ఖర్చు,ఆదాయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

331

తొలిదశలో ఏపి ఆర్ధిక వృద్దిరేటు 4.3%కు పడిపోయింది.
కరోనా రెండో దశలో ఏపిలో నెగటివ్ గ్రోత్ ఖాయం.
2021-22 వృద్దిరేటు ఇప్పటికే 0.3%కు పతనమైంది.
రెండేళ్ల జగన్ పాలన రాష్ట్రంపై కనీవినీ ఎరుగని దుష్ప్రభావం
కరోనా కన్నా జగన్ బాధ్యతారాహిత్యమే ఏపికి చేటు చేసింది,కీడు వాటిల్లింది
తయారీ రంగంపై పూర్తి నిర్లక్ష్యం, పారిశ్రామిక పెట్టుబడులు రాబట్టడంపై అశ్రద్ద
నిరుద్యోగ రేటు ఇప్పటికే 10%కు చేరింది, భవిష్యత్ లో 20%కు దిగజారడం తథ్యం
అభివృద్దికి గండికొట్టారు, పేదల ఉపాధిని, రాబడులను చావు దెబ్బతీశారు
అనేకమంది ఉద్యోగాలు ఊడగొట్టారు, వలస కార్మికుల పొట్టకొట్టారు
కరోనా రెండోదశతో ఏపిలో తిరోగమన వృద్ది ఖాయం
ద్రవ్యలోటు, ఆదాయలోటు, అధిక అప్పులే జగన్ ఘనత
2021-22 ప్రతిపాదిత బడ్జెట్ తప్పుడు లెక్కలే తప్ప రాష్ట్రాన్ని ఆర్ధికంగా నిలబెట్టేది కాదు
ఈ ఆర్ధిక సంక్షోభం దుష్ఫలితాలతో మరో 3ఏళ్లు రాష్ట్రం అతలాకుతలం
కోలుకోలేని దుస్థితికి ఏపిని దిగజార్చిన ఘనత జగన్ దే..
5ఏళ్ల జగన్ పాలనలో ఏపి అభివృద్ది పూర్తిగా రివర్స్, అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్ అధోగతే. అటు అభివృద్దిలో, ఇటు పేదల సంక్షేమంలో, ఉపాధిలో అంతా రివర్స్ చేశారు.
ప్రజల నిజ ఆదాయాల్లో, విద్యా వైద్యంలో, ప్రజల జీవన ప్రమాణాల్లో అంతా తిరోగమనమే.
రివర్స్ రూలర్ గా(తిరోగమన పాలకుడిగా) రికార్డులలో జగన్ రెడ్డి పేరు నిలిచిపోతుంది
ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు

ప్రజలను కష్టాల్లో ముంచేవాడు పాలకుడిగా తగడు. కష్టాల్లోకి ప్రజలను నెట్టడమే జగన్ నైజం. ప్రజాస్వామ్యంలో పాలకుడే ప్రధాన పాత్ర. ఫాసిస్ట్ పాలనలో ప్రజాస్వామ్యం మనుగడ అసాధ్యం, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ పూర్తిగా పతనావస్థకు చేరాయి.

కోవిడ్ రెండుదశల్లో ఖర్చుచేసిన మొత్తం, వచ్చిన ఆదాయంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. కరోనా ను అదుపు చేయడంలో ఏపి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది, ఇతర రాష్ట్రాలే శక్తివంచన లేకుండా ప్రయత్నించి ఏపికన్నా మెరుగ్గా అదుపు చేయగలిగాయి. రాబడులు తగ్గాయని ప్రభుత్వం గత బడ్జెట్ లతో పోల్చిచెప్పడం ఎప్పుడూ జరిగేదే. ఇతర వనరుల నుంచి అదనపు రుణ సమీకరణ ద్వారా తగ్గిన రాబడిని పూడ్చుకోవడం కద్దు. కొవిడ్ కోసం ప్రత్యేకంగా కేంద్రం నిధులు విడుదల చేయడం, ఎఫ్ ఆర్ బిఎం కింద మరో 2% అదనపు పరిమితి ఇవ్వడం, అదనపు అప్పులకు కూడా ప్రత్యేక అనుమతులు కూడా ఇచ్చింది. జిఎస్ టి ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా బాగానే వుంది ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరియు పెట్రోలియం ఉత్పత్తులపై, ఇతర సేవలపై పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపారు కూడా.

కరోనా తొలిదశలో రాష్ట్ర ఆర్ధిక వృద్దిరేటు రెండంకెల నుంచి 4.3%కు పడిపోయిందని ప్రభుత్వమే పేర్కొంది.ఇప్పుడీ రెండవ వేవ్ కారణంగా ఏపి ఆర్ధికాభివృద్ది రేటు 4%కన్నా మరింత దిగువకు పడిపోనుంది. అంటే 2021-22 సంవత్సరానికి ఆర్ధిక వృద్ది 0.3%మాత్రమే. జగన్ రెండేళ్ల పాలన ఏపి ఆర్ధిక పరిస్థితిపై మున్నెన్నడూ కనీవినీ ఎరుగని దుష్ప్రభావాన్ని చూపిందనేది కఠోర సత్యం. ఏపి ఆర్ధికరంగం కుదేలవ్వడానికి కేవలం కరోనానే కారణం కాదు, రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ రెడ్డి బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యమే ఏపిని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టాయి. ఉద్యోగాలు కల్పించే తయారీ రంగంపై కనీస నిధులు వ్యయం చేయకుండా నిర్లక్ష్యం చేయడం, పారిశ్రామిక పెట్టుబడులు రాబట్టడంపై అశ్రద్ద కారణంగా నిరుద్యోగ రేటు ప్రస్తుతం 10%ఉండటమే కాకుండా అది 20%కు చేరే ప్రమాదాన్ని కొని తెచ్చారు. అభివృద్ది పనులకు నిధులు వెచ్చించక పోవడం అటు పేదల ఉపాధికి, రాబడులకు గండికొట్టడమే కాకుండా అనేకమంది ఉద్యోగాలు ఊడిపోవడానికి దారితీసింది, వలస కార్మికుల పొట్టకొట్టింది. తత్ఫలితంగానే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అందువల్లే కరోనా తొలిదశలో ఏపి ఎకానమీ 4.3%కు పడిపోయింది. కరోనా రెండో దశ కారణంగా రాష్ట్ర ఆర్ధికరంగం మరింత అధోగతిపాలై తిరోగమన వృద్ది(నెగటివ్ గ్రోత్)కి చేరే ప్రమాదం ముంచుకొస్తోంది, ప్రస్తుత ఏడాది వృద్ది రేటు 0.3%మాత్రమే కాబట్టి.

ఆర్ధిక వ్యవస్థ పతనంతో ఆదాయలోటు, ద్రవ్యలోటు, అధిక అప్పులు వెరసి ఏపిని భవిష్యత్తులో కోలుకోలేని ఆర్ధికసంక్షోభంలోకి నెట్టడం ఖాయం.
రాష్ట్రంలో ద్రవ్య సమర్ధ నిర్వహణకు తగిన భవిష్యత్ ప్రణాళికలు రాష్ట్రప్రభుత్వం వద్ద ఏమాత్రం లేక పోవడం శోచనీయం. ఈ నేపథ్యంలో 2021-22 ప్రతిపాదిత బడ్జెట్ తప్పుడులెక్కలే తప్ప రాష్ట్రాన్ని ఆర్ధికంగా నిలబెట్టే దిశగా ఉండేదికాదని భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ ఆర్ధిక పెను సంక్షోభం దుష్ఫలితాలు రాబోయే మరో 3ఏళ్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడమే కాకుండా కోలుకోలేని స్థితికి దిగజార్చడం ఖాయం.