ఆక్సిజన్ సేకరణ,పంపిణీలో గణనీయ పురోగతి సాధించిన ఏపీ

197

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
– ఆక్సిజన్ వార్ రూమ్ ను పరిశీలించిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని

విజయవాడ, మే 15: ఆక్సిజన్‌ సేకరణ, పంపిణీలో ఏపీ గణనీయ పురోగతి సాధించినట్టు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం జాయింట్ కలెక్టర్ కార్యాలయం లోని ఆక్సిజన్ వార్ రూమ్ ను కలెక్టర్, జేసిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ లేఖ రాయడంతో సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట్రానికి కొత్తగా మరో మూడు ఐఎస్‌ఓ ట్యాంకులను కేంద్రం ఇస్తోందని చెప్పారు. కృష్ణా జిల్లాలో ఆక్సిజన్ వినియోగంపై నిశితంగా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత లేకుండా జిల్లా కలెక్టర్ లు పోటీ తత్వంతో పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మిగిలిన జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ కార్యచరణ ప్రణాళికలను తమ జిల్లాలో అమలు చేస్తూ, కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు. కోవిడ్ స్ట్రెయిన్ వల్ల ఎక్కువ మంది ఆక్సిజన్ కోసం ఆందోళన పడుతుంటే, వాటిని తొలగించే దిశలో ఆక్సిజన్ బెడ్స్ పెద్దఎత్తున అందుబాటులోకి తీసుకురాగలిగామన్నారు. ఆక్సిజన్ కొరత, వృధా కాకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తు, రోగులకు అవగాహనా కల్పించడం చేస్తున్నామని తెలిపారు. సగటున రోజుకు ఎంత ఆక్సిజన్ అవసరం ఉంటుంతుందనే దానిపై అంచనాలు వేసుకుని, సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు, వారిలో ఆక్సిజన్ అందిస్తున్న వివరాలు ఆధారంగా ఆక్సిజన్ వాడకంపై ఆడిట్ చేస్తున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు.
ఎక్కడ స్థాయికి మించి ఎక్కువ వినియోగించారో తెలుసుకుని, అక్కడ సిబ్బందితో పాటు చికిత్స పొందుతున్న వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆక్సిజన్ వినియోగంలో లీకులు, వృధా కాకుండా చెయ్యడం జరిగిందని, ఇంకా ఎక్కడైనా లోపాలు ఉంటే ఆయా ఆసుపత్రులకు హెచ్చరికలు చేసేందుకు ఒక టీం నియంత్రణ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. అనంతరం రవాణా, రూట్ ట్రాకింగ్, ఆసుపత్రిలో ఆక్సీజన్ నిల్వలు, లిక్విడ్ ఆక్సిజన్, ఫిల్లింగ్ పాయింట్స్, ఆసుపత్రులకు అవసరం అయ్యే ఆక్సిజన్ వివరాలు, వంటి ప్రతి ఒక్క అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.