కృష్ణదేవరాయలు…ఉచిత కనువిప్పు!

612
ఈ కథ చదివితే.. కృష్ణదేవరాయల రూపంలో మనకు ఓ మోదీ.. ఓ కేసీఆర్.. ఓ జగన్.. ఓ పళనిస్వామి కనిపిస్తుంటారు. జనం కష్టపడి సంపాదించిన డబ్బును టాక్సు రూపంలో పిండేస్తున్న పాలకులు, ఏవిధంగా వాటిని దుర్వినియోగం చేస్తున్నారో అర్ధమవుతుంది. ఇక చదవండి.

కృష్ణదేవరాయల రాజ్యంలో ఒకసారి ఎలుకల బెడద చాలా ఎక్కువైందట. జనాలు అందరూ వెళ్ళి దేవరాయలకు వేడుకున్నారు అయ్యా ఎలుకల వల్ల ఇంట్లో గింజలన్నీ వేస్ట్ అవుతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది ఏదో ఒకటి చేయండి అని…
దానికి రాయల వారు బాగా ఆలోచించి… ఎలుకల నివారణ కోసం ప్రతి ఇంటికి ఒక పిల్లిని ఇద్దాం అని నిర్ణయానికి వచ్చాడు…
వెంటనే రాయల వారి సలహాదారుల్లో ఒక తిక్క నా కొడుకు ఉండి ..అయ్యా ఒట్టి పిల్లులు ఇస్తే ఎలా వాటి పోషణ భారం అవుతుంది కాబట్టి,  పిల్లులు సంరక్షణ కోసం ఇంటింటికీ పాలు కూడా అందించాలి అన్నాడు.
వెంటనే ఇంకో తిక్క సలహాదారుడు ఇంటింటికీ పాలు పోయటం కష్టం అవుతుంది కాబట్టి ఇంటింటికీ ఒక పాడి గేదెను ఇద్దాం అన్నాడట. రాజుకి నచ్చేసి తలూపాడు.అన్ని ఇళ్లకు పిల్లి ,పిల్లి పాల కోసం ఒక గేదే పంపిణీ అయిపొయింది.అలా తెనాలి రామకృష్ణ కు ఒక పిల్లి ఒక గేదె ఇచ్చారు.

తెనాలి వారు పిల్లిని తీసుకెళ్లిన మొదటి రోజు పాలను బాగా మరగబెట్టి పిల్లి ముందు పెట్టాడు.పాలు చూసి కక్కుర్తి పడ్డ పిల్లి మూతి పాలలో పెట్టి నాలుక కాల్చుకుంది.ఆ రోజు నుండి పాలు చూస్తే చాలు పిల్లి పరుగో పరుగు.
నెల రోజుల తరువాత రాయల వారికి ఎలుకల బెడద తగ్గిందా లేదా తెలుసుకోవాలని అనిపించి పిల్లులను తీసుకురండి వాటిని చూసి మనం మన పని ఫలితం చూద్దాం అన్నారట.

వెంటనే పిల్లుల పరిశీలన మొదలైంది…
అందరి పిల్లులు ఒక్కొక్కటి తెచ్చి చూపిస్తూ ఉన్నారు.ఒక్కో పిల్లినీ చూసి రాయలు సంతృప్తి చెందుతూ ఉన్నారు.కారణం ఒక్కో పిల్లి బాగా బలిసి ఉంది. చివరగా తెనాలి రామకృష్ణ వంతు వచ్చింది.ఆయన మాత్రం తన పిల్లిని తీసుకు రాలేదు. రాయల వారు కోపంగా ఏం రామకృష్ణ… నా ఆదేశాలను పాటించవా నువ్వు అని కోపంగా మందలిస్తూ ఉంటే.. అయ్యా క్షమించాలి ఇక్కడ అందరి పిల్లులు బలంగా ఉన్నాయి.అదేంటో తెలియదు నా పిల్లికి పాలు చూస్తే పడదు.దూరంగా వెళ్ళిపోతుంది.అందుకే అది బక్కగా ఉంది.మీరు కొప్పడతారు అని తీసుకు రాలేదు అని చెప్పాడు.

ఏంటి పిల్లి పాలు తాగకపోవటమా ? వింతగా ఉందే అయితే ఆ పిల్లిని చూడాల్సిందే తీసుకు రా టెస్ట్ చేద్దాం అని చెప్పాడు. పిల్లిని తెచ్చి సభా మధ్యలో పెట్టి పాల కుండ మూత తీశాడు.పాలను చూడగానే పిల్లి పరుగో పరుగు.ఆశ్చర్య పోయాడు రాయల వారు.చూచాయగా అర్థం అయింది ఎందుకు ఇలా చేశావు అంటే అప్పుడు చెప్పాడు అంట తెనాలి.
అయ్యా పిల్లి లక్షణం ఎలుకను వేటాడటం.పిల్లి ఎప్పుడు వెంటాడుతుంది దానికి ఆకలి వేసినప్పుడు.మీరు దానికి ఆకలి వేయకుండా పాలు కూడా పోస్తున్నారు ఇక అది ఏం వెంటాడుతుంది కడుపు నింపుకుని నిద్ర పోవటం తప్ప.అందుకే ఆ విషయం మీకు తెలియ జేయటం కోసం ఇలా చేశాను క్షమించండి అని వేడుకున్నాడు.
తన తప్పు తెలుసుకున్న రాయల వారు తప్పును సరిద్దుకున్నారు. గేదె లను వెనక్కి తీసుకుని ఎలుకలు లేకుండా చేయగలిగారు….
అలానే చెత్త సలహాలు ఇచ్చే వాళ్ళ డొల్లతనాన్ని బయట పడేసే లాగా ఇప్పుడు ఒక తెనాలి లాంటి వారు ప్రభుత్వాలకు అవసరం…. ఇప్పుడు దేశంలో  జనం సొమ్మును పప్పుబెల్లాల మాదిరిగా పంచుతున్న పాలకులు, వారిని అనుసరిస్తున్న రాష్ట్ర సారథులకు ఈ కథ కనువిప్పు కావాలి. కృష్ణదేవరాయలు కాబట్టి, తాను చేసిన తప్పేమిటో తెలుసుకుని సరిదిద్దుకున్నారు. మరి అంత తెలివి మన పాలకులకు ఉందా?
ఈ కథ.. మన పాలకులకు… వారి సలహాదారులకు అంకితం! క్రైమ్ సినిమాల మాదిరిగా.. ఈ కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు. పాత్రలు కేవలం కల్పితం అని డిక్లరేషన్ మాత్రం ఇవ్వదలచుకోలేదు.