కరోనా నుంచి ప్రజలను కాపాడలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్

159

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావ్

ప్రజారోగ్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు ప్రభుత్వ చేతకానితనాన్ని కళ్లకు కడుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ , వెంటిలేటర్లు, కొరతతో కరోనా రోగులు ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదని  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావ్  విమర్శించారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే.. సకాలంలో ఆక్సిజన్ అందక ఇప్పటికి 100మందికి పైగా చనిపోయారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి తన బాధ్యత మరిచి ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు దిగడం దారుణమైన చర్య. ఆస్పత్రుల్లో హృదయ విదారక దృశ్యాలు కలిచివేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఒకే బెడ్ పై ముగ్గురు, నలుగురు చికిత్స తీసుకుంటున్న పరిస్థితి. పక్కనే మృతదేహాన్ని పెట్టుకుని ఆక్సిజన్ పెట్టుంచుకుంటున్న దుస్థుతి. ఏపీ కేబినెట్ అజెండాలో కరోనాను చిట్టచివరి అంశంగా పెట్టారంటేనే జగన్మోహన్ రెడ్డికి ప్రజల ప్రాణాలపై ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతుంది.

వ్యాక్సిన్ పంపిణీలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు అందుతుందా అంటే అనుమానమే. కేంద్రానికి వ్యాక్సిన్ కోసం లేఖలు రాశామంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. పొరుగు రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనుగోలుకు పోటీ పడుతుంటే ఏపీ ప్రభుత్వం ఇంతవరకూ ఆర్డర్లు కూడా పెట్టలేదు.  వ్యాక్సిన్ పంపిణీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుట్ర పూరితంగా చంద్రబాబుపై కేసు పెట్టారు.  ఇప్పటికైనా ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలను మానుకుని వైరస్ నివారణ, వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. 18-45 సంవత్సరాల యువతకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి.