప్పుడుగానీ, ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిగారి పైన బూతు పదజాలం ఉపయోగించినప్పుడుగానీ ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఎందుకు అరెస్టు చేస్తారని మాట్లాడుతున్నారు, గవర్నర్ కు, ఇతరులకు లేఖలు రాస్తున్నాడు. నేరానికి పాల్పడ్డాడని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఎవరినైనా పోలీసులు అరెస్టు చేస్తారు. ప్రభుత్వం మీద రాజద్రోహానికి పాల్పడ్డాడన్న నేరానికి సంబంధించి సీఐడీ పోలీసులు అరెస్టు చేస్తే.. హైకోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేసి లోయర్ కోర్టుకు వెళ్ళమని చెప్పింది. హైకోర్టులో బెయిల్ రిజక్ట్ కావడంతో.. అప్పటివరకు బాగా నడిచిన రఘురామకృష్ణరాజు డ్రామాలకు తెరలేపాడు. లోయర్ కోర్టుకు వచ్చేటప్పుడు కుంటడం ప్రారంభించాడు. పోలీసులు కొట్టారు అని ఆయన, ఆయన లాయర్లు కోర్టు లోపల, బయట గగ్గోలు పెట్టారు.  జైలుకు వెళ్ళకుండా ఉండేందుకు, ఆసుపత్రికి వెళ్ళేందుకు రఘురామకృష్ణరాజు ఆడిన నాటకం ఇది. ఆయన హెల్త్ హిస్టరీలో భాగంగా ప్రయాణం వల్ల ఏమైనా జరిగిందా…? లేక మరేవైనా అనారోగ్య కారణాలు ఉన్నాయా..? అన్నది కూడా ఆలోచించకుండా, దున్నపోతు ఈనిందనగానే.. కట్టేయమన్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
– రఘురామకృష్ణరాజును ఎవరూ కొట్టలేదని గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల బృందం కూడా కోర్టుకు నివేదించింది.  దాంతో నిన్నటి నుంచి ఆయన నడిపిచింది అంతా డ్రామా అని తేలిపోయింది.
– రఘురామకృష్ణరాజు రాజద్రోహాన్ని సమర్థిస్తున్న అసాంఘిక శక్తులు ఎవరో బయటపడింది, వీరి మీద కూడా విచారణ జరగాలి.
– ఆఖరికి చైన్ స్నాచర్లను, పిక్ పాకెటర్లను కూడా కొట్టకుండా.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతున్న ఈ రాష్ట్రంలో ఒక ఎంపీని కొట్టాల్సిన అవసరం ఏముంటుంది..? నియోజకవర్గానికి వస్తే.. జనం కొడతారని రఘురామకృష్ణరాజు ఢిల్లీలో దాక్కున్నాది నిజం కాదా..
– ఏ కేసులో అయినా నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు.. ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ సర్టిఫికేట్ తీసుకోమని మేజిస్ట్రేట్ చెబుతారు. దాన్ని పట్టుకుని రఘురామకృష్ణరాజు, ఆయన న్యాయవాదులు ఇక్కడ ఏదో జరిగిపోయినట్టు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. పోలీసులు చట్టం పరిధి దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళకపోయినా.. ఏదో ఒకరకంగా గందరగోళం చేసి ప్రభుత్వం మీద బురదజల్లాలని వీరంతా కుట్రలు చేస్తున్నారు.

3. రఘురామకృష్ణరాజు వైయస్ఆర్సీపీకి చెందిన ఫ్యాన్ గుర్తు మీద ఎంపీగా గెలిచారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం మా పార్టీని దూషణ చేసేటప్పుడు పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని తెలియదా.. ఆ మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం లేదా..?
– ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి మతం గురించి మాట్లాడతాడు, అరెయ్, ఒరెయ్ అంటూ తల్లి పాలు తాగి.. రొమ్ము గుద్దే పనులు చేస్తుంటే.. చంద్రబాబు, వారి అనుకూల మీడియా ఏబీఎన్, టీవీ 5లు శునకానందం పొందుతాయా..?
– చట్టం తన పని తాను చేస్తుంటే.. స్క్రీన్లు పగిలిపోయే విధంగా రెండురోజులుగా కుట్రదారులంతా గుంపుగా తయారై.. అన్యాయం అక్రమం అని గగ్గోలు పెడుతున్నారు.
– నరసాపురం ఎంపీగా గెలిపిస్తే.. ప్రజల కోసం ఆయన ఎప్పుడైనా పనిచేశాడా.. ? గెలిచిన తర్వాత ఎప్పుడైనా నరసాపురం నియోజకవర్గానికి వచ్చాడా.. ? ఢిల్లీలో కూర్చుని చంద్రబాబుకు, వారికి కావాల్సిన వారికి లాబీయింగ్ చేస్తున్నాడు.  ఏనాడూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా దుర్మార్గమైన విధంగా రఘురామకృష్ణరాజు వ్యవహరించాడు.

4. ప్రభుత్వంమీద, ముఖ్యమంత్రి గారి మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే.. కులాలు, మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే రఘురామకృష్ణ రాజు భాష బాగోలేదని చంద్రబాబు ఏ ఒక్కరోజు అయినా చెప్పాడా..? చెప్పడు, ఎందుకంటే చంద్రబాబే ఇదంతా చేయిస్తున్నాడు కాబట్టి. ఈరోజు ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశామని, కొట్టామని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడు. ఆ అవసరం ఈ ప్రభుత్వానికిగానీ, పోలీసులకు గానీ అసలు ఉందా. ఎందుకు మీరు ప్రభుత్వాన్ని, పోలీసుల్ని అభాసుపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు…?
– రాష్ట్రంలో ధర్మం, న్యాయానికి ఎక్కడా ఇబ్బంది కలగలేదు, కలగదు కూడా. అయినా కోర్టుల్లో విచారణ జరుగుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఈ విధంగా గగ్గోలు పెట్టి తద్వారా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే కార్యక్రమం చేస్తున్నారు.
– సంగం డెయిరీ స్కాం లో ధూళిపాళ్ళ నరేంద్రను, ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడును గతంలో పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు వారిని ఏమైనా కొట్టారా.. ? లేదే, తెలుగుదేశం వారి పట్లే పోలీసులు అంత మర్యాదగా ప్రవర్తిస్తే… రఘురామకృష్ణరాజును ఎవరు మాత్రం కొడతారు, ఎందుకు కొడతారు…?

5. డ్రామాలు చేసి గగ్గోలు పెట్టి చట్టం నుంచి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. తప్పు చేసినవాడు ఎంతటివాడైనా శిక్షార్హులే. తప్పు జరిగిందా, లేదా అన్నది నిర్ణయించాల్సింది న్యాయస్థానాలే.  చంద్రబాబు, వారి తోక పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు కలిసి ఏదో చేయాలని ప్రయత్నిస్తే, తాము అనుకున్నట్టు జరగదు.

6. గతంలో  ఒక అబద్ధపు కేసులో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేస్తున్నప్పుడు రఘురామకృష్ణరాజును విచారించాలి అని ఇదే చంద్రబాబు స్టాండ్ తీసుకున్నాడు, ఆరోజు ఏమైంది..? ఈరోజు మమ్మల్ని, మా పార్టీని, ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నాడు కాబట్టి చంద్రబాబుకు కావాల్సినవాడు అయిపోయాడా..? తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే స్వభావం ఉన్న రఘురామకృష్ణరాజు చంద్రబాబుకు, ఆయన అనుకూల మీడియాకు ప్రజాస్వామ్యవాదిగా కనిపిస్తున్నాడా..?
– వైయస్ఆర్సీపీ రఘురామకృష్ణరాజును టార్గెట్ చేసిందా..? లేక ఆయనే కుట్రపూరితంగా పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాడా..?

7. కోవిడ్ లో ఎలా అరెస్టు చేస్తారని చంద్రబాబు, కొన్ని తోక పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. అంటే కోవిడ్ సమయంలో చట్టాలు పనిచేయకూడదా..? అన్యాయాలు, అక్రమాలు చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకోవాలా..?
– చట్టం ముందు అందరూ సమానులే. చంద్రబాబు, ఎల్లో మీడియా సపోర్టు ఉన్నంతమాత్రాన.. రఘురామ కృష్ణరాజు అయినా, సామాన్యుడు అయినా చట్టం ముందు ఒక్కటే.
– రఘురామకృష్ణరాజుకు వై కేటగిరి భద్రత కల్పించింది తప్పులు చేసి, చట్టం నుంచి తప్పించుకోవడానికి కాదు, రక్షణ కోసం మాత్రమే. తప్పు చేస్తే  ఎవ్వరూ కాపాడలేరు. చంద్రబాబు రాజకీయ లబ్ధిపొందాలని రఘురామకృష్ణరాజు అరెస్టును బూతద్దంలో చూపిస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చిత్రీకరిస్తున్నాడు. చంద్రబాబు అబద్ధాలను, అసత్యాలను ప్రజలు నమ్మే రోజులు పోయాయి.