ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు రాజకీయ కుట్రకు చంద్రబాబు ప్లాన్

555

–  దీనిపై లోతైన విచారణ జరపాలి
– లోక్‌సభలో వైయస్ఆర్సీపీ ఫ్లోర్‌లీడర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపిలు వల్లభనేని బాలశౌరి,  లావు శ్రీకృష్ణదేవరాయలు 

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు చేస్తున్న పెద్ద కుట్రలో రఘురామకృష్ణరాజు పావుగా మారాడని లోక్‌సభ లో వైయస్‌ఆర్‌సిపి ఫ్లోర్‌లీడర్  పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. రఘురామకృష్ణరాజును విచారిస్తే, ఆయన ఫోన్ కాల్స్ ను బయట పెడితే.. తెరవెనుక ఉన్న అసలు కుట్రదారులు, పాత్రధారులు అయిన చంద్రబాబు, టీవీ 5, ఏబీఎన్ కుట్రలు బయటకు వస్తాయని భయపడుతున్నది నిజం కాదా.. అని మిథున్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అందుకే దీనిపై లోతైన విచారణ జరిపి కుట్రదారులను బయట పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. పైగా కుట్ర చేయడం తప్పు కాదు.. రమేష్ ఆసుపత్రిలో చేర్చకపోవడం తప్పు అన్నట్టుగా చంద్రబాబు చర్చకు తెరలేపడం అంటే అంతకంటే విడ్డూరం, దుర్మార్గం మరొకటి ఉందని మిథున్ రెడ్డి అన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఎంపీలు వల్లభనేని బాలశౌరి,  లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….

–  వైయస్‌ఆర్‌సిపి నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు చంద్రబాబు వేసిన వలలో చిక్కుకున్నారు. తెలుగుదేశం పార్టీ డైరెక్షన్‌లో, చంద్రబాబు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి గారిపైన కుట్రలు అమలు చేస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన స్ర్కిప్ట్‌ను నిత్యం టిడిపి అనుకూల మీడియా ముందుకు వచ్చి చదువుతున్నాడు. గత తొమ్మిది నెలలుగా మా ఎంపీలను, నేతలను, ఏకంగా సీఎం  వైయస్ జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించడం, అసభ్యంగా మాట్లాడటం చేస్తున్నా కూడా సహించాం. కానీ ఈ రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని, ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నించడం వల్లే చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటున్నాం.

–  మొదటి నుంచి రఘురామకృష్ణరాజు వెనుక చంద్రబాబు ఉండి నడిపిస్తున్నాడని మేం చెబుతూనే ఉన్నాం. ఈ రోజు అది నిజం అని నిర్థారణ అయ్యింది. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయగానే చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఆయనకు బెయిల్ నిరాకరించగానే చంద్రబాబు డైరెక్షన్ ప్రకారం రఘురామకృష్ణరాజు తనను పోలీసులు కొట్టారంటూ.. కొత్త నాటకానికి తెర తీశారు. బెయిల్ కోసం కోర్ట్ కు వచ్చే వరకు ఆయన ధీమాగానే నడుచుకుంటూ వచ్చారు. మధ్యాహ్నం ఆయనకు భోజనం అందించిన కుటుంబసభ్యులు కూడా మీడియాతో మాట్లాడారు. కానీ వారు ఎక్కడా రఘురామకృష్ణరాజును పోలీసులు కొట్టారని చెప్పలేదు. ఎప్పుడైతే బెయిల్ నిరాకరించారో… వెంటనే తనను కొట్టారంటూ ఆయన కొత్త డ్రామా మొదలు పెట్టారు.

–  న్యాయస్థానం ఆదేశాల మేరకే ఆయనను ప్రభుత్వ జిజిహెచ్‌లో కోర్ట్ నిర్ధేశించిన వైద్యబృందం పరీక్షించింది. మెడికల్ బోర్డును వేసింది హైకోర్టు, ఆ బోర్డులో సభ్యుల్ని నియమించింది హైకోర్టు,  రఘురామకృష్ణరాజును పోలీసులు కొట్టలేదని వైద్యబృందం నిర్థారిస్తూ, కోర్ట్‌కు సీల్డ్ కవర్‌లో నివేదికను అందజేసిన తర్వాత దానిని చదివి వినిపించింది కూడా హైకోర్టే.. ఇందులో ప్రభుత్వ జోక్యం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజును పోలీసులు కొట్టలేదని మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చాక,  ఆ వెంటనే చంద్రబాబు ఏకంగా రాష్ట్రపతికి, ఆయన పార్టీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ లోక్‌సభ స్పీకర్‌కు లేఖలు రాశారు. ఈఎస్ఐ, సంగం డెయిరీ స్కాముల్లో తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మరో నేత దూళిపాళ్ళ నరేంద్ర అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు ఇంతలా స్పందించలేదు. ఎవరికీ లేఖలు రాయలేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు విషయంలో చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నాడు?. ఎందుకంటే, రఘురామకృష్ణరాజును విచారిస్తే.. రాజద్రోహం కేసులో తన పాత్ర కూడా బయట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నాడు కాబట్టి.

–  రాష్ట్రంలో రఘురామకృష్ణరాజును అడ్డం పెట్టుకుని చేసిన కుట్రలు ఇప్పుడు విచారణలో బయటకు వస్తాయని చంద్రబాబు కలవర పడుతున్నాడు. బిజెపిలో వున్న తన కోవర్ట్‌ల ద్వారా సిబిఐ కేసుల నుంచి బయటపడేస్తానని చెప్పి రఘురామకృష్ణరాజును చంద్రబాబు తనవశం చేసుకున్నాడు. గతంలో ఎలా అయితే శంకర్‌రావును అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ పై కేసులు పెట్టించాడో, అలాగే రఘురామకృష్ణరాజుతో లోపాయికారి ఒప్పందం చేసుకుని సీఎంగారిపైనా, ఈ ప్రభుత్వంపైనా కుట్రలు చేయించే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు ఇవ్వన్నీ బయటకు రాబోతున్నాయని చంద్రబాబు భయపడుతున్నాడు.

–  చివరికి చంద్రబాబు దిగజారిన రాజకీయాలతో రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులను కూడా పావులుగా వాడుకుంటూ, వారితో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నాడు. తెలుగుదేశం నేతలకు సన్నిహితులైన రమేష్‌ హాస్పటల్స్‌లోనే వైద్యం కావాలని అడగడంలో వారి ఉద్దేశం ఏమిటీ? గుంటూరులోనే పేరు మోసిన అనేక ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఆయనకు ప్రాణహాని ఉందని, ఆయనపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేస్తూ, విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. టిడిపి అనుకూల పత్రికలు, చానెళ్ళలో దీనిపై చర్చలు పెట్టి ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు.

– ఈ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వల్ల ప్రజల్లో వైయస్‌ఆర్‌సిపికి మంచి పేరు వస్తోంది, సీఎం వైయస్ జగన్ పట్ల విశ్వాసం పెరుగుతోంది. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆయనను విమర్శించడానికి ప్రతిపక్షంగా చంద్రబాబుకు వేరే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజును అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా ఈ ప్రభుత్వంపైన, సీఎంగారిపైన బురచల్లేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నాడు.

– ముందుగా దేవాలయాల అంశాన్ని అడ్డం పెట్టుకుని మతాల మధ్య చిచ్చు పెట్టాలని రఘురామకృష్ణరాజు ప్రయత్నించాడు. అధికారంలో వున్న ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా, మరొక మతానికి వ్యతిరేకంగా పనిచేస్తుందా? అన్ని మతాలు, కులాల వారు ఓట్లు వేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు చట్టంలో లేకపోయినా కూడా అన్ని అంశాల్లో యాబైశాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత  వైయస్ జగన్ కే దక్కుతుంది. సామాజిక న్యాయం కోసం అంతగా సీఎంగారు పాటుపడుతుంటే… రఘురామకృష్ణరాజు ద్వారా దానిపైనా ఆరోపణలు, విమర్శలు చేయించారు. ప్రజలు కూడా చంద్రబాబు చేస్తున్న ఇటువంటి పనికిమాలిన రాజకీయాలను నమ్మె స్థితిలే లేరు.

–  రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఈ ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రను, దాని వెనుక ఎవరు ఉన్నారో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి బయటపెట్టాలి. దీనిపై లోతైన విచారణ జరగాలి. ఈ కుట్రలో భాగస్వాములను బహిర్గతం చేయాలని పోలీసులను కోరుతున్నాం.

వైయస్‌ఆర్‌సిపి ఎంపి వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ…
–  గత ఏడాదిగా రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఎంపీ కాకముందే ఆయన 5 సార్లు పార్టీలు మార్చాడు. ఆయన గురించి రాష్ట్రప్రజలకు తెలుసు. ఆయన మొదటిసారి ఎంపీ అయిన వ్యక్తి. సీఎం జగన్ గా ఆయనను గౌరవించి, ఆయన అభ్యర్థించిన మేరకు పార్లమెంట్ కమిటీకి చైర్మన్‌ను చేశారు. మొదటిసారి ఎంపీ అయినా సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వరు. అలాగే ఆయనకు ముఖ్యమైన రెండు కమిటీల్లో సముచిత స్థానం కల్పించారు. ఎంపీల్లో ఎవరికీ అంతటి ప్రాధాన్యత ఇవ్వలేదు.

–  రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలి చూస్తుంటే… సీఎం గారిపై స్వయంగా ఆయన మాట్లాడే భాషను మిమిక్రీ చేయడం, సొంతపార్టీ ఎంపీలను విమర్శించడం ఉద్దేశ పూర్వకంగానే చేశాడు. తరువాత సీఎం గారిని అసభ్యంగా దూషించడం, ఐఎఎస్, ఐపిఎస్‌ ఆఫీసర్లను మర్యాద లేకుండా ఇష్టారాజ్యంగా నోరుపారేసుకోవడం చేశాడు. అయినప్పటికీ మేం మౌనంగా వున్నాం. అయితే ప్రజల్లో కులాలు, మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించడంపై చట్టం కళ్లు తెరిచింది. తనపని తాను చేసుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడితే చట్టం ఎందుకు ఉపేక్షిస్తుంది? క్రిస్టియన్ పాస్టర్లు మాట్లాడే మాటలను మిమిక్రీ చేస్తారా? ఆయన అహకారపూరితంగా మాట్లాడే మాటలు చూస్తే… ఏ రాజకీయ పార్టీకి చెందిన ఎంపీ అయినా ఎప్పుడూ ఇలా మాట్లాడి ఉండరు.

– రఘురామకృష్ణంరాజు తరహాలో.. తన సొంత పార్టీల్లో ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు సహిస్తారా? జనసేనపార్టీ నేతలు మౌనంగా ఉంటారా? ఈ రోజు చంద్రబాబు ఆయనను భుజాన మోస్తూ రాష్ట్రపతికి, స్పీకర్‌కు లేఖ రాశారు. అచ్చెన్నాయుడు, నరేంద్ర అరెస్ట్ అయినప్పుడు కూడా ఇలా లేఖలు రాయలేదే? కానీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌ పై పక్కరాష్ట్రంలో కరోనాకు భయపడి దాక్కున్న చంద్రబాబు హడావుడిగా ఉత్తరాలు రాస్తారా? టిడిపికి చెందిన అచ్చెన్నాయుడు, దూళిపాల నరేంద్రను ఈఎస్ఐ, సంగం డెయిరీ స్కాముల్లో గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఎక్కడా పోలీసులు మమ్మల్ని కొట్టారని అభియోగం చేయలేదే? బెయిల్‌ కోసం రఘురామ కృష్ణరాజు ఆడుతున్న నాటకంలో ఇది ఒక భాగం మాత్రమే అన్నది మెడికల్ బోర్డు నివేదికలో తేటతెల్లమైంది.

–  రఘురామకృష్ణంరాజుకు సానుభూతి చూపుతున్న ప్రతిపక్ష నేతలు ఏనాడైనా ఆయన మాట్లాడుతున్న భాష గురించి ఆయనకు తప్పు అని చెప్పారా? మా సీఎం చాలా సహనం, ఓపికతో వున్నారు. దేశంలో ఏ సీఎం, ఏ పార్టీ అధ్యక్షుడు కూడా తన పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తిని ఉపేక్షిస్తూ, మౌనంగా ఇంతకాలం వున్నారా? తనపై చేసిన విమర్శలను ఏనాడు జగన్ గారు పట్టించుకోలేదు.

– ముద్రగడ పద్మనాభం అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఏరకంగా పోలీసులను ఉసిగొల్పారో రాష్ట్రప్రజలంతా చూశారు. ముద్రగడ కుటుంబ సభ్యులను, మహిళలన్నకనికరం లేకుండా, ఏరకంగా దుస్తులను పట్టుకుని లాక్కెళ్ళారో… ఆయన కుమారుడిని తన్నడం, ముద్రగడను బూతులు తిడుతూ లాక్కువెళ్లిన దృశ్యాలు రాష్ట్రప్రజలకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఇటువంటివి చేయించడం చంద్రబాబుకే చెల్లుతుంది.  చంద్రబాబు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. ఇటువంటి విధానాలకు మేం దూరం. ఇప్పటికైనా ఇటువంటి నాటకాలు కట్టిపెట్టి ప్రజాసేవపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నాం.

వైయస్‌ఆర్‌సిపి ఎంపి  లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ…
–  రఘురామకృష్ణరాజును రమేష్‌ హాస్పటల్స్‌ కు ఎందుకు తీసుకుపోలేదని ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారు. గుంటూరులో అది ఒక్కటే ఉందా? జిజిహెచ్ రిపోర్ట్ ఉంది, లేదా కేంద్రప్రభుత్వ ఆధీనంలోని మంగళగిరిలో ఎయిమ్స్‌ ఉంది. దానికి అయినా తీసుకువెళ్ళవచ్చు. అయినా కూడా రమేష్ హాస్పటల్స్‌కే తీసుకువెళ్ళాలని ఎందుకు అడుగుతున్నాంటే తమ అనుకూల వ్యక్తుల ఆసుపత్రిలో చేర్పించాలనే ఉద్దేశంతోనే. ఏదైతే కోర్ట్ ప్రోసీడింగ్స్‌ ప్రకారమే ఆయనను జిజిహెచ్‌కు పంపించాము. న్యాయస్థానం ఇచ్చిన గైడ్ లైన్స్‌ ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించింది. హైకోర్టు, సీఐడీ కోర్ట్ ఉత్తర్వులును చదివిన ప్రతిపక్షాలు తరువాత దీనిపై మాట్లాడితే బాగుంటుంది.

–  ఈ రాష్ట్రం నుంచి ఎంతో మంది ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్ళారు.  ఒక్కరైనా రఘురామకృష్ణరాజులా ప్రవర్తించారా? ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా ఇలా మాట్లాడారా? ఆయనకు కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చి, అన్ని విధాలుగా వైయస్ జగన్ గారు గౌరవించినా, లోపల ఏదో పెట్టుకుని, ఎప్పటికప్పుడు ప్రభుత్వంపైనా, సీఎం గారి పైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముందుగా హిందూ దేవాలయాలపైన మాట్లాడుతూ బిజెపికి దగ్గర కావాలని ప్రయత్నించాడు. తరువాత గడిచిన రెండు నెలల నుంచి కులాల ప్రస్తావన చేస్తున్నారు.  టిడిపి నాయకులు మాట్లాడాల్సినవన్నీ రఘురామకృష్ణంరాజుతో చంద్రబాబు మాట్లాడిస్తున్నాడు. ప్రతిపక్షంగా టిడిపి ఈ ప్రభుత్వంపై మాట్లాడలేని పరిస్థితి. అందుకే రాఘురామకృష్ణంరాజుతో మాట్లడిస్తున్నారు. ఒక్కసారి అయినా ఆయన తన నియోజకవర్గంకు వెళ్ళారా? కరోనా పరిస్థితులను సమీక్షించారా? లేదు దానికి బదులు వ్యంగ్యంగా, అసభ్యంగా నిత్యం టిడిపి అనుకూల మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.