ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు

304

– మైనార్టీ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించండి
– సాధ్యమైనంత వరకు ఇళ్ళలోనే ప్రార్థనలు చేసుకోవాలి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, మే 13: రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రంజాన్ పండుగ మానవాళికి హితాన్ని అందిస్తుందన్నారు. రంజాన్ నెలను ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారని, ఈ నెల్లోనే దివ్య ఖురాన్ ఆవిర్భవించిందన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసమని అన్నారు. ఖురాన్ ప్రకారం ఈ నెల్లో విధిగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తుంటారన్నారు. రోజుకు ఐదుసార్లు నమాజ్ తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారన్నారు. మానవీయ విలువలను పవిత్ర ఖురాన్ గ్రంథం తెలియజేస్తుందని అన్నారు. కోవిడ్ కర్ఫ్యూ నేపథ్యంలో రంజాన్ నిర్వహణపై మైనార్టీశాఖ మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, ఈద్గాల్లో ప్రార్థనలు నిషేధమని, ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారన్నారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఇళ్ళలోనే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. మసీదుల్లో ప్రార్థనలకు 50 మందికి మించి హాజరుకావద్దని, ప్రార్థనలు చేసే సమయంలో కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దగ్గు, జలుబు వంటి లక్షణాలున్న వారు ప్రార్థనలకు రావద్దని సూచించారు. ఇదిలా ఉండగా కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదప్రజలకు సంక్షేమాన్ని కొనసాగిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డికి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు మంత్రి కొడాలి నాని చెప్పారు.