కోవిడ్ సెంటర్లు, ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు పెద్దపీట…

201

ప్రజా ఆరోగ్యానికి సంబంధించి  నిధుల కొరత లేదు…
అవసరమైన సాంకేతిక సిబ్బంది, అర్హులైన వారితో భర్తీ చేసుకోవాలి…
విజయనగరం జిల్లా  అధికారుల‌తో  మంత్రులు  వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు,  బొత్స సత్యనారాయణ  జూమ్ స‌మీక్ష

విజయనగరం జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలు, కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్సిస్తూ సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రులు సమీక్షించారు.

కోవిడ్ నివారణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను మరింతగా విస్తరించాలని, అనుకూలమైన పరిస్థితులు ఉన్న చోట్ల అదనంగా ఆక్సినేటెడ్ బెడ్లను సమకూర్చాలని, వీటి నిర్వహణకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని కూడా స్థానికంగా అర్హులైన వారితో భర్తీ చేసుకోవాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టు వచ్చిన వారికి దగ్గర్లోని కోవిడ్ సెంటర్, లేదా ఆసుపత్రిలో బెడ్ కేటాయిస్తూ  సమాచారాన్ని అందచేసేట్లుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదే సమాచారాన్ని సంబంధింత వార్డు, గ్రామ సచివాలయానికి కూడా అందించి ప్రజలకు వేగవంతమైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలన్నారు. అలాగే కోవిడ్ సెంటర్లలో కల్పిస్తున్న సదుపాయాలపై కూడా నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఆక్సిజన్ కు కొరత లేదని, అలాగే రెమిడిసివర్ కూడా అందుబాటులో ఉందని, అయితే దీని పంపిణీ విషయంలో ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానాలను రూపొందించిన విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. అంతే కాకుండా కోవిడ్ వాక్సిన్ విషయంలో కూడా ఒక పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తున్నామని, ప్రస్తుతం రెండో విడత వాక్సిన్ వేసుకునే వారికి ప్రాధాన్యత నిస్తున్నామని మంత్రి అన్నారు.

జిల్లా ఇన్ ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇకపై వారానికి రెండుసార్లు కోవిడ్ నియంత్రణపై సమీక్షలు నిర్వహిస్తామన్నారు.  జిల్లాలోని కోవిడ్ సెంటర్లు, ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లోనూ, కోవిడ్ సెంటర్లలోనూ వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, కొన్ని చోట్ల రాత్రిపూట పర్యవేక్షణ పెద్దగా లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని , ఇటువంటి వాటిపై దృష్టిపెట్టాలని, అవసరమైతే అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన చర్యల్లో నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు.