ఆక్సిజన్‌ పంపిణీకి ఓ జాతీయ టాస్క్‌ఫోర్స్‌!

298

ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు భారీ డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణవాయువు లభ్యత, సరఫరా, పంపిణీని పర్యవేక్షించేందుకు 12 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక జాతీయ కార్యదళాన్ని (Task Force) ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా శాస్త్రీయంగా, హేతుబద్దతతో సమానంగా ఆక్సిజన్‌ను పంపిణీ చేయాల్సిన బాధ్యతను ఈ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించింది. స్థూలంగా ఆక్సిజన్‌ సరఫరాను అవసరాలకనుగుణంగా క్రమబద్ధీకరించాల్సిన బాద్యతను ఈ టాస్క్‌ఫోర్స్‌ చూసుకోనుంది.

అలాగే కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు కావాల్సిన ప్రత్యేక ఔషధాలను సైతం సమానంగా పంపిణీ చేయాల్సిన బాధ్యతను ఇదే టాస్క్‌ఫోర్స్‌ నిర్వర్తించనుంది. కరోనా తీవ్రత వల్ల తలెత్తిన ఇతర సవాళ్లను సైతం హేతుబద్ధంగా పరిష్కరించనుంది. శుక్రవారం ఆక్సిజన్‌ కొరతకు సంబంధించి కేసు విచారణలో భాగంగా ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అసవరం ఉందని కోర్టు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. అలాగే, రాష్ట్రాలకు కేటాయించిన ఆక్సిజన్‌ కోటాను పునర్‌వ్యవస్థీకరించాలని కేంద్రానికి కోర్టు సూచించింది. ప్రాణవాయువు కేటాయింపు సమయంలో అంబులెన్సులు, కిందిస్థాయి కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలు, హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితుల వంటి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు అభిప్రాయపడింది.ఈ టాస్క్‌ఫోర్స్‌కు బెంగాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెన్స్‌ మాజీ ఉపకులపతి డాక్టర్‌ భబతోష్‌ బిశ్వాస్‌ నేతృత్వం వహించనున్నారు. గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌ అండ్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎండీ డాక్టర్‌ నరేశ్‌ ట్రెహాన్‌, దిల్లీలోని గంగారామ్‌, తమిళనాడు రాయవెల్లూర్ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ, బెంగళూరులోని నారాయణ హెల్త్‌కేర్‌, ముంబయిలోని ఫోర్టిస్‌ ఆసుపత్రుల్లోని ప్రముఖ వైద్యులు ఈ కార్యదళంలో సభ్యులుగా ఉండనున్నారు.