సోము వీర్రాజు రాజీనామా?

1513

( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోము రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయిన నాటి నుంచి.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వరకూ అన్ని ఎన్నికల్లోనూ పార్టీకి, వరస వెంట పరాజయాలే ఎదురయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో 30 శాతం కూడా పోటీ చేసే పరిస్థితి లేకపోగా, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని వార్డుల్లోనూ పోటీ చేసేంత సంఖ్యలో అభ్యర్ధులను నిలబెట్టలేకపోయారన్న విమర్శలు గత కొద్దికాలం నుంచీ వెల్లువెత్తుతున్నాయి. చివరకు తన రాజమండ్రి నియోజకవర్గంలో కూడా, సొంత పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోలేకయారన్న విమర్శలను మూటకట్టుకోవలసి వచ్చింది. విచిత్రంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సోము వీర్రాజు సొంత నియోజకవర్గంలోనే.. టీడీపీ-జనసేన-బీజేపీ కలసి ఎన్నికల ప్రచారం చేసిన వైనంతో, ఆయన పరిస్థితి పార్టీలో మరింత బలహీనపడినట్టయింది.

పైగా, సోము వీర్రాజు నాయకత్వ పగ్గాలు తీసుకున్న తర్వాత,  అధికార వైసీపీ ప్రభుత్వంపై సమర్థవంతంగా పోరాటం చేయలేకపోతున్నారన్న ఫిర్యాదులు జాతీయ నాయకత్వానికి వెళ్లాయి. ఇటీవల కోవిడ్ నియంత్రణ అంశంలో సీఎం జగన్‌ను చూసి ప్రధాని సహా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకుంటున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేసినప్పటికీ, ప్రెస్‌మీట్‌లో దానిని వీర్రాజు కనీసం ఖండించని విషయాన్ని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని బీజేపీని కరోనా వైరస్ కంటే ప్రమాదకారి అని విమర్శించినా ఖండించలేదని గుర్తు చేశారు.

తిరుపతి లోక్‌సభ ఎన్నికలో విజయం సాధించి, దానిని మోదీకి కానుకగా ఇస్తామని చెప్పిన వీర్రాజు, ప్రచారంలో పెద్దగా క్రియాశీల పాత్ర పోషించలేదన్న ఫిర్యాదులు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ప్రధానంగా.. దొంగఓటు కార్డులను ముద్రించిన విషయం ముందే తెలిసినప్పటికీ, దానిపై రాజకీయ పోరాటం చేయడంలో సోము విఫలమయ్యారని, అటు అధిష్ఠానం కూడా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలో సోము వీర్రాజు, కో ఇన్చార్జి సునీల్ దియోథర్ ఇద్దరూ రాష్ట్ర- జిల్లా స్థాయి నేతలను సమన్వయం చేయడంలో విఫలమయ్యారన్న ఫిర్యాదులు ఎన్నికల సమయంలోనే వెళ్లినట్లు తెలుస్తోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ తర్వాత, ఓడిన రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను ఢిల్లీకి పిలిపించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు తన సారథ్యంలో జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ, అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనిపై పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. పైగా అన్ని నిర్ణయాలను నలుగురైదుగురికే పరిమితం చేయడంతో,  అటు ఏపీకి చెందిన ఎంపీలు కూడా నాయకత్వంపై ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేసిన విషయం తెలిసిందే. కేవలం ఐదుగురు మాత్రమే పార్టీని నడిపిస్తున్నారన్న ఫిర్యాదులు ఇప్పటికే నాయకత్వానికి చేరాయి. ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక ఆశ్రమ వివాదం, చీమకుర్తిలోగ్రానైట్, గోదావరి జిల్లాలో ఇసుక రీచ్‌ను అధికార పార్టీ ఓ రాష్ట్ర పార్టీ ప్రముఖుడికి అనధికారంగా ఇచ్చిందన్న  ఫిర్యాదు కూడా,  నాయకత్వం దృష్టికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ రాష్ట్ర పార్టీలో దుమారం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ ఒత్తిళ్లకు తోడు ఆయన ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించకపోయినప్పటికీ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోము అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత పార్టీ పెద్దగా విస్తరించకపోయినా, రోజూ మీడియాలో ఉండటంలో మాత్రం విజయం సాధించిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తుంటాయి.  ‘నైతిక బాధ్యత-విలువలు పాటించని ఈ కాలంలో మా అధ్యక్షుడు వాటిని పాటించడం  గర్వకారణమే. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయబోతున్నారన్న వార్తలు, రెండు మూడురోజుల నుంచి మేం కూడా వింటున్నాం. దానిపై పార్టీలో చర్చ జరుగుతున్న మాట నిజమే. ఏదేమైనా మా జిల్లాకు చెందిన నాయకుడికి ఏడాదికిపైగా  అధ్యక్ష పదవి ఇచ్చినందుకు నాయకత్వానికి కృతజ్ఞతల’ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ బీజేపీ నేత వ్యాఖ్యానించారు.