మనసున ఉన్నది..చెప్పాలనున్నదీ..మాటలు రావే ఎలా..?

584

జగన్‌కు చెప్పలేక నేతల సతమతం
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ మనుసున ఉన్నదీ.. చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా?
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతీ… బయటకు రాదే ఎలా?
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే.. బిడియం ఆపేదెలా?
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే.. తలపులు చూపేదెలా?
ఒకసారి.. దరిచేరి ఎద గొడవేమిటో.. తెలపకపోతే ఎలా?
కనబడుతోందా నా ప్రియమైన నీకు? నా ఎద కోత అని అడగాలని!
వినబడుతోందా నా ప్రియమైన నీకు!  ఆశల రాగం అడగాలని’’

చాలా ఏళ్ల క్రితం తరుణ్, స్నేహ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘ప్రియమైన నీకు’ సినిమాలో ప్రేమికురాలు నేహ, ప్రియుడు తరుణ్‌ని ఊహించుకుంటూ  ఆలపించిన ప్రేమగీతమిది! ఇప్పుడు రాజమండ్రిలో వైసీపీ ఎంపీ-అగ్ర నేతల మధ్య వీడియోలో జరిగిన సంభాషణ చూస్తే… తమ ఆవేదన అధినేత జగనన్నకు చెప్పుకోలేక, తమలో తాము ఎంత కుమిలిపోతున్నారో చెప్పకనే చెబుతోంది. అగ్రనేతలని భావిస్తున్న వారి పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే, ఇక కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటం కష్టం కాదు.

‘‘ ప్రభుత్వం లాజిస్టిక్స్ మెయింటైన్ చేయడం లేదు. కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించడానికి 30 వేలు, దహన సంస్కారాలు నిర్వహించడానికి 12 వేలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా మనమే జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం చేతులెత్తేసింది’ ఇవన్నీ  టీడీపీ నాయకుడు ఏ సుబ్బారావో, జనసేన నాయకుడు ఏ పుల్లారావో చేసిన వ్యాఖ్యలనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఈనెల 3న రాజమండ్రిలో వైసీపీ నేత డాక్టర్ ఆకుల సత్యనారాయణ నివాసంలో భేటీ  అయిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ భరత్‌రాం, , ఆకుల, చందన నాగేశ్వర్, రౌతు సూర్యప్రకాష్ సమక్షంలో జరిగిన చర్చల్లో నేతల గుండెల నుంచి మనస్ఫూర్తిగా దొర్లిన వ్యాఖ్యలు. మరి ఆ వీడియో ఎవరు తీశారో తెలియదు. ఎవరైతే ఏంటి? అక్కడున్న వారిలో ఒకరు తీసి ఉంటారన్నది మెడపై తల ఉన్న ఎవరికయినా అర్థమయి ఉండాలి.

అసలు ఆ వీడియోలో మనం చూడాల్సిన కోణం ఒకటుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సీఎం జగనన్నకు వివరించే ధైర్యం ఎవరికీ లేదు. ఐఏఎస్ అయినా, ఐపిఎస్ అయినా ఎస్ బాస్ అంటూ జీ హుజూరనవలసిందే. పెత్తనమంతా సీఎంఓదే. ఎమ్మెల్యేలకే ఫోన్లు అందుబాటులో ఉండని స్థాయికి సీఎంఓ ఎదిగిందంటే… ఈ వ్యవస్థలో ప్రజాప్రతినిధులు గొప్పా? సీఎంఓ గొప్పా అన్నది ఆత్మాభిమానానికి సంబంధించిన ప్రశ్న. అందుకే అగ్రనేతలంతా ఇలా ఎవరికి వారు తలుపులేసుకుని ఎవరి బాధలు వారు చెప్పుకుని, ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారన్న వాస్తవాన్ని ఈ వీడియో స్పష్టం చేసింది.

అసలు రాష్ట్రంలో నెలకొన్న కరోనా కల్లోల పరిస్థితి వాస్తవాలు, ఆక్సిజన్ డిమాండ్, కోవిడ్ ఆసుపత్రుల దోపిడీపై ప్రజలు తమను నిలదీస్తున్న వైనాన్ని జగనన్న దృష్టికి తీసుకువెళ్లాలని ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వరకూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ జగనన్న అపాయింట్‌మెంట్ దొరకడమే గగనం. జిల్లా కలెక్టర్లకు ఫోన్లు చేస్తే స్పందించరు. జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులకు ఫోన్లు చేసినా, వారూ తమ మాదిరిగానే అశక్తులు. వారికి బుగ్గ కార్లు ఉన్నాయి. తమకు లేవు. మిగిలినదంతా సేమ్ టు సేమ్!  మరి తమ ఈతి బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తలుపేసుకుని నాలుగు గోడల మధ్య తమ బాధలను తామే పంచుకుంటున్న వైసీపీ నేతల వాస్తవ దృశ్యాన్ని ఆ వీడియో ఆవిష్కరించిందనేది సీనియర్ల వా(వే)దన. ఇప్పుడు ఆంధ్రాలో అయినా, తెలంగాణలో అయినా పరిపాలిస్తున్నది సీఎంఓ. మంత్రులు అంగుష్ఠమాత్రులు. ఇది మనం మనుషులం అన్నంత నిజం!

సరే… యుశ్రారైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పినట్లు…. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆ వీడియో అంతా బోగస్ అనీ, మిమిక్రీ చేసి జగనన్న సర్కారును బద్నామ్ చేస్తున్నారని ఎదరుదాడి చేసి, ముఖరక్షణ చేసుకోవచ్చు. కానీ.. రాష్ట్రంలో సగటు వైసీపీ నేత మనోభావం మాత్రం అదే అన్నది మనం మనుషులం అన్నంత నిజం! ఇప్పుడు వైసీపీ ప్రజాప్రతినిధులు… జనం దృష్టిలో ఆక్సిజన్ ఏర్పాటు చేయలేని అసమర్ధులు. ప్రైవేటు ఆసుపత్రుల జేబుదోపిడీ నుంచి కాపాడలేని  చేతకాని వారు. నిస్సందేహంగా జనాభిప్రాయం ఇదే. కాదనే దమ్ము ఎవరికయినా ఉందా?

అదలా ఉంచితే… ఈ పెండమిక్ సిట్యుయేషన్‌లో… పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడగని పాలకులను ఏమనాలి? గతంలో వాజపేయి ప్రభుత్వ చివరి ఘోర వైఫల్యకాలంలో, భారత్ వెలిగిపోతోందన్న నినాదాలిచ్చిన ఎన్డీఏ-1 పాలన ఫలితాలను మర్చిపోతే, మిగిలేది చేదు ఫలితాలే!  ఉప ఎన్నికలు, స్థానిక సంస్ధల  ఫలితాలే అంతిమ తీర్పు కాదు. పాలనకు గీటురాయి అంతకంటే కాదు!!  ఎవరికైనా నడిచినంత కాలమే వైభోగం. అధికారులకేం.. ఏ ప్రభుత్వంలోనయినా నిక్షేపంగా ఉంటారు. ఎక్కడ భజన అక్కడ చేస్తారు. కానీ అంతిమంగా మూల్యం చెల్లించుకునేది మాత్రం రాజకీయ పార్టీలే. టీడీపీ హయాంలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులలో.. ఒకరిద్దరి మినహా అంతా సేఫ్. మరి ఈ సమర్ధలే బాబు దగ్గర ఉన్నప్పుడు ఎందుకు వెలిగారు? ఇప్పుడూ ఎందుకు వెలిగిపోతున్నారు? అలా ఆలోచించే దిమాక్ ఉన్నవాడే పొలిటీషియన్‌గా సక్సెస్ అవుతాడు. మరి ఆ లాజిక్కు ప్రకారం జగన్ సక్సెస్ అవుతాడా? అన్నదే ప్రశ్న? అధికారంలో ఉన్నవారికి అంతా వెలిగిపోతున్నట్లే ఉండటం సహజం!