ఈ సంక్షోభం.. మనకెంత?

428

వచ్చే నెల కోసం సరకులు తెచ్చేశాం..
వచ్చే ఏడాది కోసం ఆవకాయ పెట్టేశాం..
వచ్చే పుట్టినరోజు కోసం బట్టలు కొనిపెట్టేశాం
వచ్చే మాఘంలో పెళ్లికి సంబంధం కుదిర్చేశాం..

ఇన్నిరకాల భవిష్యత్ కార్యక్రమాలకు ప్రణాళిక వేసినవాళ్లం..
రేపు బతుకుతామో లేదోనని భయపడటమేమిటో!!

అనేక రకాల మహమ్మారులు వస్తూనే ఉంటాయి.. పోతూనే ఉంటాయి..
తరతరాలుగా.. మానవ మనుగడ సాగుతూనే ఉంది..

కొంతమంది అనుకుంటున్నారు.. ఏమిటీ పెను ఉత్పాతం.. మా జీవితాల్లోనే ఎందుకు తొంగి చూస్తోంది.. అని. పాత రోజులే నయం ఇలాంటి దారుణాలు, విపత్కర పరిస్థితులు లేకుండా జనమంతా హాయిగా బతికేవారు అని.

మరి ఓసారి గతంలోకి తొంగి చూద్దామా?

మనం ఇప్పుడు కాకుండా ఓ వందేళ్ల క్రితం పుట్టాం అనుకుందాం.. ఫర్ సపోజ్ 1900 సంవత్సరంలో పుట్టామే అనుకుందాం..
అప్పటి మనుషులకు ఎలాంటి విపత్తులు లేవంటారా?
ఎలాంటి గడ్డురోజులూ ఎదుర్కోలేదంటారా?

ఒకవేళ మనం 1900 సంవత్సరంలో పుట్టి ఉంటే.. ఎలాంటి ఉత్పాతాలను చూడాల్సి వచ్చేదో ఒకసారి పరిశీలిద్దామా..

1905లో భూకంపం విరుచుకుపడడంతో 20,000 మంది చనిపోయారు.

1907లో అంటువ్యాధులు దండెత్తాయి. దేశ వ్యాప్తంగా 13,00,000 చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా సంక్రమించిన  స్పానిష్  ఫ్లూలో భాగంగా 1918-1920 మధ్య కాలంలో భారతదేశంలో  ప్రాణాంతకమైన ఫ్లూ మహమ్మారి ప్రబలి అసాధారణ రీతిలో ప్రజలను బలిగొంది. ఈ మహమ్మారి కారణంగా దేశ జనాభాలో సుమారు 5 శాతం మంది తుడిచిపెట్టుకుపోయారు. భారతదేశంలో ఈ అంటువ్యాధిని బాంబే ఇన్‌ఫ్లూయెంజా లేదా బొంబాయి ఫీవర్‌గా పిలిచేవారు. ఈ మహమ్మారి భారతదేశంలో సుమారు 1.4 నుంచి 1.7 కోట్ల వరకు ప్రాణాలను పొట్టనపెట్టుకొన్నదని అంచనా.  ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇంత భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోలేదని భావిస్తారు.

1924లో అంటువ్యాధుల కారణంగా 3,00,000 మంది జనం రాలిపోయారు. 1926 మరోసారి అంటువ్యాధులు దండెత్తడంతో  4,23,000 మంది చనిపోయారు.

1935లో తుపాను ముంచుకొచ్చి 60,000 మంది చనిపోయారు. అదే సంవత్సరం వచ్చిన భూకంపానికి 56,000 మంది మృతిచెందారు.

1942-43లో తుపానుకు 40,000 మంది బలయ్యారు. ఇదే సంవత్సరం దారుణమైన కరవు కారణంగా 15,00,000 మంది రాలిపోయారు. అప్పటి మూడేళ్లుగా ప్రపంచ యుద్ధం జరుగుతుండడంతో బ్రిటిష్ సర్కారు కరవు మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఎవరిచావుకు వాళ్లను వదిలేసింది. ఊరూరా జమిందార్లు, మోతుబరుల వంటివారే అంబలి కేంద్రాలు ఏర్పాటుచేసేవారు. డొక్కల కరవు అనేవారు దీనిని. ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతోంది. జపాన్ బర్మాను ఆక్రమించిన కాలమది. బెంగాల్ ప్రావిన్స్‌లో (నేటి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ఒడిశా, బిహార్ కలిసిన ప్రాంతం) వాటిల్లిన తీవ్రమైన కరవు లక్షలమందిని బలి తీసుకుంది. ఆకలి చావులు, పోషకాల లోపం, చుట్టుముట్టిన రోగాల వల్ల 6 కోట్ల బెంగాల్ జనాభాలో, దాదాపుగా 30 లక్షల మంది మరణించారు. వారిలో దాదాపు సగం మంది ఆహారం లభించక వచ్చిన జబ్బుల వల్ల మరణించారు. కరవు కాలంలో ప్రజలు తమవద్ద ఉన్న కాసిని పైసల్ని కూడా ఆహార ధాన్యాలకే ఖర్చుచేయడంతో, చేతివృత్తులు, చిరువ్యాపారాల వారికి ఉపాధి లేకుండాపోయింది. దాంతో వారు పూర్తిగా కరువు పాలబడ్డారు. కరువు సామాజిక, ఆర్థిక విధ్వంసానికి కూడా కారణమైంది, లక్షలాది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. అప్పటికే ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో ఉంది. జనం తిండి గింజలకు మొహం వాచిపోయిన పరిస్థితి. ఇలాంటి వార్తలు వెలుగుచూడకుండా  బ్రిటిష్ అధికారులు సెన్సార్‌షిప్‌ విధించారు.

ఆంధ్రదేశాన్ని కూడా కరవు గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో ఒకటిన్నర కోట్లమంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెబుతాయి. ఈ కరవులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభై లక్షల మంది బలయ్యారు. ప్రాణ నష్టమే కాదు పశువులు, విత్తనాలూ నష్టమయ్యేవి. రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మళ్లీ కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తరచూ కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొలదీ సన్నకారు రైతులు, కూలీలు సుదూరమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయారు.

మధ్యలో స్వాతంత్య్ర పోరాటం..
బ్రిటిష్ పాలకుల అణచివేత.. స్వాతంత్య్రానంతరం దేశ విభజన సందర్భంగా తలెత్తిన మత కల్లోల్లాలు..

1965లో మరోసారి కరవు ముంచెత్తి 5,00,000 మంది మృతిచెందారు. 5 కోట్లమంది జనాభా తిండి లేక అల్లాడిపోయారు.

1966లో కరవుకు మరో 5,00,000 మంది చనిపోయారు. 5 కోట్లమంది జనాభా అల్లాడిపోయారు.

1967లో మళ్లీ కరవు… మరో 5,00,000 మంది బలి

1971 తుపానుకు 7,600 మంది చనిపోగా 2 కోట్లమంది బాధితులుగా మిగిలారు.

1977 దివిసీమ ఉప్పెనకు 14,204 మంది బలయ్యారు. 90,37,408 మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాని కారణంగా ఇబ్బంది పడ్డారు. ఈ తుపాను కృష్ణా డెల్టా ప్రాంతంపై అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపింది. కృష్ణా జిల్లా లోని దివిసీమలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి. తుపాను తర్వాత వందలాది శవాలు నీళ్ళలో తేలుతూ కనిపించాయి. గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్న అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చింది.

1996 కోనసీమ తుపానుకు 9,843 మంది మృతిచెందగా 1,26,25,000 మంది బాధితులుగా మిగిలారు. 5,97,510 ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయి. 2 లక్షల 33 వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. దాదాపు 2,27000 హెక్టార్ల చేతికొచ్చిన వరి పంట పోయింది. 40 వేలకు పైనా ఇళ్లు నేలమట్టం అయిపోయాయి. మానవ మనుగడలో ఓ వందేళ్లల్లో కొద్దీ ప్రాంతంలో మనం  తడిమి చూసిన చాలా కొన్ని ఉపద్రవాలు ఇవి..

ఇలా ఎన్నో ప్రకృతి సంబంధమైన ఉత్పాతాలను, మానవ సంబంధమైన తప్పిదాల కారణంగా తలెత్తిన సంక్షోభాలను ఎదుర్కొని నిలబడ్డారు మన ముందు తరాలవారు. డొక్కలు ఎండిపోయి ఎముల గూడుల్లా మార్చేసిన కరవును, బ్రిటిష్ పాలనలోని అణచివేతలను, థక్కులు, పిండారీల వంటి దోపిడీదారులను, మధ్య యుగాలనాటి దండయాత్రలను, రోగాలను రోష్టులను.. కలరా, మశూచి, ప్లేగు వంటి అంటువ్యాధులను గత్తర వ్యాధులను ఎదుర్కొంటూనే అలోలక్షణా అని బతుకుపోరాటం సాగిస్తూనే జీవనంసాగించారే తప్ప భయపడి పిరికితనంగా పారిపోలేదు.. అప్పుడే ఏ నూతిలోనో పడి ఆత్మహత్యలకు పాల్పడలేదు.

యుద్ధ సంక్షోభాలను, తరిమివేతలను, అంటరానితనాన్ని, అగ్రవర్ణాల దౌర్జన్యాలను, అణచివేతను, మూఢ నమ్మకాలను, మత మౌఢ్యాలను, పరాయి పాలకుల నిర్బంధాన్ని.. స్వపరిపాలనలోని అవినీతిని.. తిండికీ బట్టకూ కూడా రేషన్ విధానాన్ని.. మందు మాకుల కోసం చెట్లమ్మట, పుట్లమ్మట తిరగాల్సిన పరిస్థితుల్ని, మంత్రాలకు చింతకాయలు రాలుతాయనే మూఢనమ్మకాలను.. ఇలా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు.

ఇప్పటి మన సమస్య ఏమిటంటే.. కాస్త నలతగా అనిపించగానే ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నామని..  ముందు జాగ్రత్తగా బెడ్ బుక్ చేసుకుందాం అనుకుంటే  దొరకడంలేదని.. దొరికినా ఆక్సిజన్ ఉండదేమోనని అనుమానం.. ఆక్సిజన్  కన్సన్‌ట్రేషన్ కొని పెట్టుకుందామంటే (అవసరం లేకున్నా సరే) మార్కెట్లో దొరడంలేదని.. రూ. 1,300 చేసే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ముందు జాగ్రత్తగా కొని పెట్టుకుందామంటే బ్లాకులో పాతిక వేలు చెప్పాడని.. దిక్కుమాలిన మాస్కు పెట్టుకోకపోతే వెయ్యి రూపాయలు జరిమానా వేస్తున్నారని..

కొవిడ్ మీద ఫేస్‌బుక్‌లో పోస్టు పెడితే పాతిక లైకులన్నా రాలేదని.. వైఫై సరిగా పనిచేయడంలేదని.. ఆఫీసులో సిగ్నల్స్ రావడంలేదని..

ఇవే కదా చాలామంది సమస్యలు!!

ప్రస్తుతం మన దేశ జనాభా 136 కోట్లు. అందులో కొవిడ్ సోకిన వారి సంఖ్య ప్రస్తుతానికి 2 కోట్లు మాత్రమే. మృతుల సంఖ్య కూడా 2 లక్షలు. ఇంత పెద్ద జనాభాతో పోల్చి చూస్తే ఈ అంకెలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి కదా. మరణాల శాతం కేవలం 1.5 నుంచి 1.8 మాత్రమే. అంటే నూరుమందికి కరోనా వస్తే ఇద్దరికి మాత్రమే ప్రాణాంతకమవుతోంది.

ఇప్పుడు చెప్పండి.. మనం ఎదుర్కొంటున్న కరోనా వాటన్నింటికన్నా భయంకరమైన సంక్షోభం అంటారా? చిన్న మాస్కు మూతికి అడ్డంగా కట్టుకుంటే అది చొరబడదు కదా.. చేతుల్ని పదిసార్లు కడుక్కుంటే పోతుంది అంటున్నారు కదా.. అది కూడా నెలా రెండు నెలల్లో సమసిపోతుందని చెబుతున్నారు కదా.. త్వరలోనే అందరికీ టీకా కూడా అందుబాటులోకి రానుంది కదా. ఇంకా భయమేంటో మరి.

– కరి పూర్ణచంద్రరావు