వ‌చ్చే నెల 1 నుంచి నిలిచిపోనున్న గూగుల్ ఉచిత సేవ‌లు

337

న్యూఢిల్లీ : వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి గూగుల్ ఉచిత సేవ‌లు నిలిచిపోనున్నాయి. ఒక‌వేళ ఎవ‌రైనా వినియోగ‌దారులు గూగుల్ సేవ‌ల‌ను పొందాల‌నుకుంటే జూన్ 1 నుంచి డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగ‌దారుల‌కు విష‌యం తెలియ‌డానికి గాను తొలుత గూగుల్ ఫొటో ఉచిత క్లౌడ్ నిల్వ సౌకర్యాన్ని నిలిపివేస్తున్న‌ది. గూగుల్ ఫొటో క్లాట్ స్టోరేజ్‌లో ఫొటోలు సేవ్ చేసుకోవాలంటే ఇక‌పై గూగుల్ సంస్థ పేర్కొన్న విధంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం, గూగుల్ సంస్థ త‌మ వినియోగదారులకు అపరిమిత ఉచిత నిల్వ సేవ‌ల‌ను అందిస్తున్న‌ది. దీని వ‌ల్ల‌ వినియోగదారులు వారి ఫొటోలు, ఇతర పత్రాలను ఆన్‌లైన్‌లో నిల్వ చేసుకునే వీలుండేది. వీటిని ఇంటర్నెట్ ద్వారా ఎక్కడైనా అందుబాటులో తీసుకోవ‌చ్చేది. అయితే, ఈ సేవ‌ల‌కు ఛార్జీలు చెల్లించిన మీద‌ట వ‌చ్చే జూన్ నెల నుంచి వాడుకోవ‌చ్చ‌ని గూగుల్ సంస్థ స్ప‌ష్టం చేసింది. అయితే, వ‌చ్చే నెల నుంచి వినియోగదారులకు 15 జీబీ ఉచిత క్లౌడ్ నిల్వను మాత్రమే అందించ‌నున్న‌ది. వినియోగదారులు దీని కంటే ఎక్కువ ఫొటోలు లేదా పత్రాలను ఆన్‌లైన్‌లో నిల్వ చేయాలనుకుంటే మాత్రం వారు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

ఎంత ఛార్జీలు వసూలు చేస్తారు..
వినియోగదారులకు 15 జీబీ క‌న్నా అదనపు డాటా అవసరమైన ప‌క్షంలో.. నెలకు 1.99 డాల‌ర్లు (రూ.146) చెల్లించాలి. సంస్థ తరపున దీనికి గూగుల్ వన్ అని పేరు పెట్టారు. దీని వార్షిక చందా ఛార్జీ 19.99 డాల‌ర్లు (దాదాపు రూ.1,464). అయితే, కొత్త ఫొటోలు, వీడియోల నిల్వ కోసం మాత్ర‌మే వినియోగదారులు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పాత ఫొటోలు మునుపటిలా సురక్షితంగా నిల్వ చేయబడతాయి. గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ కస్టమర్లు ఉచిత అధిక నాణ్యత గల ఫొటో బ్యాకప్‌ను ఉపయోగించుకోవ‌చ్చు. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ 2,3,4,5 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఉచిత ఫొటో, వీడియో స్టోరేజ్ సౌకర్యం కూడా లభిస్తుంది