ఈటల-కేసీఆర్..ఎవరి ఎత్తులు వారివే

623

బహిష్కరణ  కోసం ఈటల ఎదురుచూపు
రాజీనామా చేస్తారని టీఆర్‌ఎస్ అంచనా
సొంత ఇలాకాలో అష్టదిగ్బంధంలో ఈటల
( మార్తి సుబ్రహ్మణ్యం )

టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్- బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య దోబూచులాట కొనసాగుతోంది. ఇద్దరూ పొలిటికల్ గేమ్‌ను రసవ త్తరంగా నడిపిస్తున్నారు. ఎవరికి వారు ఎదుటివారికి పొలిటికల్ మైలేజీ దక్కకుండా  పొలిటికల్ గేమ్ ఆడుతుండటం ఆసక్తికరంగా మారింది.

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ తనకు మద్దతుగా వచ్చే వర్గాలను కూడగట్టే పనిలో ఉన్నారు. ఇప్పటివరకూ ఆయనకు తెలంగాణలోని ముదిరాజ్ సంఘాలు తప్ప, టీఆర్‌ఎస్ నుంచి ఆశించిన స్థాయిలో నాయకుల మద్దతు లభించలేదు. టీఆర్‌ఎస్‌లో ఆదరణ లేని మాజీ నేతలు మాత్రమే ఆయనతో భేటీ అవుతున్నారు తప్ప, వారు కూడా మీడియా ముందుకొచ్చి తాము ఈటలకు మద్దతునిస్తామని ప్రకటించకపోవడం ప్రస్తావనార్హం. ఈ విషయంలో ఈటలకు సొంత పార్టీ కంటే, కాంగ్రెస్, బీజేపీ, ఇతర తెలంగాణ ఉద్యమ సంస్థల మద్దతే ఎక్కువగా కనిపిస్తోంది. కేసీఆర్‌పై యుద్ధం చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇద్దరూ.. ఈటల భుజంపై నుంచి కేసీఆర్‌కు గురిపెడుతున్నారు. ఈటలకు అన్యాయం జరిగిందంటూ విపక్షాలన్నీ సానుభూతి ప్రకటిస్తున్నప్పటికీ, సొంత పార్టీలో మాత్రం టీఆర్‌ఎస్‌కు సానుభూతి కరువవుతోంది.

ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ఈటల సందిగ్ధంలో ఉన్నట్లు ఆయన వైఖరి స్పష్టం చేస్తోంది. కనీసం సొంత జిల్లాలో కూడా టీఆర్‌ఎస్ నేతల నుంచి కనీస మద్దతు లభించడం లేదు. ఎటుచూసినా ఒక్క ముదిరాజు సామాజిక వర్గ నాయకులు మినహా, రాజకీయంగా ఆయనకు లభిస్తున్న మద్దతు శూన్యం. గతంలో టీడీపీలో ఉన్న కేసీఆర్ రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు లభించిన మద్దతులో, కనీస స్థాయిలో కూడా ఈటలకు సహకారం లభించకపోవడం ఆయనను నిరాశకు గురిచేస్తోంది. కేసీఆర్‌కు మద్దతుగా అనేక మంది టీడీపీ నేతలు రాజీనామా చేసి ఆయన వెంట రాగా, ఈటల వెంట సొంత జిల్లా వారే కనిపించకపోవడం బట్టి, ఆయన భవిష్యత్తుపై సహజంగానే సందేహాలు త లెత్తుతున్నాయి. అయినా నిరుత్సాహపడని ఈటల, మద్దతు సమీకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

కాగా, వివిధ దేశాల్లో ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు మాత్రం ఈటలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. వారు ఇటీవలి కాలంలో ఈటలతో కలసి వీడియోకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. వీరంతా తెలంగాణ ఉద్యమ సమయంలో, భారీ ఎత్తున విరాళాలు ఇచ్చిన వారే కావడం గమనార్హం. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధుల అరెస్టుల సమయంలో, ఈ ఎన్‌ఆర్‌ఐలే ఈటల ద్వారా కోర్టు కేసులకు నిధుల సాయం అందించారు. ఇదే సమయంలో ఈటల మద్దతుదారులు సోషల్‌మీడియాపై దృష్టి సారిస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఈటలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ సమాజానికి చాటే పాత్ర పోషిస్తున్నారు.

అయితే.. ఈ ఎత్తు పై ఎత్తు రాజకీయాల్లో ఆరితేరిన సీఎం కేసీఆర్.. ఈటల పలుకుబడిని  సొంత జిల్లాలోపాటు,  సొంత నియోజకవర్గంలోనే నిర్వీర్యం చేసేందుకు శరవేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు.. ఈటలకు మద్దతునిచ్చే వారిని వెనుకంజ వేసేలా చేస్తోంది. ప్రధానంగా ఈటలకు రాజకీయంగా-వ్యపారపరంగా సన్నిహితుడైన జడ్పీ చైర్మన్ పుట్టా మధును అరెస్టు చేయడం, పార్టీలోని ఈటల సన్నిహితులకు హెచ్చరిక సంకేతమే. సంచలనం సృష్టించిన లాయరు దంపతుల హత్య కేసులో,  పుట్టా మధు సహా పార్టీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే కేసుకు సంబంధించి మధును అరెస్టు చేయడం బట్టి,  ప్రభుత్వం ఈటల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో స్పష్టమవుతోంది.

మరోవైపు ఈటలను బర్తరఫ్ చేయడానికి పదిరోజుల ముందే, స్థానిక టీఆర్‌ఎస్ కీలక నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించి, వారికి కర్తవ్యబోధ చేసినట్లు టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఈటల సొంత హుజూరాబాద్‌లో సీఐ నుంచి ఏసీపీ, ఎంపీడీఓల వరకూ అందరినీ యుద్ధప్రాతిపదికన బదిలీ చేయడం ద్వారా, ఈటలను రాజకీయంగా బలహీనుడిని చేయడంలో కేసీఆర్ విజయం సాధించారు. ఈ క్రమంలో కేవలం ఎమ్మెల్యేగా ఉన్న ఈటలకు ఇప్పటివరకూ సొంత నియోజకవర్గంలో ఉన్న  పలుకుబడి పలచబడినట్లే. మరోవైపు రాజ్యసభ సభ్యుడు, గతంలో హుజూరాబాద్ ఇన్చార్జిగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావును మళ్లీ ఇప్పుడు ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న అదే నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించడం ద్వారా, ఈటల దూకుడుకు చెక్ పెట్టారు.

ఈ నేపథ్యంలో ఈటల భవిష్యత్తు ఏమిటన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఆయన తనంతట తాను రాజీనామా చేస్తారా? లేక నాయకత్వమే బహిష్కరిస్తుందా? అన్న ఉత్కంఠ గత కొద్దిరోజుల నుంచి కొనసాగుతోంది. అయితే.. తనను పార్టీ నుంచి బహిష్కరించేవవరకూ వేచిచూడాలని ఈటల భావిస్తున్నట్లు ఆయన మౌనం స్పష్టం చేస్తోంది. తనను బహిష్కరించిన తర్వాత, ఆ సానుభూతితో జనంలోకి వెళ్లాలన్నది ఆయన భావనగా కనిపిస్తోంది. అయితే.. ఈటలను అష్టదిగ్బంధం చేయడం ద్వారా, ఆయనే తనంతట రాజీనామా చేసేలా చూడాలన్నది టీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. తనంతట తాను బహిష్కరిస్తే, ఆ సానుభూతితో ఆయన జనంలోకి వెళతారని నాయకత్వం భావిస్తోంది. అందుకే ఈటలను బహిష్కరించకుండా వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు.