అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదల ఆకలి తీర్చండి..

83

‘‘ తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను కొనసాగించాలన్న స్టాలిన్ నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకోండి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత రానీయకుండా చర్యలు తీసుకోండి..ప్రభుత్వ నిర్ణయంతో వైఎస్సార్ బీమా అందరికీ వర్తించడం లేదు…మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున చెల్లించి ఆదుకోండి. తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ పేషెంట్లను ఆపేస్తున్న పరిస్థితిపై వెంటనే స్పందించండి..రూ.2.21 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రూ.1500 కోట్లు వెచ్చించి వెంటనే  వ్యాక్సినేషన్ జరిగేలా చూడండి. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడండి..ఆ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి ’’ అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సీఎం జగన్‌ను కోరారు.

ఇంకా సోమిరెడ్డి ఏమన్నారంటే ‘‘ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మరి కారణంగా పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తల్లిదండ్రులను కోల్పోయి బిడ్డలు అనాథలవుతున్నారు..కళ్ల ముందే కన్నబిడ్డలను, ఆప్తులను కోల్పోతున్న వారున్నారు.. ఆస్పత్రులకు లక్షలు లక్షలు కట్టలేక పేద, మధ్యతరగతి ప్రజానీకం ఆర్థికంగా చితికిపోతున్నారు..వారిని ఆదుకోండి. టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి రూ.5కే పేదల ఆకలి తీర్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 386 క్యాంటీన్లు సేవలందించాయి. రోజుకు కొన్ని లక్షల మంది అన్న క్యాంటీన్లలో ఆకలి తీర్చుకునే వారు. రూ.5కే వారికి నాణ్యమైన ఆహారం లభించేది. ఇలాంటి మహత్తరమైన పథకాన్ని అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఆపేశారు.

సాధారణంగా తమిళనాడులో కక్షసాధింపు రాజకీయాలు, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి ఉంటుంది.. అలాంటి రాష్ట్రంలోనే  జయలలిత హయాంలో ప్రారంభమైన అమ్మ క్యాంటీన్లను కొనసాగించాలని స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఆ పార్టీ కార్యకర్తలు కొందరు అమ్మ క్యాంటీన్లపై దాడులు చేసి జయలలిత ఫొటోలను చించేశారు. వెంటనే సీఎం స్టాలిన్ స్పందించి వారిపై కేసులు నమోదు  చేసి చర్యలు తీసుకోమని ఆదేశించారు. అమ్మ క్యాంటీన్లు కూడా కొనసాగుతాయని ప్రకటించారు. స్టాలిన్ సీఎం అవగానే తీసుకున్న ఐదు ముఖ్యమైన నిర్ణయాల్లో అమ్మ క్యాంటీన్లను కొనసాగించడం ఒకటి.ఏపీలో ఎన్టీఆర్ చేపట్టిన పథకాలను కాంగ్రెస్ సీఎంలు కొనసాగించారు..వైఎస్సార్ ప్రారంభించిన పథకాలను రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వతా చంద్రబాబు నాయుడు కొనసాగించారు. అన్న క్యాంటీన్లను మూసేయడం ఎంత వరకు న్యాయమో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. నిరుపేదల నోటికాడ కూడు తీసేస్తే మీకొచ్చే కిరీటం ఏంటి? ఇప్పటికైనా పునరాలోచించి రాజన్న క్యాంటీన్ అని పేరు మార్చి అయినా క్యాంటీన్లను పునరుద్ధరించండి.

నెల్లూరు జిల్లాలో రోజుకు 70 నుంచి 100  మంది చనిపోతుంటే ముగ్గురు, నలుగురని లెక్కలు చెబుతున్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నా అడ్మిషన్ చేసుకోని పరిస్థితి ఉంది..దీనిపై దృష్టి సారించండి. మా ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకం కింద కుటుంబంలోని 18ఏళ్లు నిండిన వారందరికీ బీమా వర్తించేది.ఇప్పుడు ఆ పథకం పేరు వైఎస్సార్ బీమాగా మార్చారు..ఇంటి పెద్దకు మాత్రమే బీమా వర్తించేలా నిబంధనలు మార్చడం న్యాయమేనా? కనీసం ఈ నిబంధన మార్చిన విషయమైనా సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసా? పేద కుటుంబాలను ఎంతో కొంత ఆదుకునే పథకాన్ని కూడా నీరుగార్చడం మీకు తగునా? మంచి మనస్సు చేసుకుని ఆప్తులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లించండి. వైద్యం కోసం దేశంలోని ఏ రాష్ట్రానికి అయినా వెళ్లే హక్కు ప్రజలకు ఉంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఏం బేధాభిప్రాయాలు వచ్చాయో కానీ సరిహద్దుల్లో రోగులను ఆపేయడం అన్యాయం. వెంటనే ఆ సమస్య పరిష్కరానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలుగు బిడ్డ అనారోగ్యానికి గురైతే హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లో చేరడానికి లేదా.? చెన్నై, బెంగళూరుకు ఎంతో మంది వెళ్లి వైద్యం పొందుతున్నారు..తెలుగు ప్రజలు తమ రాష్ట్రాలకు రావడానికి లేదని వారంటే పరిస్థితి ఏంటి.? రూ.2.21 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టుకుని వ్యాక్సినేషన్ కు రూ.1500 కోట్లు చెల్లించడానికి ఎందుకు వెనకాడుతున్నారు   ’’