సోరెన్‌కు చెప్పారు సరే…మరి మీరు చేస్తున్నదేమిటి జగనన్నా?

666

సోషల్‌మీడియా సమాచారం తెలియదా?
( మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

ఎదుటివారికి చెప్పే ధర్మసూత్రాలను  ముందు తన ఇంటి నుంచే మొదలుపెట్టమంటారు పెద్దలు. ఏపీ సీఎం జగనన్న.. మోదీకి మద్దతిస్తూ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌నుద్దేశించిన హితోక్తులు చూస్తే.. ధర్మసూత్రాలు ముందు మన ఇంటినుంచే మొదలుపెట్టాలన్న పెద్దల మాట గుర్తు చేయాలనిపించింది. కోవిడ్ సమయంలో ప్రధాని మోదీజీ వైఫల్యాలను ప్రస్తావిస్తూ, మొన్న ఆయన నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్సులో తమకూ మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదన్నది  సోరెన్ అభిప్రాయం. అయితే దానిని ఖండించాల్సిన భాజపా ముఖ్యమంత్రులు- భాజపా గళధారులకు బదులు, కనీసం అధికారికంగా మిత్రపక్షం కూడా కాని జగనన్న స్పందించి, మోదీ తరఫున వకాల్తా పుచ్చుకోవడమే విచిత్రం. విశేషమూనూ!

సరే.. అన్నయ్యకు మోదీజీతో అనేకానేక అవసరాలు, లక్షాతొంభై పనులూ ఉండి ఉంచవచ్చు. ఆ ప్రకారంగా పెద్దాయనను ప్రసన్నం చేసుకునేందుకే సోరైన్‌కు హితవు పలికారని కాసేపు అనుకుందాం. ‘‘రాజకీయంగా పార్టీల మధ్య విబేధాలుండవచ్చు. కోవిడ్‌పై చేస్తున్న యుద్ధంతో మనమంతా ఏకమవ్వాలి. పార్టీలకు అతీతంగా కోవిడ్‌పై పోరాటాన్ని బలోపేతం చేద్దామని’’ అన్నయ్య పెద్దమనసు చేసుకుని, సోరెన్ తమ్ముడికి హితబోధ చేశారు. మంచిదే. వయసులో చిన్నవాడయినా ఎంతో పరిణతి చెందిన మాట అది. ఎన్నో దశాబ్దాల రాజకీయ అనుభవం, విశాల హృదయం ఉంటే తప్ప అలాంటి పెద్దమాటలు రావు. అందుకు జగనన్నయ్యను భార తజాతి, రాజధాని ఎక్కడో తెలియని ఆంధ్రజాతి, మొత్తంగా తెలుగుజాతి మూకుమ్మడిగా, ఒక్కగొంతుతో శహభాషులు చెప్పాల్సిందే.అయితే.. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డునాకినట్లు… మరి సోరైన్ తమ్ముడికి అన్ని హితోక్తులు పలికిన జగనన్నయ్య,  ఆంధ్రాలో చేస్తున్నది ఏంటన్నది ఇప్పుడు సోషల్‌మీడియాలో పేలుతున్న ప్రశ్నలు. పార్టీలకు అతీతంగా కోవిడ్‌పై పోరాటం చేద్దామని పిలుపునిచ్చిన జగన్ సారు, ఏపీలో ఆ పని చేయకుండా తన రాజకీయ ప్రత్యర్ధులను శంకరిగిరి మాన్యాలకు పంపించడంలో ఎందుకు బిజీగా ఉన్నారు చెప్మా? అని నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు. తాను పరాయి రాష్ట్రం వాడికి ఇచ్చిన సలహాను, ముందు తానెందుకు పాటించటం లేదన్న ప్రశ్నలకు మరి పెద్దమనిషిగా జగనన్నయ్య సమాధానం ఇవ్వాల్సిందే కదా?

 కరోనా కాటేస్తున్న ఈ సంక్షోభంలో అన్ని అంశాలనూ పక్కకుపెట్టి, కేవలందానిపైనే దృష్టి సారించి ప్రజలకు అభయమివ్వవలసిన జగన్‌బాబు..ఎందుకో ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ, రాజకీయ కక్ష సాధింపునకే ప్రాధాన్యమిస్తున్నారన్న భావన జనంలో లేకపోలేదు. కాకపోతే  ఆ జనాభిప్రాయాన్ని తాడేపల్లి వరకూ తీసుకువెళ్లేందుకు గజ్జెకట్టే మొనగాడెవరన్నదే ప్రశ్న. పాపం విపక్షాలు, మీడియాను ఫాలో అయ్యేవారంతా.. సలహాదారులేం చేస్తున్నారు? ఆయనకు ఇవన్నీ చెప్పొద్దూ అని ఆడిపోసుకుంటారు గానీ.. వారంతా నిమిత్తమాత్రులే. సలహాదారులంటే సలహాలిచ్చేవారని అర్ధం. కానీ ఏపీలో అంతా రివర్స్ కదా? అందుకే సీఎం ఇచ్చే ఆదేశాలు లాంటి సలహాలు పాటిస్తున్నారన్న, ‘నగ్మా సత్యం’ ఎంత మందికి తెలసు?  ఏదో పైకి ఫొటోల ముందు సమీక్షిస్తున్నట్లు, ఆదేశాలు జారీ చేస్తున్నట్లు జీవిస్తుంటారు. ఆ రకంగా సలహాదారులంతా జగనన్నయ్యకు సలహాలిస్తున్నట్లు నటిస్తుంటే, అన్నయ్య కూడా వాటిని తీసుకున్నట్లు నటిస్తుంటారన్నమాట! కాబట్టి సలహాదారులను ఊరకనే ఆడిపోసుకోవద్దు. ప్లీజ్. సీతబాధలు సీతవి. పీత బాధలు పీతవన్నట్లు… సలహాదారుల బాధలు సలహాదారులవి!

నిజంగా జగన్మోహన్‌రెడ్డి కరోనా సమయంలో చేస్తున్నదేమిటి? ఆయన ఇంకా మూడేళ్లు ముఖ్యమంత్రిగానే ఉండి తీరతారు. అప్పటిదాకా ఆయనకు అడ్డువచ్చే శక్తులేవీ లేవు. టీడీపీ,బీజేపీ పదవీ వైధవ్యాన్ని అనుభవిస్తున్నాయి. పైగా జగన్ ఇచ్చిన ఆదేశాల్లో మంచి చెడ్డ, చేయవచ్చా? చేయకూడదా? అన్న విచక్షణ లేకుండా జీ హుజూరంటూ, భక్తిభావనతో అమలుచేసే అధికార విధేయ బృందం ఎలాగూ ఉండనే ఉంది. అందులోనూ ఒకరిద్దరు అధికారులయితే, తమ వెన్నుముక దెబ్బతింటుందన్న భయం కూడా లేకుండా పనిచేస్తున్నారు.  సరే..  ఎవరి పోస్టింగు పితలాటకాలు వారివి! ఎవరి అభిమానాలు వారివి!!

పోనీ తెలంగాణలో మాదిరిగా,  పార్టీలో తన నిర్ణయాన్ని ప్రశ్నించే ఈటల రాజేంద్రులెవరూ లేరు. ఉన్న రఘురామకృష్ణంరాజు వెళ్లనే వెళ్లిపోయారాయె. ఇక ఉన్నదంతా చెప్పింది విని తలూపే తరహానే. మంత్రులు కూడా డిటో గ్రామకాపరస్తులేనాయె! అన్ని ఎన్నికలూ అయిపోయాయి. అన్నింట్లోనూ శత్రుపక్షం తుడిచిపెట్టుకుపోయి, మైదానమంతా మనోళ్లతోనే  నిండిపోయింది. మరి ఇన్ని వెసులుబాట్లు పెట్టుకుని.. దేశంలో ఏ సీఎంకూ లేనన్ని సుఖం పెట్టుకున్న  జగన్, ఈ సమయంలో ప్రత్యర్ధులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం తెలివైన పనేనా? అన్నది వైసీపేయులకే అర్ధం కాని ప్రశ్న.

కరోనాపై పోరాటం చేయడమంటే.. చంద్రబాబు హుద్ హుద్ తుపాను తర్వాత ప్రకృతిని జయించామని పబ్లిసిటీ చేసుకోమన్నట్లు కాదు. అన్నీ నేనే చేశానని బడాయి మాటలు చెప్పుకోమని అంతకంటేకాదు! అఫ్‌కోర్స్.. జగనన్నయ్య రోజంతా మీడియా కోసమే పనిచేయరనుకోండి. ఎలాగూ సొంత మీడియా ఉంది కాబట్టి.. ఆ బాధలేవో  అవే పడతాయి. అది వేరే విషయం!  జిల్లా కలెక్టర్లు కోవిడ్ ఆసుపత్రులకు వెళ్లి రోగులకు ఆత్మస్థైర్యం ఇస్తున్నారు. మొన్న తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రాణాలు పణంగా పెట్టి, కోవిడ్ మృతులకు దగ్గరుండి దహనసంస్కారాలు చేశారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, ఇప్పటివరకూ కోవిడ్ ఆసుపత్రులను చూడకపోతే చూడకపాయె. కనీసం ఈ సంక్షోభ స్థితిలో సర్కారు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి తనిఖీ చేసి, ప్రజల్లో నైతికస్థైర్యం నింపాల్సిన అవసరం లేదా? ఇప్పుడు అది కదా చేయాల్సింది?

అసలు ప్రపంచమంతా కరోనా కల్లోలం నుంచి ప్రజలను ఎలా రక్షించాలా? అని తలపట్టుకుంటుంటే.. జగన న్న మాత్రం..  దూళిపాళ్ల నరేంద్ర డైరీని ఎలా స్వాధీనం చేసుకోవాలి? అచ్చెన్నాయుడిని ఎలా జైలుకు పంపించాలి? అశోక్ గజపతిరాజును పదవి ఎలా ఊడగొట్టాలి? దేవినేని ఉమను ఎన్నిసార్లు సీఐడీ చుట్టూ తిప్పాలి? చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలి? జువారీ సిమెంటు, అమరరాజా కంపెనీని ఎలా మూయించాలన్న ఆలోచన చేయడమే ఆశ్చర్యం. దానికి ఇదా సమయం? ఇంట్లో ఉన్న ధూళిపాళ్లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు ఆయనతోపాటు, సంగం డైరీ చైర్మన్‌కూ కరోనా సోకింది. మరి దానికి బాధ్యులెవరు?

కేంద్రంతో ఉన్న రాజకీయ సంబంధాలను ఎక్కువ టీకాలు తెప్పించుకోవడానికో.. రెమ్సిడివర్ కొరత తీర్చడానికో.. ఆక్సిజన్ నిల్వలు పెంచుకోవడానికో..  కేంద్రం నుంచి మరింత సాయం తెచ్చుకోవడానికో..  విదేశాల్లోని తెలుగువారి నుంచి సాయం కోరేందుకో వెచ్చించాల్సిన సమయాన్ని, ఇలా ప్రత్యర్ధులపై కక్ష తీర్చుకునేందుకు కేటాయిస్తుండటం..ముప్ఫయ్ ఏళ్లు సీఎంగా ఉండి, తాను పోయిన తర్వాత కూడా తన ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకునే జగన్మోహన్‌రెడ్డికి ఏమాత్రం తగదని విజ్ఞుల సలహా.తాను అకారణంగా 16 నెలలు జైలుపాలయ్యానని ఆయన ప్రతిరోజూ గుర్తుచేసుకోవచ్చు. అందుకు కారకులైన వారు రోజూ గుర్తుకురావచ్చు. ఫలానా కులం వారే తనను అప్పుడు సీఎం కాకుండా అడ్డుకున్నారన్న కోపం గంట గంటకూ గుర్తుకురావచ్చు. తప్పు లేదు. అది మానవ సహజం. కానీ ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి అనే వ్యక్తి ఒక రాష్ట్రాన్ని రాగద్వేషాలకు అతీతంగా పాలించాల్సిన  ముఖ్యమంత్రి. 50 శాతానికి పైగా తిరుగులేని నమ్మకంతో గద్దెనెక్కిన నేత.

జగన్ మూడు రాజధానులను స్ఫూర్తిగా పొందిన దక్షిణాఫ్రికాలో, నెల్సన్‌మండేలా జైలులో నరకయాతన అనుభవించారు. మన చంచల్‌గూడ, తీహార్ మాదిరిగా అక్కడ వీఐపీలకు ములాఖాత్, బయట తిండిలో మినహాయింపులేమీ లేవు రోజులవి. కరుడుకట్టిన తెల్ల జైలరు మండేలాపై, మూత్రం పోసి దారుణంగా అవమానించిన రోజులవి. అలాంటి మండేలా దేశాధిపతి అయిన తర్వాత ఒక విందు ఇచ్చారు. అంతకుముందు జైలులో తాను అనుభవించిన దారుణ పరిస్థిలను సభికులకు వివరించారు. తనకు తెల్లవారు, నల్లవారనే తేడాలు లేవని, అంతా సమానమేనని స్పష్టం చేశారు తర్వాత ఒక వ్యక్తిని పిలిచి, పక్కన కూర్చోపెట్టుకుని మర్యాదలు చేశారట. ఆ వ్యక్తే ఇందాక చెప్పిన జైల్లో నామీద మూత్రం పోసిన జైలర్!

అక్కడకు మండేలా ఆయనను ఎందుకు పిలిచారంటే.. నన్ను ఇబ్బందులు పెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. నిన్ను వేరేలా చూడను. అందరితోపాటు నిన్నూ సమానంగా చూస్తానన్న సందేశం ఇవ్వడానికే! మండేలా కథను గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ గుర్తు చేశారు. ఉండవల్లి మరొక మాట కూడా చెప్పారు. అర్జునిడికి చెట్టుపై పిట్ట కన్ను మాత్రమే కనిపించినట్లు.. జగన్‌కు తనను నమ్ముకున్న పేదలు మాత్రమే కనిపించాలి తప్ప.. అప్పుడు నన్ను వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఎవరు ఇబ్బందులు పెట్టారు? వాళ్ల సంగతి చూడాలి! అప్పుడు నన్ను జైల్లో ఎవరు పెట్టించారు. వాళ్ల సంగతి చూడాలన్న ఆలోచన రాకూడదు అని కూడా హితబోధ చేశారు. అదిప్పుడు గుర్తుకొచ్చిందంతే!