కరోనా లోనూ కలహాలేనా ? కేంద్రాన్ని ప్రశ్నించరే

235

కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రం అలక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజల శ్రేయస్సు రీత్యా ఉమ్మడి లేఖ రాసినవారిలో….ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌గాని, ప్రతిపక్ష నేత చంద్రబాబు గాని, తెలంగాణ అధినేత కెసిఆర్‌ గాని లేరు. రాష్ట్రాలకు నిధులు, మందులు, టీకాలు అందని పరిస్థితులలో కూడా కేంద్రంలో బిజెపి ని గట్టిగా అడిగేందుకు వీరు గొంతు కలపలేకపోతున్నారు. జగన్‌ అవకాశం దొరికినప్పుడల్లా మోడీ నాయకత్వ పటిమను దార్శనికతను పొగిడి పొగిడి పరవశిస్తున్నారు. ప్రత్యేక హోదా నుంచి కరోనా తక్షణావసరాల వరకు ఏ విషయం లోనూ కేంద్రాన్ని గట్టిగా అడగడానికి జగన్‌ సిద్ధపడక పోవడానికి కారణం తనపై వున్న కేసులేనని వ్యాఖ్యలు వస్తున్నా స్పందించడం లేదు.

కరోనా విజృంభణ కోవిడ్‌-19 వైరస్‌ తాకిడికి ప్రపంచం తల్లడిల్లుతున్నది. సెకండ్‌ వేవ్‌లో భారత్‌ లో పాజిటివ్‌ కేసులు నాలుగు లక్షలు, మరణాలు రోజుకు నాలుగు వేలు పైనే వున్నాయి. తెలుగు రాష్ట్రాలూ ఇందుకు మినహాయింపుగా లేవు. గతానికి భిన్నంగా ఆక్సిజన్‌ కొరత వున్నఫలాన ప్రాణాలు తీస్తున్న తీరుకు తిరుపతి రుయా ఆస్పత్రి విషాదం తాజా ఉదాహరణగా వుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని మోడీ ముందుచూపు లేకపోవడం వల్లనే దేశం ఇంత కల్లోలం చూస్తున్నదనే విమర్శ మార్మోగుతున్నది.

మోడీ ఇమేజి కాపాడ్డం కోసం సంఘ పరివార్‌ ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సి వస్తున్నది. కేరళ వంటివి మినహాయిసే చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు తమ పాత్ర సకాలంలో సమర్థంగా నిర్వహించడం లేదనే విమర్శ నెదుర్కొంటున్నాయి, హైకోర్టులు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఆగ్రహావేదనలు వ్యక్తం చేస్తున్నాయి. రోజూ వేల మంది ప్రాణాలు కోల్పోతున్నప్పుడు, ఆస్పత్రులలో చోటు కోసం, చేరిన తర్వాత ఆక్సిజన్‌ కోసం, రెమ్‌డెసివిర్‌ కోసం అల్లాడుతున్నప్పుడు, వ్యాక్సిన్‌ కోసం బారులు తీరి గంటల తరబడి నిరీక్షిస్తున్నప్పుడు…పాలకులపై విమర్శ రాకుండా ఎలా వుంటుంది? అధికారంలో వున్నవారు దాన్ని భరించడమే గాక పొరబాట్లు దిద్దుకోవలసి వుంటుంది.

ప్రజాస్వామ్యంలో ఇదంతా సహజం, అవసరం కూడా. అయితే ఆ విమర్శలు వాటిపై ప్రతిస్పందనలు కూడా సహేతుకంగానూ సందర్భోచితంగానూ వుండాలి. సమస్యపై కేంద్రీకరించేవిగా వుండాలి తప్ప సాధారణ రాజకీయ కలహాల స్థాయికి చేరకూడదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కరోనా తీవ్రత వైసిపి, టిడిపి ల మధ్య కలహాల తీవ్రతగా మారడం ఇందుకు భిన్నంగా వుంది. ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడం, కేసులు పెట్టుకోవడం, తిట్టుకోవడం నిత్యకృత్యమైంది.

వైరస్‌ వేరియంట్‌పై వైరాలు
కర్నూలులో ఎన్‌.కె.440.ఎస్‌ అనే వేరియంట్‌ వ్యాపించిందని ఒక దశలో వార్తలు వస్తే దాన్నే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన విమర్శలో జోడించారు. ఆ తర్వాత కోవిడ్‌ సెంటర్‌ ఇన్‌చార్జి జవహర్‌రెడ్డి అలాంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) గుర్తించలేదని చెప్పారు. ఆ కథ అక్కడితో ముగిసిపోవాల్సింది. అయితే ఇరు పక్షాలూ పంతాలకు పోవడంతో సాగదీయబడింది, ఒకరికొకరు ఉద్దేశాలు ఆపాదించుకోవడమే గాక కేసులు పెట్టుకునేవరకూ వెళ్లింది.

చంద్రబాబుపై ఎవరో లాయర్‌ కర్నూలులో కేసు పెట్టారని పోలీసులు క్రిమినల్‌ నోటీసులు తయారు చేస్తే మంత్రి అప్పలరాజు కూడా అదే వేరియంట్‌ గురించి చెప్పారని టిడిపి నేతలు ఎదురు కేసు పెట్టారు. కోవిడ్‌ గురించి అసత్యాలు వ్యాప్తి చేస్తే కేసులు పెడతామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. తర్వాత ఇతర చోట్ల కూడా చంద్రబాబుపై కేసులసు నమోదు చేస్తూనే వున్నారు. చంద్రబాబును ఏదో కేసులో ఇరికించి కరోనా తెప్పించి ప్రభుత్వం మర్డర్‌ చేయాలనుకుంటున్నదని టిడిపి ఎంఎల్‌సి ఒకరు ఆరోపిస్తే అవాస్తవ ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టి చంద్రబాబు మాస్‌మర్డర్‌ సృష్టించాలనుకుంటున్నారని సజ్జల ఎదురుదాడి చేశారు.

వ్యాక్సిన్‌ వార్‌ – వాస్తవాలు
వ్యాక్సిన్‌ కొరతపై వాదోపవాదాలలో ఈ రాజకీయ కలహం పరాకాష్టకు చేరింది. నిజానికి ఈ సమస్య దేశమంతా వున్నదే. 130 కోట్ల జనాభా వున్న ఈ దేశంలో వ్యాక్సిన్‌ తొలి ఉత్పత్తి పది కోట్ల డోసులు కూడా దాటలేదు. మొదటి దశలో 90 శాతం వాటాగా వున్న కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేసే సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గాని, మిగిలిన పదిశాతంగా వున్న కోవాగ్జిన్‌ భారత్‌ బయోటెక్‌ నుంచి గాని మరో ఆరు మాసాలకైనా దేశంలో అందరికీ అందుబాటులోకి వస్తాయా అనేది సందేహమే. ఆ సంస్థల ప్రతినిధులే తమ ఉత్పత్తి సామర్థ్యం పరిమితులు ప్రకటించారు తయారైన వ్యాక్సిన్‌ కూడా కేంద్రం కోటాల ప్రకారమే సరఫరా జరిగే పరిస్థతి.

రాష్ట్రాలు నేరుగా మాట్లాడుకునే వెసులుబాటు ఇచ్చినా పరిమాణం చాలా తక్కువ. ప్రైవేటు రంగంతో పోటీ పడాల్సిన స్థితి. దీనిపై చాలా రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎ.పి లో మాత్రం ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందని, డబ్బు కేటాయించకపోవడం వల్లనే జరిగిందని టిడిపి ఆరోపించింది. ఒకరోజు కమిషన్‌తో రాష్ట్రమంతటికీ వ్యాక్సిన్‌ వస్తుందని టిడిపి ఎంఎల్‌ఎ ఒకరన్నారు. మరోవైపున వైసిపి ప్రభుత్వం 1600 కోట్లు మీకే ఇస్తాము తెప్పించండని, భారత్‌ బయోటెక్‌ వారు మీ బంధువులేనని చంద్రబాబుకు ప్రతి సవాలు విసిరింది. నేనే వ్యాక్సిన్‌ తెప్పిస్తే మీరెందుకని చంద్రబాబు ఎదురు దాడి చేశారు.

వైసిపికి సంబంధించిన పత్రికలో రుయా ఆస్పత్రి విషాదం రెండు కాలాల చిన్న వార్తగా వచ్చింది గాని ఈ వివాదం బ్యానర్‌ అయింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ కోవాగ్జిన్‌ ఫార్ములాను ఇతరులకూ ఇచ్చి ఉత్పత్తి చేసే అవకాశం కలిగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ, బెంగాల్‌ ముఖ్యమంత్రులు కూడా అదే విధమైన సూచనలు చేశారు. ఒత్తిడి పెరిగిన తర్వాత భారత్‌ బయోటెక్‌ ఫార్ములాను పంచుకునేందుకు సిద్ధంగా వుందని కేంద్రం ప్రకటించింది. ఇది మా వల్లే జరిగిందని ఎ.పి సర్కార్‌ చెప్పుకుంటే కేంద్రం గత ఏప్రిల్‌ లోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుందని టిడిపి అనుకూల మీడియా కథనాలు ఇస్తుంది.

వాస్తవానికి సిపిఎం పొలిట్‌బ్యూరో, అలాగే ప్రజావైద్య ఉద్యమం కూడా మొదట్లోనే వ్యాక్సిన్‌ గుత్తాధిపత్యం తొలగించి అందరూ ఉత్పత్తి చేసే అవకాశం ఇవ్వాలనీ, ప్రభుత్వ రంగానికి పెద్ద పీట వేయాలని సూచించాయి. ప్రపంచంలో అందుబాటులో వున్న వివిధ వ్యాక్సిన్‌లు దిగుమతి చేసుకోవాలని చెప్పాయి. ప్రబీర్‌ పురఖాయస్త వంటి వారు ఆ విషయమై రాసిన వ్యాసాలు కూడా ప్రజాశక్తిలో వచ్చాయి. కోవిడ్‌ విషయంలో నిజంగా ఎ.పి సర్కారుకు ముందు చూపు వుంటే పరిస్థితి మరోలా వుండేది. ఆక్సిజన్‌కు తీవ్ర సమస్య ఏర్పడి విజయనగరం, అనంతపురం తదితర చోట్ల వరుస మరణాలు సంభవిస్తున్నా చాలా రోజులు మంత్రులు, అధికారులు సమర్థనలో వుండిపోయారు.

అదే కేరళ తన అవసరాలను తీర్చుకోవడమే గాక ఇతరులకు కూడా సరఫరా చేసే స్థాయిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నది. ఇప్పుడు అవసరం మరింత పెరిగాక ఇతరులకు ఇవ్వలేనని ప్రకటించింది. ఇలాంటి సమగ్ర వ్యూహం ఎ.పి కి లేకపోగా ప్రతిదానికి ప్రతిపక్షాలను మీడియాను ఖండించడమే పనిగా పెట్టుకున్నది. రుయా ఘటన పై ముఖ్యమంత్రి స్పందనలోనూ కొన్ని మీడియా సంస్థల పేర్లు చెప్పి సమస్యను పెద్దవి చేస్తున్నాయని ఆరోపించారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచే ప్రణాళిక ప్రకటించారుగాని అమలులోకి వచ్చాక చూడాలి.

తెలంగాణ పోలీసుల నిర్వాకం
ఇవన్నీ ఇలా వుంటే ఎ.పి నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణ పోలీసులు సరిహద్దు చెక్‌పోస్టులలో ఆపడం తీవ్ర ఆందోళన, ఆవేదనకు దారితీసింది. కరోనా చికిత్స అవసరాలను బట్టి చూసినా హైదరాబాద్‌కు మరో మూడేళ్లు ఎ.పి, తెలంగాణ ఉమ్మడి రాజధాని ప్రతిపత్తి రీత్యా చూసినా ఇది చాలా అనూహ్యమైన పరిణామం. ఈ ఘటనలు కలకలం రేపుతున్నా ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పందన లేకపోయింది. తెలంగాణ హైకోర్టు తనకు తానుగా దీనిపై ఆగ్రహం వెలిబుచ్చి ఆపవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినా తెలంగాణ వైఖరి మారకపోవడం, ప్రభుత్వం ఒక ఏకపక్ష సర్క్యులర్‌ ఇవ్వడంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేయాల్సి వచ్చింది.

ఆ సమయంలో హైకోర్టు మరింత తీవ్రంగా హెచ్చరించింది. దేశంలో ఎక్కడైనా చికిత్స పొందే హక్కు అవకాశం వున్నప్పుడు ఇలా అడ్డుకోవడం రాజ్యాంగం 21వ అధికరణానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. అప్పటికిగాని ఏపి ప్రభుత్వ జోక్యం లేకపోయింది. చాలా ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వ ప్రతినిధి దీనిపై విచారం వెలిబుచ్చుతూ మానవతా దృక్పథంతో అంబులెన్సులను అనుమతించాలని విజ్ఞప్తి చేయడంతో సరిపెట్టారు. చెన్నై, బెంగుళూరు వంటి చోట్ల లేని అభ్యంతరం హైదరాబాదులో ఎందుకని ప్రశ్నించారు తప్ప ఇక్కడ ప్రత్యేక నేపథ్యంలో గట్టిగా అడిగింది లేదు.

ఎ.పి లో సదుపాయాలు లేక వారు హైదరాబాదు వస్తున్నారని చంద్రబాబు అంటే మీ పాలన వల్లనే ఆరోగ్య వ్యవస్థ అరకొరగా వుండిపోయిందని ప్రభుత్వం వాదించింది. సచివాలయ తాళాలు అప్పగించిన తర్వాత ఇంకా ఉమ్మడి రాజధాని ఏమిటని టిఆర్‌ఎస్‌ పత్రిక రాస్తే చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి వచ్చేయడం వల్లనే హక్కు పోయిందని కూడా అధికార ప్రతినిధి అన్నారు. కేంద్రాన్ని పాలించే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడేమో హైదరాబాదుపై ఎ.పి కి ఇప్పటికీ సంపూర్ణ హక్కులున్నాయని వ్యాఖ్యానించారు. రాజ్యాంగపరంగా ఇందులో ఏది వాస్తవమో తేల్చుకోవలసి వుండగా రాష్ట్ర ప్రభుత్వం హక్కును వదులుకుంటున్నట్టు కనిపిస్తుంది. హక్కు వుందంటున్న బిజెపి ఈ సమస్యలను పరిష్కరించదు.

కేంద్రం ముందు గప్‌చిప్‌
కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రం అలక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజల శ్రేయస్సు రీత్యా తక్షణ సూచనలు చేస్తూ దేశంలోని 12 జాతీయ ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు, కొందరు ముఖ్యమంత్రులు ఒక ఉమ్మడి లేఖ రాశారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌, ఎన్‌సిపి వంటి పార్టీలతో పాటు జెడిఎస్‌, శివసేన టిఎంసి, ఆర్‌జెడి వంటి ప్రాంతీయ పార్టీలు కూడా దీనిపై సంతకాలు చేశాయి. గతవారమే ముఖ్యమంత్రి పీఠమెక్కిన డిఎంకె అధినేత స్టాలిన్‌ కూడా వారిలో వున్నారు. ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌గాని, ప్రతిపక్ష నేత చంద్రబాబు గాని, తెలంగాణ అధినేత కెసిఆర్‌ గాని దానిపై సంతకం చేసిన వారిలో లేరు. రాష్ట్రాలకు నిధులు, మందులు, టీకాలు అందని పరిస్థితులలో కూడా కేంద్రంలో బిజెపిని గట్టిగా అడిగేందుకు వీరు గొంతు కలపలేకపోతున్నారు.

జగన్‌ అవకాశం దొరికినప్పుడల్లా మోడీ నాయకత్వ పటిమను, దార్శనికతను పొగిడి పొగిడి పరవశిస్తున్నారు. పైగా విమర్శించిన జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత సొరేన్‌ వంటివారిని ఆక్షేపిస్తున్నారు. దీనిపై దేశంలోని చాలా పార్టీలు, మీడియా అపహాస్యం చేశాయి కూడా. ప్రత్యేక హోదా నుంచి కరోనా తక్షణావసరాల వరకు కూడా ఏ విషయంలోనూ కేంద్రాన్ని గట్టిగా అడగడానికి జగన్‌ సిద్ధపడకపోవడానికి కారణం తనపై వున్న కేసులేనని వ్యాఖ్యలు వస్తున్నా స్పందించడం లేదు. ఒకప్పుడు దేశంలో సమాంతర వేదికకు భూమికగా వున్న తెలుగునేలపై రెండు రాష్ట్రాలూ కేంద్ర బిజెపి నిరంకుశత్వానికి తలవంచడం ఒక రాజకీయ విషాదం. జగన్‌ కేసులను గురించే నిరంతరం మాట్లాడే టిడిపి కూడా వైసిపిని విమర్శిస్తూ కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతుంటుంది. మూల విరాట్టును వదిలిపెట్టి తమలో తాము తిట్టిపోసుకుంటూ కాలక్షేపం చేయడం నిరంతర వినోదం, సిపిఎం వంటి పార్టీలు కోవిడ్‌ బాధితుల కోసం ప్రతి జిల్లాలో ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్న మేరకు కూడా వీరు చొరవ చూపకపోవడం ఆశ్చర్యకరం.

-తెలకపల్లి రవి