‘కరోనా’ మృతులపై తిరుపతి ఎమ్మెల్యే ‘కరుణ’

292

అంతిమ సంస్కారాల్లో అంతా తానై…
( మార్తి సుబ్రహ్మణ్యం)

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనని సూత్రీకరించిన కామ్రేడ్  కార్ల్ మార్క్స్ బతికుంటే.. తన సిద్ధాంతాన్ని తిరుపతి శ్మశానవాటికలో బుధవారం జరిగిన,  కరోనా బాధితుల అంతిమ సంస్కారాల తీరు చూసి కచ్చితంగా మార్చుకునేవారు. కరోనా కబళించిన తమ వారిని చూసేందుకే కుటుంబసభ్యులు భయపడుతున్నారు. శవాలను ఆసుపత్రి నుంచి నేరుగా శ్మశానానికే తీసుకువెళుతుంటే.. చివరిచూపునకూ నోచుకోని దయనీయం. అసలు ఆసుపత్రిలో తమవారిని చూసేందుకే వీల్లేని దౌర్భాగ్యం. కరోనా వైరస్ సోకిన వారిని అల్లంతదూరంలోనే ఉండి, ఫోన్‌లోనే పలకరించి, అదే పదివేలనుకుంటున్న కాలమిది. వారి దగ్గరకు వెళితే, ఆ వైరస్ తమకూ సోకుతుందన్న ప్రాణభయం మరి! అలాంటి విషాద పరిస్థితిలో కుటుంబాలు కూడా వెంటరాని భౌతికకాయాలకు, తానే కుటుంబసభ్యుడిగా దగ్గరుండి మరీ దహన సంస్కారాలు చేయడానికి ధైర్యం ఒక్కటే చాలదు. విశాల హృదయం కూడా ఉండాలి. సామాజిక స్పృహ-బాధ్యత కావాలి. అంతకుమించి వారిలో మానవీయ కోణం ఉండాలి. అలాంటి అంతిమ ‘సంస్కారం’ ఉన్న వారిని, చరిత్ర తన హృదయంలో సమున్నత స్థానమిచ్చి గౌరవిస్తుంది. అలాంటి చరిత్రలో నిలిచిపోయిన నాయకుడే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.

కరోనా కల్లోల సమయంలో ఆసుపత్రుల్లో చేరిన వారు విగతజీవులుగా మారి, అటుంచి అటే శ్మశానవాటికకు చేరుతున్న దయనీయ పరిస్థితి సర్వత్రా దర్శనమిస్తోంది. భౌతిక కాయాల వెంట వచ్చే బంధులెవరూ లేరు. దహనసంస్కారాలు కానిచ్చే కావల్సినవారూ  కానరావడం లేదు. ఫలితంగా అన్నీ ఉన్నా ఎవరూ లేని అనాధలుగా మారి సర్కారీ చితిమంటల పాలవుతున్నారు. ఈ పరిస్థితిలో ఆ విగతజీవుల అంతిమ సంస్కారాలను, స్వయంగా తానే దగ్గరుండి మరీ నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మానవ సమాజానికి పంపిన సందేశం అభినందనీయం.

గత కొన్నిరోజులుగా తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనాకు బలయిన 21 మంది,  అనాధ ప్రేతల్లా అక్కడే మగ్గిపోతున్న వైనం ఆయన దృష్టికి వెళ్లింది. దానితో వాసన భరించలేని కుళ్లిన ఆ మృతదేహాలను సగౌరవరంగా హిందూ, ముస్లిం శ్మశానవాటికలకు  తీసుకువెళ్లారు.  కుటుంబ సభ్యుడి మాదిరిగానే వారి అంతిమయాత్రను ఘనంగా నిర్వహించారు. మత సంప్రదాయాలు పాటిస్తూ, మృతదేహాలకు పూలదండలు వేసి నివాళులర్పించి, అంతిమ సంస్కారాలు పూర్తి చేయడం మనసున్న అందరినీ కదిలించింది. కలచివేసింది. అది కదా మానవత్వం? అదే కదా మానవతత్వం? సొంత బంధువులే పాడె మోసేందుకు భయపడే ఈ కల్లోల సమయంలో, వారితో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా సామాజిక బాధ్యతతో అంతిమ సంస్కారాలు నిర్వహించిన భూమనను కఠిన పాషాణ హృదయులయినా అభినందించి తీరాల్సిందే.

ఆయన ఏ పార్టీకి చెందినవారయినా కావచ్చు. ఇంకా చెప్పాలంటే అనేక  ఆరోపణలూ ఉండి ఉండవచ్చు. రాజకీయాలే ఆయన శ్వాస, ఆశ కావచ్చు. ఆ క్రమంలో రాజకీయ ప్రత్యర్ధులూ ఉండొచ్చు. కానీ, ముఖ్యమంత్రులు, మంత్రులే కనీసం కోవిడ్ వార్డుల్లోకి తొంగిచూసే ధైర్యం చేయలేని ఈ కరోనా కాలంలో..ఆరుపదుల వయసులో అప్పటికే రెండుసార్లు కరోనా బారినపడినప్పటికీ, ప్రాణాలను పణంగా పెట్టి.. కరోనా సోకిన మృతదేహాలకు దగ్గరుండి అంతిమ సంస్కారాలు పూర్తి చేయడం ఎంతమందికి సాధ్యం? అంత సంస్కారం, అంత మానవీయ సంబంధాలు ఎంతమందికి సాధ్యం? ఒక్క  భూమనకు తప్ప! పోనీ.. ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇవన్నీ చేశారనుకున్నప్పటికీ, ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలూ లేవాయె! ఇలా కరోనా కబళించిన మృతదేహాలకు  అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆయనకు ఇదే తొలిసారి కాదు. కరోనా తొలి దశలోనూ 501 మృతదేహాలకు, వారి మత సంప్రదాయాల్లోనే అంతిమ సంస్కారాలు నిర్వహించిన మానవతావాది. దానికోసం ముస్లింలతో కలసి జేఏసీని కూడా ఏర్పాటుచేసి, అందరితో కలసి ఈ మహోన్నత కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. మానవత్వం మాట మరిచి..కేవలం  మానవ హక్కుల గురించి మాట్లాడే వారికి భూమన అడుగులు మార్గదర్శకమే. ప్రార్ధించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్న! కరుణాకర్‌ హ్యుమానిటీకి  హేట్సాఫ్!!