సర్కారులో ‘కడప ముగ్గురాయి’ పేలుళ్లు!

525

చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య
విపక్షాల విమర్శలకు చిక్కిన జగన్ సర్కార్
( మార్తి సుబ్రహ్మణ్యం)

కడప జిల్లా  ముగ్గురాయి గనుల్లో జరిగిన పేలుళ్ల ఘటనకు వైసీపీ నేతలే కారణమన్న ఆరోపణలతో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం జగన్మోహన్‌రెడ్డి సొంత కడప జిల్లా పరిథిలోని, మామిళ్లపల్లి గ్రామంలో జరిగిన మైనింగ్ పేలుళ్లకు పదిమంది బలయిన ఘటనపై.. పెరుగుతున్న అనేక అనుమానాలు, ఆరోపణలు వైసీపీ సర్కారుకు అప్రతిష్ఠగా మారాయి. ఈ్యవహారంలో అసలు లీజుదారులయిన వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుటుంబాన్ని అరెస్టు చేయలేదు. పైగా ఈ వ్యవహారంలో సీఎం సతీమణి భారతి మేనమామ అయిన వైఎస్ ప్రతాపరెడ్డి అరెస్టు కావడం, అనుమతులు రద్దు చేసిన తరావ్త కూడా కోట్ల రూపాయల్లో  ముగ్గురాయి తరలిపోయిందన్న ఆరోపణలతో.. వైసీపీ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. దీనిపై కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్స బిటెక్ రవి, వరసగా చేస్తున్న ఆరోపణలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.

మైనింగ్ పేలుళ్లలో మృతి చెందిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చిన సీఎం జగన్, క్వారీ లీజుదారుడయిన తన పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుటుంబాన్ని మాత్రం అరెస్టు చేయకుండా, కాపాడుతున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నిజానికి మామిళ్లపల్లి మైనింగ్ లీజు వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య భార్య కస్తూరిబాయి పేరుమీద 2001 నుంచి 2022 వరకూ ఉంది. అంటే అసలు లీజుదారు సీఆర్ కుటుంబమేనన్నది స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు అది నాగేశ్వర్‌రెడ్డికి  సబ్‌లీజుకు ఇచ్చినట్లు చెబుతున్న వైనం వివాదాస్పదంగా మారింది. సబ్ లీజు గతంలోనే ఇచ్చారా? లేక ఘటన జరిగిన తర్వాత ఇచ్చారా? అన్న దానిపై అనుమానాలు కొనసాగుతున్నాయి. 2016 ఏప్రిల్ నుంచి 2020 ఆగస్టు వరకూ క్వారీ లీజుదారులు, 46 లక్షల రూపాయల రాయల్టీ ఫీజు చెల్లించాలని నోటీసులు కూడా వచ్చినప్పటికీ, ఎలాంటి ఫీజు చెల్లించలేదన్నది మరో ఆరోపణ.

ఇదిలా ఉండగా.. ప్రభుత్వం కూడా క్వారీ లీజుదారుల నుంచి, బకాయిలు రావలసి ఉందన్న విషయం గతంలో ప్రకటించింది. 2019 జనవరి 16,  2019 అక్టోబర్ 18, 2020 ఆగస్టు 25న మైనింగ్ అధికారులు క్వారీపై దాడులు చేశారు. అయినప్పటికీ నిబంధనలకు అనుగుణంగా నడచుకోనందున.. 2020 సెప్టెంబర్ 26న మైనింగ్ లీజు రద్దు చేస్తున్నట్లు నోటీ సులు జారీ చేశారు. అందులోనే 46 లక్షల పాతబకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. మరి ఆ 46 లక్షల బకాయి ప్రభుత్వానికి ఎవరు చెల్లిస్తారన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు.

కాగా సబ్‌లీజు తీసుకున్న నాగేశ్వర్‌రెడ్డి గతంలో ఎర్రచందనం స్మగ్లింగు కేసులతో పాటు.. పిడి యాక్టు కింద జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తి కావడం గమనార్హం. తాను సబ్ లీజుకు తీసుకోబోయే కంపెనీ.. ప్రభుత్వానికి 46 లక్షల బకాయి ఉందని, దానికితోడు మూడుసార్లు నోటీసులు కూడా అందుకున్న విషయం తెలిసి కూడా,  నాగేశ్వర్‌రెడ్డి ఎలా సబ్ లీజుకు తీసుకున్నారన్న అంశంపైనే అనుమానం, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఇక జిలిటిన్‌స్టిక్ సరఫరా చేసిన వైఎస్ ప్రతాపరెడ్డి వ్యవహారంపై కూడా అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా ప్రమాదకరమైన జిలిటిన్‌స్టిక్‌ను క్వారీకి దూరంగా ఉంచుతారు. వాటిని అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలి. ఒక్కోసారి సెల్‌ఫోన్ రేడియేషన్‌కు సైతం అవి పేలే ప్రమాదం ఉంది. కానీ అలాంటి రక్షణసూత్రాలేమీ పాటించలేదని, కూలీల మృతదేహాలు చూస్తే స్పష్టమవుతోంది. జిలిటిన్‌స్టిక్‌తోపాటు మరికొన్ని పేలుడు పదార్ధాలేమైనా వాహనంలో ఉంచారా? అన్న మరో సందేహం తెరపైకి వస్తోంది. గనుల్లో వినియోగించే వీటిని పులివెందుల నుంచి కలసపాడుకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. వైఎస్ ప్రతాపరెడ్డికి చెందిన మ్యాగజైన్ లైసెన్స్ నుంచి, ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోకుండా తరలించారని స్వయంగా కడప జిల్లా ఎస్పీనే ప్రకటించడాన్ని విస్మరించకూడదు.ఈ మొత్తం వ్యవహారంలో కడప జిల్లా మైనింగ్ ఉన్నతాధికారుల పాత్రపైనే అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు ఘటన జరిగిన తర్వాత, వివరాల కోసం మీడియా ప్రయత్నించినప్పటికీ ఒక్క మైనింగ్ అధికారి కూడా ఫోన్లకు స్పందించలేదు. పైగా కరోనా కారణంగా ఎవరూ విధులకు రావడం లేదన్న జవాబు వచ్చింది. ఘటన జరిగి ఇన్నిరోజులవుతున్నా, లీజుకు సంబంధించి ఇప్పటివరకూ మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి వివరణ కూడా వెలువడకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. లీజుదారురాలైన సి.కస్తూరిబాయికి నోటీసులు ఇచ్చారా? ఒకవేళ ఇస్తే ఆమె వివరణ ఏమిటన్న అంశం కూడా ఇంకా గోప్యంగానే ఉంచడం బట్టి, మైనింగ్ అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయన్న విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుతోంది.

కాగా అసలు లీజుదారురాలైన వైసీపీ ఎమ్మెల్యే సి.రామచంద్రయ్య భార్య కస్తూరిబాయిని అరెస్టు చేయకుండా, వారి నుంచి లీజు తీసుకున్న ఇద్దరిపై కేసులు పెట్టడం బట్టి, ఈ కేసును జగన్ ప్రభుత్వం నీరుగార్చే కుట్ర చేస్తున్నట్లు స్పష్టమవుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బీకెక్ రవి ఆరోపించారు.  ‘‘ఆ మేరకు సీఎంఓ నుంచి అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ కుటుంబం ప్రమేయం ఉందన్నదానికి,  కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పెద్దనాన్న వైఎస్ ప్రతాప్‌రెడ్డి అరెస్టే  ఉదాహరణ. మైన్ అధికార లీజుదారులయిన వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయలేదు? అందుకు అధికారుల చేతులు ఎవరు కట్టేస్తున్నారు’ అని ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రశ్నించారు.

అన్నీ అనుమానాలే!
– జీపీఏలో వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య భార్య కస్తూరిబాయి పేరు ఉండగా, నాగేశ్వర్‌రెడ్డి పేరున్నట్లు చెప్పి, ఆయనను ఎందుకు అరెస్టు చేశారు?
– జిలిటిన్‌స్టిక్ సరఫరా చేసిన వైఎస్ ప్రతారెడ్డి సరఫరా చేసే జిలిటిన్‌స్టిక్స్ వివరాలు మైనింగ్ శాఖ వద్ద ఉన్నాయా?
– క్వారీ నుంచి ఎన్ని కోట్ల మెటీరియల్ తరలివెళ్లింది? దానికి అనుమతులున్నాయా?
– అసలు   2020 సెప్టెంబర్ 26న మైనింగ్ లీజు రద్దు చేస్తున్నట్లు నోటీ సులు జారీ చేస్తే, పేలుడు ఘటన జరిగిన రోజు వరకూ ఎందుకు తవ్వుతున్నట్లు?
– లీజు రద్దు చేసిన తర్వాత కూడా మెటీరియల్ తరలిపోతుంటే, జిల్లా మైనింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు?
– ప్రభుత్వానికి రాయల్టీఫీజు చెల్లించకుండానే క్వారీలో తవ్వకాలు చేస్తుంటే మైనింగ్ అధికారులు ఎందుకు అడ్డుకోలేదు?
– ఘటన జరిగిన తర్వాత ఇప్పటివరకూ జిల్లా మైనింగ్ శాఖ అధికారులు, మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు ఎందుకు ప్రకటించలేదు?
– తర లిపోయిన మైనింగ్ విలువ వందకోట్లకు పైమాటే ఉంటుందన్న ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపణలను ఎందుకు ఖండించలేదు?

మైన్స్ అండ్ జియాలజీ, డి డి ఎం ఎస్ అధికారుల పర్యవేక్షణ ఉందా?
40 మంది కార్మికులు పని చేస్తూ ఉంటే కనీసం లేబర్ అధికారుల పర్యవేక్షణ ఉందా?అసలు లేబర్ డిపార్టుమెంటు క్వారీలో ఎన్నిసార్లు తనిఖీ నిర్వహించింది? ఎన్ని కేసులు నమోదు చేసింది? ఆ మేరకు నోటీసులేమైనా ఇచ్చిందా?

ప్రైవేటు కేసు వేయనున్న టీడీపీ?
ఈ ఘటనపై టీడీపీ ప్రైవేటు కేసు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. లీజు వ్యవహారంతోపాటు, తరలివెళ్లిన మైనింగ్ విలువను కూడా అసలు లీజుదారుల నుంచే వసూలుచేయాలని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.మైనింగ్, పోలీసు అధికారులపై ప్రభుత్వ ఒత్తిళ్లు ఉన్నందున, వారితో న్యాయం జరగదని భావిస్తున్నారు.  పైగా హత్యనేరం కేసు నమోదుచేయాలన్న  వాదనతో టీడీపీ కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ‘మాకు సరైన సమాధానం, మా అనుమానాలకు సంతృప్తికరమైన వివరణ రాకపోతే ప్రైవేటు కేసు వేయాలన్న ఆలోచనలో ఉన్నమాట నిజమే’నని ఎమ్మెల్సీ బీటెక్ రవి వెల్లడించారు.