ఇదీ.. రెడ్ల కథ!

887

1989లో చెన్నా రెడ్డి మంత్రివర్గంలో సంగీత వెంకటరెడ్డి అనే మంత్రి ఉండేవాడు. ఆయన పేరు మాత్రం వెంకట్ రెడ్డి, కానీ ఆయన రెడ్డి కాదు, తూర్పు గోదావరి జిల్లా కాపు నాయకుడు.
నీకు సంగీతం రాదు… నువ్వు రెడ్డివి కాదు అని ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆయన మీద జోకులు వేసే వాడంట.

ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో చెప్పుకోవాల్సిన వ్యక్తి మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు శ్రీ నీలకంఠం రఘువీరా రెడ్డి.
ఈయన కూడా రెడ్డి కాదు, యాదవ్.

ఇలా ఎన్నో  ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
విషయం ఏంటంటే….. రెడ్డి అనేది కులం కాదు. ఆరేడు వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో  పరిపాలనా యంత్రాంగంలో, అదొక  ఉద్యోగం. అర్హతను బట్టి వివిధ కులాలకు చెందిన వ్యక్తులు ఆ ఉద్యోగంలో  నియమించబడ్డారు.
ఆ ఉద్యోగం పొందిన వాళ్లని లేదా ఆ ఉద్యోగం చేసిన వాళ్లని రెడ్డి  అని పిలవడం ప్రారంభమై, వంశపారంపర్యంగా అలా స్థిరపడింది.
పాలనా వ్యవహారాలలో రెడ్డి పాత్ర కీలకంగా మారిన తర్వాత, రెడ్డికి సమాజంలో గౌరవం, హోదా పెరిగి ఒక ప్రత్యేక సామాజిక వర్గంగా మారడం జరిగింది.
సామాజికంగా ఆ గౌరవం పొందటానికి ఇతరులు కూడా చాలామంది తమ పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఉదాహరణ తెలంగాణలో నిన్నటి వరకు మంత్రిగా పనిచేసిన బీసీ నాయకుడు గా చెప్పుకునే ఈటెల రాజేందర్ కొడుకు పేరు నితిన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత మంత్రి అయిన దళిత నాయకుడు పినిపే విశ్వరూప్ కొడుకు పేరు కృష్ణారెడ్డి.

దక్షిణ భారతదేశ పరిపాలనలో రెడ్డి అనే ఉద్యోగం ఉన్నట్టే, 1206 లో ఢిల్లీ సుల్తానుల పరిపాలన మొదలైన తరువాత ఉత్తర భారతదేశంలో గ్రామీణ పాలనా యంత్రాంగంలో ముగ్గురు ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఆ ఉద్యోగాల పేర్లు
1. కుత్
2. ముకద్దం
3. చౌదరి
ఆ విధంగా చౌదరి అనే పదం అన్ని కులాల వారు, హిందూ, ముస్లింలు కూడా తమ పేరు చివర పెట్టుకునేవారు.
ఉదాహరణ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కాలంలో ఘనీ ఖాన్ చౌదరి అనే బెంగాలీ ముస్లిం నాయకుడు రైల్వే మంత్రిగా పని చేశాడు.
కాబట్టి గానీ ఖాన్ చౌదరి, హీరోయిన్ మహిమ చౌదరి, మన రేణుకా చౌదరి ఒక కులం వాళ్లు కాదు.

వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో చాలామంది ఎర్రం  నాయుడు ని చంద్రబాబు నాయుడు తమ్ముడు అనుకునేవారు.
కానీ మనకు తెలుసు చంద్రబాబు నాయుడు, ఎర్రన్నాయుడు, ఆదికేశవులు నాయుడు వేరు వేరు కులాలకు చెందిన వారు.

ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారు రెడ్డి అనే అంశం మీద చర్చ చేస్తున్న సందర్భంగా వివరణ.

రెడ్డి కులం కాదు
చౌదరి కులం కాదు
కాపు మాత్రమే కులం

ఎలాంటి చేతి వృత్తి లేక, కుటుంబ పోషణకు, భూమిని దున్ని వ్యవసాయం చేసిన వాడే కాపు.

ఆ కాపులలో కొంతమంది  కమ్మల వారు…ఎలా అయ్యారో…
కమ్మల వారు… కమ్మవారు ఎలా అయ్యారో… మరోసారి చెబుతాను.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యవసాయ కులాలన్నిటికి మూలం కాపు కులం.

ఇది చరిత్ర.

ఈ చరిత్రను వక్రీకరించి చాలామంది తమ కులాల గురించి తమకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు.
మగధను పాలించిన వాళ్ళు మాదిగలని,
బుద్ధుడి  తల్లి మాల అని,
కాకతీయులు కమ్మ అని, విజయనగర పాలకులు కాపులని,
శాతవాహనులు కుమ్మరులని,
లంబాడీలు రాజపుత్రులని,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అత్త గారి కుటుంబం గిరిజనుల్లో క్షత్రియులని……..  ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకుంటున్నారు.

మనదేశంలో చరిత్రకారులు చరిత్రను రాయలేదు.
రాజుల ఆస్థానంలో కవులు, రచయితలు తమ పోషకాలైన రాజుల సంతోషం కోసం వాస్తవాన్ని వక్రీకరించి, చరిత్రగా చిత్రీకరించారు.

భారతదేశ చరిత్ర ప్రకారం దక్షిణ భారతదేశంలో ఉన్న వారందరూ శూద్రులు. ఆర్యులు పంజాబ్ గుండా భారతదేశంలో ప్రవేశించిన తరువాత, అసలైన భారతీయులపై సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం ఏర్పాటు చేయటానికి… ఆర్యులను బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులుగా విభజించి, మిగిలిన భారతీయులందరిని శూద్రులు గా ప్రకటించి, పై మూడు వర్ణాలకు  అవసరమైన, వివిధ సేవలను అందించటమే శూద్రుల బాధ్యతగా వర్ణ వ్యవస్థను నిర్మించారు.
ఈ వర్ణ వ్యవస్థ లో, దారుణమైన వివక్షతకు, దోపిడీకి గురయ్యేది శూద్రులే… కానీ  విషాదమేంటంటే… ఈ వర్ణ వ్యవస్థ ని బతికిస్తుంది శూద్రులే.
శూద్రుడైన  నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యాడు, శూద్రుడైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాడు….. కానీ వీళ్ళు ఎవరూ హిందూ దేవాలయంలో పూజారి మాత్రం కాలేరు. ఎందుకంటే… కులాన్ని కంట్రోల్ చేసేది మతం. ఆ మతం ఎప్పటికీ బ్రాహ్మణుల నియంత్రణలోనే ఉంటుంది. అందుకే  1927 నుండి ఈరోజు వరకు ఆర్ఎస్ఎస్ నాయకత్వం బ్రాహ్మణుల చేతుల్లోనే ఉంటుంది.

మరి శూద్రుల నుండి  ప్రధానులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అయినవారు….. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు అంటే? సమాధానం చాలా సింపుల్………. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి.

 

– కొలికపూడి శ్రీనివాసరావు