ఏమిటీ వేరియంట్?

247

ఆంధ్రప్రదేశ్ వేరియంట్… ఇప్పుడీ మాట అందర్నీ భయపెడుతోంది. ఏపీలోని కర్నూలులో పుట్టి, విశాఖలో పెరుగుతోన్న ఒక రకమైన కరోనా వైరస్ (వేరియంట్) అత్యంత వేగంగా, ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే వెయ్యి రెట్లు వేగంగా పాకిపోతోందని వచ్చిన వార్తలు కలకలం రేపాయి.  దీనిపై జాతీయ స్థాయి మీడియాలో చర్చ జరగగా..  స్పందించిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు, దాని గురించి ప్రస్తావించిన మంత్రి అప్పలరాజుపై కేసులు కూడా నమోదయ్యాయి.
దీనిపై రాజకీయ కలకలం కూడా చెలరేగింది. ఆఖరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వచ్చే వారిపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు కూడా పెట్టింది. ఆ వైరస్ అంత పవర్‌ఫుల్లా? నిపుణులు ఏమంటున్నారు?

వేరియంట్ అంటే ఏంటి?
వైరస్ అనేది ఏదైనా జీవిలో ఉన్నప్పుడు పెరుగుతూ వెళ్తుంది. అది మనిషిలో అనుకుంటే శరీరంలో ఉన్నప్పుడు వైరస్ తన కణాల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. దీన్నే రెప్లికేట్ అంటారు.అలా పెరుగుతూ ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో అది తనలో తాను కొన్ని మార్పులు చెందుతుంది. దాన్నే మ్యుటేషన్ అంటున్నాం.
ఇలా కొన్ని రకాల మ్యుటేషన్‌లు కలిసి 2-3 నెలల వ్యవధిలో ఒక వేరియంట్‌గా ఉద్భవిస్తాయి. వైరస్ మ్యుటేషన్ జరిగినప్పుడు దాని వల్ల వచ్చే రోగ లక్షణాలు, వ్యాపించే వేగం, అది శరీరంపై చూపే ప్రభావం వంటివి మారతాయి.

ఇలా కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కొన్ని వందల, వేల మ్యుటేషన్లు జరిగి కొన్ని వేరియంట్లుగా మారాయి. కానీ, అన్నింటి గురించీ చర్చ జరగదు. వాటిలో కొన్నే బాగా వ్యాపిస్తాయి.
”ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న వందల వేరియంట్లలో కేవలం మూడు వేరియంట్లను మాత్రమే మనం తీవ్రంగా పరిగణించాలి. సౌతాఫ్రికా, బ్రెజిల్, యూకే… ఇవే ఆ మూడు వేరియంట్లు. మరో 7 వేరియంట్లను పరిశీలించాలి. ఆ ఏడింటిలో మహారాష్ట్ర వేరియంట్ ఉంది” అని వివరించారు నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్యులు డా. మాదాల కిరణ్
మనం ప్రస్తుతం యూకే వేరియెంట్‌గా పిలుస్తున్న దానిలో 23 మ్యుటేషన్లు, మహారాష్ట్ర వేరియంట్లో 15 మ్యుటేషన్లూ ఉన్నాయి.

ప్రస్తుతం భారత్‌లో ఉన్న వేరియంట్లు ఏవి?
భారత్‌లో ఎన్నో రకాలు వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిలో కొన్ని అధిక కేసులకు కారణం అవుతున్నాయి. కొన్ని తక్కువ కేసుల్లో ఉన్నాయి.
”డబుల్ మ్యూటెంట్‌గా పిలిచే ఈ వేరియంట్ మహారాష్ట్రలో 50-60 శాతం కేసులకు కారణమైంది. ఈ డబుల్ మ్యూటెంట్‌లో కాస్త తీవ్ర లక్షణాలున్నాయి. పంజాబ్‌లో యూకే వేరియంట్ ఉంది. మహారాష్ట్ర వేరియంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కూడా పెరుగుతోంది. ఏపీ, తెలంగాణల్లో 20 శాతం కేసులు అవే వస్తున్నాయి. బహుశా మిగతా వేరియంట్లు క్రమంగా పోయి అందరికీ ఇదే వస్తుందని అనుకుంటున్నాను” అని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా బీబీసీతో అన్నారు.
”వేల మ్యుటేషన్లు, వేరియంట్లు వస్తాయి, పోతాయి. అవేవీ అంతగా వ్యాపించవు. కానీ, మనం వాటిని జాగ్రత్తగా గమనించక పోతే, ఏ వేరియంట్ అయినా కేసుల పెరుగుదలకు కారణం కావచ్చు” అన్నారు రాకేశ్ మిశ్రా.

                                                                                           – బెల్లంకొండ సాంబశివరావు