కోవిడ్ -19 నియంత్రణపై సీఎం జగన్ సమీక్షలు

275

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, మే 10: రాష్ట్రంలో పక్కా ప్రణాళికతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం గుడివాడ పట్టణం కొత్త మున్సిపల్ కార్యాలయం సెంటర్లో మంత్రి కొడాలి నానిని వార్డు వాలంటీర్ నగీనా కలిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడాదిన్నరగా 24 వ వార్డు వాలంటీర్ గా పనిచేస్తున్నానని, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో రెండు నెలలు సెలవు పెట్టానని తెలిపారు. ప్రస్తుతం కోలుకున్నానని, తన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించాలని కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వాలంటీర్ పోస్ట్ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నగీనాకు ఉద్యోగం ఇప్పించే ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. సీఎం జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ఇంటి ముంగిటకు చేరువ చేయాలనే ముందుచూపుతో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ఈ వ్యవస్థ ద్వారా వచ్చిన 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రతి నెలా 1 వ తేదీనే పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

వైఎస్సార్ బీమా పథకం కింద సీఎం జగన్మోహనరెడ్డి రూ. 254 కోట్లు విడుదల చేశారని, గతంలో ఉన్న గ్రూప్ ఇన్సూరెన్స్ ను తొలగించి వ్యక్తిగతంగా అకౌంట్ ఉన్నవారికే బీమా సౌకర్యం కల్పించారని, వాలంటీర్ల ద్వారా 61 లక్షల మందికి అకౌంట్లను ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 1.47 కోట్ల బియ్యం కార్డుదారులకు కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలోనూ వాలంటీర్లు డోర్ డెలివరీ వాహనాల ద్వారా ఇంటింటికీ ఉచితంగా బియ్యాన్ని అందజేస్తున్నారన్నారు. నవరత్నాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా కోవిడ్ -19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికపుడు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. కోవిడ్ వైద్యానికి సంబంధించి ఆక్సిజన్‌ను సరఫరా చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.309.87 కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు 50 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని చెప్పారు. దీంతో పాటు 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే ఆరు నెలలకు ప్రభుత్వం రూ. 60 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు.

రాష్ట్రం నుండి కొంత మంది ప్రజలు వివిధ అనారోగ్య కారణాలకు సంబంధించి చికిత్స నిమిత్తం తెలంగాణా రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు వెళ్తున్నారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేట్ అంబులెన్స్ లో తెలంగాణా రాష్ట్రానికి వెళ్ళే వారు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. లేదా రోగికి తాము చికిత్స చేయడానికి సిద్ధంగా ఉన్నామని, రోగి కోసం తమ ఆసుపత్రిలో బెడ్ కూడా సిద్ధంగా ఉందని, చికిత్స అందించే సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యం నుండి ముందస్తు అంగీకార పత్రం, ధృవీకరణ పత్రాన్ని పొందాలన్నారు. అలా ఉన్నపుడే చికిత్స నిమిత్తం ప్రైవేట్ అంబులెన్స్లో తెలంగాణా రాష్ట్రానికి తీసుకువెళ్ళాలని మంత్రి కొడాలి నాని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.