ఇంత‌కంటే అమాన‌వీయం ఉంటుందా?

454

తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో ఏపీ నుంచి వచ్చే రోగుల‌ను అడ్డుకోవ‌డం ఎంత అమాన‌వీయం? ఎంత ఘోరం?  ప్రాంతాలుగా విడిపోదాం…మ‌నుషులుగా క‌లిసుందాం అన్న కేసీఆర్‌, కేటీఆర్‌, టిఆర్ ఎస్ నేత‌ల మాట‌లు నీటి మూట‌లేనా? ఇంత క‌ర్క‌శంగా ఎందుకు మారిపోతున్నారు?  ఉమ్మ‌డి రాజ‌ధాని హ‌యాంలోనే మెడిక‌ల్ హ‌బ్‌గా దేశ‌, విదేశాల నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చి వైద్యం చేయించుకునేవారు. ఇప్పుడు కూడా మ‌హ‌రాష్ట్ర నుంచి వ‌చ్చిన పేషెంట్ల‌తోనే హైద‌రాబాద్‌లోని స‌గం హాస్పెట‌ల్స్ బెడ్లు నిండిపోయాయి. మ‌రి సాటి తెలుగువారి ప‌ట్ల కేసీఆర్ ప్ర‌భుత్వం, తెలంగాణ పోలీసులు ఎందుకు అంత క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? ఏపీ, తెలంగాణ సీఎంలు భాయీభాయీలుగానే ఉంటున్నారే? మ‌రి ఏపీ ప్ర‌జ‌లు ఏం చేశార‌ని ఇలా వారి ప్రాణాల‌తో చెలగాట‌మాడుతున్నారు?

స‌రిహ‌ద్దుల్లో రోగుల‌ను ఆపే హ‌క్కు ఎవ‌రిచ్చార‌ని తెలంగాణ హైకోర్టే నిల‌దీసింది. ఇది కేసీఆర్ ప్ర‌భుత్వానికి విన‌బ‌డ‌లేదా?  ఆస్ప‌త్రిలో బెడ్ దొరికింద‌నే స‌మాచారం స‌మ‌ర్పిస్తే అడ్డ‌గించ‌వ‌ద్ద‌ని మీరే పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశారు క‌దా? మ‌రి ఇప్పుడు అలాంటి ర‌సీదులు చూపిస్తున్నా మీరు రోగులను అనుమ‌తించ‌డం  వారివి ప్రాణాలు కాద‌నే లెక్క‌లేని త‌న‌మా? స‌రిహ‌ద్దుల్లో రోగులను అడ్డుకుని వారి మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న మీపై హ‌త్య‌కేసులు ఎందుకు న‌మోదు చేయ‌కూడ‌దో చెప్పండి!

2024 వ‌ర‌కు హైద‌రాబాద్ అంద‌రిదీ. కేసీఆర్ జాగీరు కాదు. కేటీఆర్ అడ్డా అంత‌క‌న్నా కాదు.అడ్డుకోవ‌డానికి తెలంగాణ పోలీసుల‌కు ఏ చ‌ట్టం హ‌క్కు క‌ల్పించింది? ఏ అధికారం నెత్తికెక్కింది? జ‌వాబు చెప్పాలి. ఏపీలో బెడ్లు దొర‌క్క కొంద‌రు, ప‌రిస్థితి విషమించి ఇంకొంద‌రు వారి వారి ప్రాణ‌స‌మానులైన వ్య‌క్తుల‌ను బ‌తికించుకుందామ‌ని కోటి ఆశ‌ల‌తో హైద‌రాబాద్ వ‌స్తుంటే, వారిని అక్కున చేర్చుకుని, అవ‌స‌ర‌మైతే అలాంటి వారికోసం కొన్ని బెడ్లు రిజ‌ర్వు చేసి మాన‌వ‌త్వాన్ని చాటుకోవాల్సిన సంద‌ర్భంలో…య‌మ‌భ‌టుల్లా స‌రిహ‌ద్దుల వ‌ద్ద అడ్డుకుంటున్నారే… మీర‌స‌లు మ‌నుషులేనా?  మీక‌స‌లు మాన‌వ‌త్వం ఉందా? అక్క‌డ ఒక్కొక్క త‌ల్లి, ఒక్కొక్క చెల్లి క‌న్నీటితో …కాళ్లుమొక్కుతాం అనుమ‌తించండి అంటూ వేడుకుంటున్నా మీ చెవుల‌కు ఎక్క‌డం లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి?

ఇక ఏపీ ప్ర‌భుత్వం ఏం చేస్తోంది?  తెలంగాణ ప్ర‌భుత్వం చూపిస్తున్న అమాన‌వీయ‌త‌ను ఎందుకు భ‌రిస్తోంది? ఏ కార‌ణం చేత నోరు పెగ‌ల‌డం లేదు? ఎందుకు హ‌క్కును చాటుకోవ‌డం లేదు? ఎందుకు బ‌తిమాలుతున్నారు? ఏం.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడిక‌త్తి దాడి జ‌రిగితే హుటాహుటీన హైద‌రాబాద్ వ‌చ్చి వైద్యం చేయించుకోలేదా?  విజ‌య‌సాయిరెడ్డికి క‌రోనా పాజిటివ్ అన‌గానే హైద‌రాబాద్ వ‌చ్చి చేరిపోలేదా? ఏపీ డిప్యూటి సీఎంతో స‌హా, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు, సీఎంవోలోని ప‌లువురు అధికారుల‌కు ఏ రోగం వ‌చ్చినా హైద‌రాబాదులో వ‌చ్చి వైద్యం చేయించుకుంటున్నారు క‌దా?  మీకంద‌రికీ లేని అడ్డంకులు సామాన్యుల‌కే ఎందుకు వ‌స్తున్నాయి? ఎందుకీ వివ‌క్ష‌? ఏం మీవి మాత్ర‌మే ప్రాణాలా?  మీకొక చ‌ట్టం…సామాన్య ప్ర‌జ‌ల‌కు ఒక చ‌ట్ట‌మా?

ఇంత జ‌రుగుతున్న రెండు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు ఎందుకు జోక్యం చేసుకోవ‌డం లేదు? ఆర్టిక‌ల్ 8 అనే అస్త్రాన్ని ఎందుకు ప్ర‌యోగించ‌రు? ఇంకెన్ని గుండెలు స‌రిహ‌ద్దుల్లో ఆగిపోవాలి? ఇంకెన్ని ఆక్రంద‌న‌లు మిన్నంటాలి? ఈ అమాన‌వీయ‌త‌ను అడ్డుకోవ‌డానికి అంద‌రం ఒక్క‌ట‌వుదాం… మ‌నుషుల‌మ‌ని చాటుదాం.

– రొద్దం శ్రీ‌నివాస్‌, జ‌ర్న‌లిస్ట్‌