కోవిడ్ మూడో దశ రాబోతోంది.. :కేంద్ర ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌

313

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో కరోనా వైరస్‌ మూడో దశ రాబోతోందని, దానిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ కె. విజయరాఘవన్‌ అన్నారు. దేశంలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశంలో కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ అనివార్యమైంది.. అని ఆయన అన్నారు.ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయరాఘవన్‌ మాట్లాడారు. కరోనా మూడో దశ అనివార్యం. ఈ మూడో దశ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం వేరియంట్‌లకు వ్యతిరేకంగా టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా కొత్త వేరియంట్లు నమోదవుతున్నాయి. ఇవి వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతాయని ఆయన అన్నారు. రోగనిరోధకాలు వ్యాధి తీవ్రతను తగ్గించేవిగా లేదా పెంచేవిగా మారే అవకాశం ఉందన్నారు. దీంతో థర్ఢ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి అని ఆయన సూచించారు.