‘సరిహద్దు’ సమస్యలతో ఊపిరాడని జగన్ సర్కార్

451

తెలంగాణ ఆదేశాలపై కదలని వైనంపై విమర్శలు
అంబులెన్స్‌లోనే మరణిస్తున్న రోగులు
కేటీఆర్‌కె ట్వీట్ చేసినా నో యూజ్
( మార్తి సుబ్రహ్మణ్యం- అమరావతి)

తెలంగాణలో ఆసుపత్రుల నుంచి బెడ్లు ఉన్న ధృవీకరణపత్రం  ఉంటేనే ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను అనుమతించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు,  ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి, రోగుల ప్రాణాలు కాపాడటంలో విఫలమవుతోందన్న విమర్శలు ఏపీ సర్కారుకు ఊపిరాడనీయడం లేదు. ఇప్పటికే సత్వర వైద్యం అందక సరిహద్దుల్లో నిలిచిపోయిన అంబులెన్సులలోనే ప్రాణాలు విడుస్తున్న రోగులు, తమ ప్రాణాలు కాపాడమంటూ రోగుల బంధువులు చేస్తున్న ఆర్తనాదాలు సొషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కడప, నంద్యాలకు చెందిన ఇద్దరు రోగులు ఈపాటికే అంబులెన్సులోనే మృతి చెందారు. గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద వైద్యం అందక  ఒక రోగి అంబులెన్సులోనే మృతి చెందారు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద గురువారం అర్థరాత్రి నుంచీ దాదాపు 100 వాహనాలు నిలిచిపోగా, 70 వాహనాలు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నానికి దాదాపు 30 అంబులెన్సులు నిలిచిపోయాయి.  అటు కర్నూలు జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్ద కూడా వందల సంఖ్యలో అంబులెన్సులు, వాహనాలు గురువారం అర్థరాత్రి నుంచే నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌కాన్ అక్కడికి చేరుకుని, తెలంగాణ అధికారులతో మాట్లాడినా ఫలితం లేకపోయింది.

హైదరాబాద్‌లో కరోనా, ఇతర చికిత్సల కోసం ఇతర ప్రాంతాల నుంచి రోగులు.. ముందుగా ఆయా ఆసుపత్రుల్లో బెడ్లు రిజర్వు చేసుకుంటేనే  అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులిచ్చింది.  కోవిడ్ కంట్రోల్‌రూమ్ పాసులు ఉంటేనే అనుమతిస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో అటు ముందుకు వెళ్లడానికి వీల్లేక, అటు వెనక్కి వెళ్లే సమయం లేక రోగులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి సరిహద్దుల వద్ద కనిపిస్తోంది. దానితో కృష్ణా, గుంటూరు జిల్లా సరిహద్దులయిన గరిపాడు, వాడపల్లి చెక్‌పోస్టుల వద్ద వందలాది అంబులెన్సులు తెలంగాణ సర్కారు క్లియరెన్స్ కోసం నిలిచిపోయాయి.

వినోద అనే విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన  మహిళ పక్షవాతంతో బాధపడుతూ, హైదరాబాద్‌లో చికిత్సకు వెళుతుండగా, ఆమెను తీసుకువెళుతున్న అంబులెన్సును రామాపురం వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతిపత్రం చూపించినా అనుమతించకపోవడంతో, రోగి బంధువులు తెలంగాణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతపురంలో పనిచేసే జియాలజిస్టు ఈశ్వర్‌రెడ్డిని తీసుకువెళుతున్న అంబులెన్సును తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంపై ఆయన భార్య ఉమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తన తండ్రిని తీసుకువెళుతున్నా పోలీసులు అడ్డుకుంటున్నారని వీరారెడ్డి అనే వ్యక్తి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఆసుపత్రి పర్మిషన్ ఉన్నా పంపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఆమె వ్యాఖ్యలు కలచివేస్తున్నాయి. ‘ఇదేంది జగనన్నా. విజయవాడకు అంతదూరం నుంచీ రాలేము. మా అనంతపురం హాస్పిటల్‌లో ఆక్సిజన్లు లేవు. మీకు ఓటేస్తే మాకు ఇదా? కేసీఆర్‌తో ఎందుకు మాట్లాడటం లేదు జగనన్నా? అన్నీ ఉచితం అంటావు. ఏం ఉచితం? డబ్బులిచ్చినా వైద్యం దొరకడం లేదు. మా అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్. అక్కడయికయినా తీసుకువెళ్లాలి కదా? విభజన ముందు మనమంతా ఒకటే అన్నారు కదా కేసీఆర్ అన్నా. ఇప్పుడు అడ్డుకోవడం ఏం న్యాయం కేటీఆర్ గారూ? మీరైనా చెప్పండి’ అని రోగి భార్య ఉమాదేవి సంధించిన ప్రశ్నలు, ఏపీ ప్రభుత్వ నిస్సహాయతను  స్పష్టం చేస్తున్నాయి.

ఇలాంటి కేసులతోపాటు, కరోనా చికిత్సకు రోగులను తీసుకువెళుతున్న అంబులెన్సులను కూడా తెలంగాణ పోలీసులు నిలిపివేయడంతో, సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌రోడ్స్‌లోని వాహనాలు నిలిచిపోయాయి. కాగా గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ… గరిపాడు, వాడపల్లి, రామాపురం క్రాస్‌రోడ్స్, పుల్లూరు చెక్‌పోస్టుల వద్ద దాదాపు 700 అంబులెన్సు, ఇతర వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం. అందులో ఉన్న రోగుల పరిస్థితిని చూసిన బంధువుల రోదనలతో సరిహద్దులు ప్రతిధ్వనించాయి. అంబులెన్సులను అడ్డుకోరాదని  తెలంగాణ హైకోర్టు ఆదేశించిన తర్వాత, గురువారం చాలా వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించగా, తిరిగి అదేరోజు రాత్రి ఇచ్చిన కొత్త ఆదేశాలతో సరిహద్దుల వద్ద తిరిగి ఆందోళకర పరిస్థితి మొదలయింది.
—————————–
కేసీఆర్‌తో మాట్లాడని జగన్‌పై విమర్శలు
కాగా ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల వద్ద వందలాది అంబులెన్సులు, రోగులను తీసుకువెళుతున్న వాహనాలను తెలంగాణ పోలీసులు అనుమతించని వైనం..  చానెభ్లు-సోషల్‌మీడియాలో ప్రముఖంగా  ప్రసారమవుతున్న వైనం ఏపీ సర్కారు ప్రతిష్ఠను మరింత దెబ్బతీసింది. సరిహద్దుల వద్ద ఇంత విషాదకర పరిస్థితి నెలకొన్నప్పటికీ.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ కనీసం ఈ విషయాన్ని ఏపీ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లపోవడంపై కూడా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళుతుంటే, సామాన్యులు హైదరాబాద్‌లో చికిత్సలు చేయించుకోకూడదా? హైదరాబాద్ ఇంకా మూడేళ్లు ఉమ్మడి రాజధాని ఉన్నప్పటికీ, అక్కడికి వెళుతున్న వారిని ఆపుతుంటే జగన్ తెలంగాణ సీఎంను ఎందుకు నిలదీయడం లేదన్న ప్రశ్నలు సోషల్‌మీడియా ద్వారా సంధిస్తున్నారు.

అటు విపక్షాలు కూడా జగన్ సర్కారు వైఫల్యంపై విరుచుకుపడుతున్నాయి. ‘తాడేపల్లిలో నిద్రపోవడం మానేసి, కేసీఆర్‌కు ఫోన్ చేసి అంబులెన్సులకు అనుమతి సాధించండి. మన రాష్ట్రంలో సరైన వైద్యచికిత్స అందితే పక్కరాష్ట్రానికి ఎందుకు వెళతారు? ఇంత చేతకాని దద్దమ్మ సీఎం ఏ రాష్ట్రానికీ ఉండకూడద’ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఆసక్తిరేపింది. ‘మీ ఇద్దరి మధ్య ఏ విషయంలో చెడిందో తెలియదు. కానీ జగన్ ఈ పరిస్థితిలో తెలంగాణ సీఎంతో మాట్లాడటం రాజధర్మం’ అని స్పష్టం చేశారు. ఏపీసీసీ అద్యక్షుడు శైలజానాద్ కూడా ఇది రెండు రాష్టాల సీఎంల వైఫల్యమేనని విమర్శించారు. జగన్-కేసీఆర్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.  ‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్ సర్కారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం. సరిహద్దుల వద్ద మృతిచెందిన ఘటనలకు కేసీఆరే బాధ్యత వహించాలని’ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు.‘ కేసీఆర్‌తో జగన్ ఏం ఆశించి మౌనంగా ఉన్నారో చెప్పాలి. రోగులను అడ్డుకున్న పోలీసులు, తెలంగాణ ప్రభుత్వంపై హత్యానేరం కేసులు నమోదుచేయాలి. ఇదంతా జగన్ వైఫల్యమే’నని టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మంచౌదరి స్పష్టం చేశారు.
—————————————
           తెరపైకి మరో పదేళ్లు ఉమ్మడి రాజధాని డిమాండ్
కాగా మరో మూడేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న అంశాన్ని ప్రభుత్వాలు మర్చిపోవడంపై చర్చకు తెరలేచింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 5 ప్రకారం, 2024 జూన్ 2 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్న విషయాన్ని.. ఇప్పటివరకూ ఏపీ సీఎం జగన్ నుంచి మంత్రులు, వైసీపీ అధికార ప్రతినిధులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఫలితంగా హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడిరాజధానిగా కొనసాగించాలన్న కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.

విపక్షాలు జగన్‌పై ఇదే అస్త్రాలు సంధిస్తుండటంతో, ఏపీ సర్కారు ఆత్మరక్షణలో పడింది.
‘ప్రస్తుత పరిస్థితి, పరిణామాలు హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న అభిప్రాయం అందరిలో పెరిగేందుకు కారణమవుతోంది. అయితే దీనిపై చట్టవసరణ అవసరం. హైదరాబాద్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని అనుమతించిన ఏపీ ప్రభుత్వం, ఏపీ నుంచి అక్కడికి వెళుతున్న అంబులెన్సును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేస్తున్నా జగన్ మౌనంగా ఉంటున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని కేసీఆర్‌కు ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని’ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ప్రశ్నించారు. హైదరాబాద్ మరో మూడేళ్లు ఉమ్మడి రాజధాని కొనసాగుతుందన్న విషయాన్ని సీఎం జగన్,  తెలంగాణ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఎందుకు భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. రోగులను అడ్డుకుంటున్న పోలీసులు, తెలంగాణ సీఎంపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు చికిత్సకు వస్తున్న వారిని అనుమతిస్తున్న పోలీసులు, ఏపీ నుంచి వెళ్లే వారిని అడ్డుకోవడం దారుణమన్నారు.