కొవిడ్ వారియర్స్ తో చంద్రబాబు నాయుడు వర్చువల్ సమావేశం

726

సంపూర్ణ వ్యాక్సినేషన్ తోనే కరోనా అదుపు సాధ్యం
– టీడీపీ జాతీయ అధ్యక్షులు  చంద్రబాబు నాయుడు

డాక్టర్లు విలువైన సలహాలు, సూచనలు  ఇచ్చారు. ఆస్ట్రేలియా, అమెరికా నుంచి పలువురు డాక్టర్లు మాట్లాడారు. ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తేనే వైరస్ కట్టడి సాధ్యం. సమస్యను అర్ధం చేసుకుని చర్యలు తీసుకోవాలి. టెక్నాలజీలో ప్రపంచంలోనే మనం ముందున్నాం. ఆ టెక్నాలజీని సరిగా ఉపయోగించుకోవాలి. మనకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలి. కరోనా పెద్ద విపత్తు. ఎవరూ వైరస్ ను ఊహించలేదు. కొన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి.ఆర్థికంగా, మానసికంగా దెబ్బతింటున్నారు. ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన వారికి కఠినంగా ప్రోటోకాల్ అమలు చేస్తున్నారు. వేవ్ త్రీ కూడా వస్తుందంటున్నారు. ఏ స్ట్రెయిన్ ఎలా , ఎంత తీవ్రతతో వస్తుందనేది వచ్చాకే తెలుస్తుంది. 60, 70 ఏళ్ల వారు వ్యాక్సన్ వేసుకోవాలి. పలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా వ్యాక్సన్ వేసుకోవాలి.

సెకండ్ వేవ్ లో 45 లోపు  వారికి వైరస్ ఎక్కువగా వస్తోంది. ప్రభుత్వాలను హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్నాయి. నా సర్వీస్ లో నేను ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నాను. ప్రతిపక్ష నేతగా సాధ్యమైనంతవరకూ సాయం చేస్తున్నాం. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి తోడ్పాటు అందిస్తున్నారు. వీలైనంతమందికి సాయం చేయాలి. మనల్ని మనం కాపాడుకుంటూనే తోటివారికి సాయం చేయాలి.సమాజం మనందరికీ గుర్తింపు ఇచ్చింది. సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా మెలిగి అందర్నీ ఆదుకుందాం. ఒక్కోసారి మనం నిమిత్తమాత్రులమవుతున్నాం. ఏం చేయలేకపోయానే అనిపిస్తుంది. మనకళ్లముందే చనిపోయిన వారిని చూస్తే తట్టుకోలేని పరిస్థితి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైద్యులు తోచినంత సాయం చేయాలి. సమస్యలను అధిగమించేందుకు కలిసికట్టుగా పోరాడుదాం. వైద్యులు ఇచ్చిన సూచనలు అమలు చేసేందుకు నేనూ, ఎన్టీఆర్ ట్రస్ట్ కృషి చేస్తాం.

ఆంధ్రపదేశ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడలేదు. పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు చేపట్టాల్సి ఉంది. కరోనాను ఎదుర్కోవడం వ్యాక్సినేషన్ మాత్రమే సాధ్యం. ప్రభుత్వం అనవరమైన వాటికోసం వేలకోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తోంది. కరోనా నియంత్రణలో కీలకమైన వ్యాక్సిన్ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. కేంద్రం ఇప్పటికే 45సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తోంది. 18-45 సంవత్సరాల మధ్య వయస్కులు రాష్ట్రంలో 2.04కోట్ల మంది ఉన్నారు. వారికి 4.08కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం. ఇందుకోసం 1600 కోట్లరూపాయలు వెచ్చిస్తే పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాల్సి ఉంది.

డాక్టర్ ఈశ్వర్:
సెకండ్ వేవ్ లో కొవిడ్ ఇంట్లోనే వ్యాప్తి చెందుతోంది. మాస్కు పెట్టుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఇంట్లో ఉన్నా కూడా భౌతికదూరం పాటించాలి. పరిశుభ్రత పాటించాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. పడుకునే ఊపిరి తీసుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి. సెకండ్ వేవ్ లో లక్షణాలు కూడా తెలియడంలేదు . మనకు కరోనా వచ్చిందని తెలిసే లోపే చుట్టుపక్కల వారికి అంటుకుంటుంది.  కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి.

డాక్టర్ శ్రీధర్ :
కరోనా ఉధృతి తగ్గాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడమే మార్గం. మనం మాస్కు పెట్టుకోవడమే కాకుండా ఎదుటి వారు కూడా మాస్కు పెట్టుకునేలా చేయాలి. కరోనా పేషెంట్ మాస్కు పెట్టుకోకుండా మీరు పెట్టుకున్నా 70 శాతం కరోనా వచ్చే అవకాశం ఉంది. మన దగ్గరకు ఎవరు వస్తున్నా మాస్కు పెట్టుకోవాలి. మొహం వీలైనంత వరకూ కవర్ అయ్యేలా మాస్కు ఉండాలి. కరోనా మొదటి దశలో బయట వచ్చింది. సెకండ్ వేవ్ లో ఇళ్లలో వస్తోంది. కరోనా మొదటి దశలో 10 కుటుంబసభ్యులుంటే ఒకరికే వచ్చింది. సెకండ్ వేవ్ లో కుటుంబాలన్నీ ప్రభావితమవుతున్నాయి. రెండు నెలల క్రితం స్కూళ్లు మొదలయ్యాయి. పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. కరోనా ఇంతలా వ్యాపించడానికి స్కూళ్లు తెరవడం కూడా కారణం. ఏసీ రూముల్లో పిల్లలు మాస్కు తీయడం వల్ల వ్యాప్తి చెందింది. మాస్కు లేకుండా ఎవరితోనైనా మాట్లాడితే డేంజరే. పిల్లల నుంచి కరోనా వ్యాప్తికి లంచ్ బ్రేక్ ప్రధాన కారణం. కరోనాతో చనిపోయిన వారిని చూసి ఏడుస్తారు. ఆ టైంలో కరోనా వ్యాప్తి జరుగుతోంది. నోరు ఎక్కువగా తెరవడం వల్ల కూడా వైరస్ విజృంభిస్తోంది. వీలైనంత వరకూ తక్కువగా మాట్లాడాలి. ఎప్పుడైతే మనం ఏమరపాటుగా ఉంటామో అప్పుడు కరోనా వచ్చేస్తుంది. ప్రయాణాలను వీలైనంత వరకూ వాయిదా వేసుకోవాలి. వ్యాక్సిన్ కేంద్రాల్లో భౌతిక దూరం పాటించకుండా జనం క్యూ కడుతున్నారు. వ్యాక్సిన్ కేంద్రాలు కరోనా హాట్ స్పాట్ గా మారుతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు. రెండు,మూడు గంటలు అక్కడే కూర్చుంటున్నారు. అదీ కరోనా వ్యాప్తికి కారణం. ప్రతిఒక్కరూ తమకు కరోనా వచ్చిందనుకుని రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి. కరోనా వచ్చిందనే అనుమానంతో మిగిలిన వారు ఆ ఇంట్లోనే ఉండాలి. బంధువుల ఇంటికి పంపొద్దు. ప్రతిఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి.

డాక్టర్ సురేష్:
కొవిడ్ రాగానే సిటీ స్కాన్ చేయిస్తున్నారు. దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కేవలం డబ్బు వదిలించుకోవడమే. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉండి నాలుగు రోజులు గడిచినా వారికి జ్వరం తగ్గకపోతే అప్పుడు సిటీ స్కాన్ చేయించుకోవాలి. ఆర్టీపీసీఆర్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ వస్తే సిటీ స్కాన్ అవసరం లేదు.  ఆక్సిజన్ 95 పైన ఉంటే సిటీ స్కాన్ అవసరం లేదు.  ఆర్టీపీసీఆర్ చేయించుకున్న వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి సిటీ స్కాన్ అడుగుతారు. దానివల్ల ఉపయోగం లేదు. సెకండ్ వేవ్ లో 40 ఏళ్ల వారు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు.

డాక్టర్ లోకేశ్వర రావు:
ప్రతి డాక్టర్ రోగికి సీఆర్ పీ చేయాలి.  ఆస్పత్రుల్లో బెడ్లు లేవు. హోం ఐసోలేషన్ లో జాగ్రత్తలు తీసుకోవాలి.

డాక్టర్ శ్రీకాంత్ మిరియాల:
కరోనా వల్ల మానసిక సమస్యలు పెరిగాయి. దాని నుంచి బయట పడాలంటే ఇతర అంశాలపై దృష్టి పెట్టాలి. ఇంట్లో ఉన్నప్పుడు కొత్తవి నేర్చుకోవాలి. ఉదాహరణకు యోగా, సంగీతం వంటివి ట్రై చేయడం వల్ల మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ ఉండాలి. శారీరక శ్రమ లేకపోతే మానసిక ఆరోగ్యం ఉండదు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కేసులు పెరగడకుండా ఉండేందుకు లాక్ డౌన్ విధించారు. కరోనా వల్ల వచ్చే ప్రమాదాన్ని అందుబాటులో ఉన్న అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువేశారు. ప్రజల్లో మార్పును తీసుకురాగలిగారు.

డాక్టర్ ధర్మేంద్ర:
ప్రతి ఒక్కరికీ ఐసీయూ ట్రీట్ మెంట్  అవసరం లేదు. సంబంధిత రోగి వయసు, కిడ్నీ, లంగ్, హార్ట్ సమస్యలను బట్టి ఐసీయూ ట్రీట్ మెంట్ ఇస్తాం. ఆక్సిజన్ లెవల్స్ 90 లోపు ఉంటేనే తప్పించి వారికి ఐసీయూ ట్రీట్ మెంట్ అవసరం లేదు. ఒకసారి ఐసీయూలోకి వెళ్లిన డాక్టర్ బయటకు రావడం అంత సులువు కాదు. డిశ్చార్జ్ తర్వాత మందులు వేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం.

డాక్టర్ గోపీచంద్:
కరోనా వైరస్ మాత్రమే కాదు ఎన్నో వైరస్ లను మనం ఫేస్ చేస్తూ ఉంటాము. చాలా వైరస్ లను మనం జయించాం. ప్రపంచంలో ఎన్నో జబ్బులున్నాయి. వాటిని మనం గెలుస్తున్నాం. ఇంట్లో ఉండి భయపడుతూ కాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవాలి. కంగారు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫిట్ గా ఉంటేనే రాబోయే వేవ్స్ ను ఎదుర్కోగలము. ఆస్పత్రిలో చేరేప్పుడు టెన్షన్ తో జాయిన్ అవుతున్నారు. చుట్టూ ఉన్నవారంతా అదోలా కనిపిస్తున్నారు. ఉదయం లేచేసరికి పక్క బెడ్ లో రోగి మారిపోతున్నాడు. బిల్ చూసి కోపంతో డిశ్చార్జ్ అవుతున్నాడు. డిజిటల్ విజిటింగ్ అవర్స్ అనే సిస్టమ్స్ ను పెట్టాలి. ఆస్పత్రికి రాలేకపోయినా మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు . కరోనా రోగిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించవచ్చు. ధైర్యం చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల రోగికి కొండంత ధైర్యం వస్తుంది.  రోజులో కాసేపు మీకంటూ కొంత సమయం కేటాయించుకోండి. రూముల్లో వెలుతురు దారాళంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

డాక్టర్ రఘుతేజ:
కోరాడ్స్ వన్ అంటే మీకు కొవిడ్ ఉందా లేదా అని అర్ధం. కోరాడ్స్ 2 అంటే మిగిలిన వ్యాధుల లక్షణాలు. కోరాడ్స్ 3 అంటే లక్షణాలు మిక్స్ అయ్యి ఉండటం. కోరాడ్స్ 4 అంటే 90 శాతం కొవిడ్ ఉన్నట్టు. కోరాడ్స్ 5 అంటే కరోనా ఉన్నట్టే. సిటీ స్కాన్ ఉపయోగం నాలుగు రకాలుగా ఉంటుంది.

బుచ్చిరాం ప్రసాద్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి:
కరోనా బాధితులకు చేతనైనంత సాయం చేస్తున్నాం. ఆలపాటి రాజా గారి కుమార్తె , డాక్టర్ లోకేశ్వర రావు గారు బాధితులకు సాయం చేస్తున్నారు.

డాక్టర్ బాలాజీ:
నేను కేరళలో డాక్టర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ రాష్ట్ర, జిల్లా స్థాయిలో వార్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఎవరూ ఆక్సిజన్ తో చనిపోయిన ఘటనలు లేవు. సెకండ్ వేవ్ లో కరోనా లక్షణాలు తెలీడంలేదు. శరీరం నీరసంగా ఉన్నా కూడా కరోనా కింద భావించాల్సిందే. చిన్న లక్షణం కనిపించినా వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. అలాగని సిటీ స్కాన్ కు వెళ్లకూడదు. కుటుంబసభ్యులు  ఎవరికి వచ్చినా మిగిలిన వారు జాగ్రత్తగా ఉండాలి.