నరహంతక పాలనలో ….

547

( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

బెంగాల్‌లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది.. రవీంద్రనాధుడు పుట్టిన గడ్డ రక్తసిక్తమయింది.. దీదీ నరహంతక పాలనలో ప్రజాస్వామ్యానికి మానభంగం జరిగింది. ఓటుస్వామ్యం లూటీ ఫలితాలిచ్చాయి. ఆడవారి రెక్కలు విరిచిన గూండాగిరీ దేశ ప్రతిష్ఠను వెక్కిరించింది.. దేశ విభజన సమయంలో జరిగిన హింసాకాండను కొన్ని దశాబ్దాల తర్వాత తాజా బెంగాల్ మారణకాండ తలపించింది. 9 మంది అమాయకులను అమరపురికి పంపిన దీదీ నెత్తుటి సైన్యం, సామాన్యుల ఇళ్లను లూటీ చేసి, బెంగాలు చరిత్రను బంగాళాఖాతంలో కలిపింది.బెంగాల్‌లో గంటలపాటు నిర్నిరోథంగా జరుగుతున్న ఆటవిక దృశ్యాలు.. సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నా ఏ ఒక్క మానవహక్కుల మేధావీ గొంతు పెగలలేదు. సాటి మహిళలను వివస్త్రగా మార్చి, మానభంగం చేసి, అమానవీయంగా కుత్తుకలు కత్తిరించినా… టీవీల ముందు గొంతులు చించుకునే మహిళా సంఘాలు,  మేధావుల కంటి నుంచి చుక్కనీరు కారితే ఒట్టు.  బెంగాల్‌లో జరిగిన రాక్షసకాండను ఖండించి, దీదీ రాక్షస సైన్యం అరాచకాన్ని ముక్తకంఠంతో ఖండించాల్సిన రాజకీయ పార్టీల నోళ్లు మూసుకున్నాయి. ఇదీ మన భారతం!

బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ, బీజేపీ రాజకీయ కుయుక్తులను ఎదుర్కొని అఖండ విజయం సాధించింది. కానీ, నందిగ్రామ్‌లో బెంగాలీ దీదీ ఓడిపోయింది. అది ప్రజాస్వామ్యంలో సహజం. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి మహామహులే ఎన్నికల్లో మట్టి కరిచారు. కానీ, వారెవరూ తమ ఓటమికి కారకులయిన ప్రజలపై కక్ష సాధించలేదు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను భౌతికంగా కడతేల్చలేదు. పైగా తమపై విజయం సాధించిన వారిని,  స్వయంగా వెళ్లి అభినందనలు తెలిపిన ఘటనలున్నాయి. కానీ.. బెంగాల్‌లో పరిస్థితి అందుకు భిన్నం. ఎందుకంటే అక్కడుంది ఇందిర, ఎన్టీఆర్ కాదు.  మమతా బెనర్జీ! కర్నాటక సీఎంగా కుమారస్వామి పదవీ స్వీకార వేదిక వరకూ కారు అనుమతి లేదన్న సెక్యూరిటీపై కారాలు మిరియాలు నూరి.. విసవిసా వేదిక ఎక్కి అక్కడున్న దేవెగౌడ-కుమారస్వామిపై కన్నెర్ర చేసి, కపిగేసిన మమతా.. తాను పోటీ చేసిన చోట ఓడిపోతే మౌనంగా ఉంటారనుకోవడం మూర్ఖత్వం.

మమతాను చివరి వరకూ రాజకీయంగా వెంటాడి, వేధించిన బీజేపీ రాజకీయ ఎత్తులకు, ఆ పార్టీ సానుభూతిపరులు బలయిపోయారు. 20 సార్లు ప్రచారం చేసిన మోదీ, 40 సార్లు ప్రచారం చేసిన అమిత్‌షా అండ్ అదర్స్ చేయాల్సిందంతా చేసి,  నిక్షేపంగా ఢిల్లీకి వెళ్లారు. కానీ వారు రాజేసి వెళ్లిన మంట,  రెచ్చగొట్టిన ప్రసంగాలు, దీదీని వేధించిన ఫలితాన్ని,, ఆ రాష్ట్రంలో బీజేపీ జెండా మోసిన సామాన్య కార్యకర్తలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ భాజపా అధ్యక్షుడు నద్దా రెండు రోజుల పర్యటిస్తారట. అప్పుడేం జరుగుతుంది? మళ్లీ ప్రతీకార దాడులు. ఆ ఫలితం కూడా అనుభవించేది మళ్లీ జెండా మోసిన కార్యకర్తలే!

ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలిచినప్పటికీ, దానిని ఆస్వాదించలేని దీదీ నరహంతక సైన్యం.. సోమవారం సాగించిన దారుణ మారణకాండ, విభజన నాటి హింస కన్నా రెండింతలు ఎక్కువ. ఎన్నికల్లో భాజపాకు ప్రచారం చేసిన కార్యకర్తలను, పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కూర్చున్న నేతలను ఉరికించి మరీ హత్యచేసిన దీదీ నరహంతక సైన్యం చర్య.. బెంగాల్‌లో ప్రశ్నించేవారిని ఇకపై బతకనీయబోమన్న హెచ్చరిక సంకేతమే. ప్రజాస్వామ్య దేశంలో మళ్లీ నయా నాజీ, నిజాం, డయ్యర్, రజాకార్లు కొత్త రూపాలతో వస్తుండటం ప్రమాదకరం. ఇప్పుడు అలాంటి వారికి దీదీ వారసురాలిగా.. అంతకుమించి.. నాయకురాలిగా నిలిచేలా కనిపిస్తోంది. ఇదెక్కడికి దారితీస్తుందో?

బెంగాల్‌లో జరిగిన నరహంతక సంఘటనలు చూపించేందుకు, బాధితుల గోడు వినిపించేందుకు దేశంలోని మోతుబరి మీడియా సంస్థలకు సమయం, దమ్ము చాల్లేదు. ఎప్పుడూ మొరిగే… కుహనా సెక్యులరిస్టు పెంపుడు కుక్కలయిన, కొన్ని కుక్కమూతిపిందెల మీడియా మేథావుల విశ్లేషణలు ఈ దుశ్చర్యపై ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు.  అయ్యప్ప దేవాలయంలో సంప్రదాయాన్ని సవాల్ చేసి ఒక మహిళ శబరిమలై వెళితే, అదో చారిత్రక ఘటన!  ఆ మహిళ వీరనారి!! సెక్యురిజాన్ని కాపాడిన జర్నలిస్టు!!!  కానీ కళ్లెదుట అడవారిని చెరబట్టి, హత్యలు చేసిన నరహంతకులేమో ఈ దిక్కుమాలి మీడియా దృష్టిలో దేశభక్తులు! షాపులు లూటీ చేసి, పోలీసులపైనే దాడులకు తెగబడ్డ వారంతా వీరకిశోరాలు. అంటే ఈ తరహా సెక్యులరిస్టులంతా బెంగాల్ ఘటనను మనసారా స్వాగతిస్తున్నారన్న మాట.

ఇక దేశంలో కాశ్మీర్, చత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల్లో  తుపాకీ మోతలు వినలేకపోతున్నామని, ఆ మానహక్కుల ఉల్లంఘనులపై చర్యలు తీసుకోవాలంటూ.. ఆమ్నెస్టీ వరకూ అరిచి గగ్గోలు పెట్టే ముసలీ, ముతక, పాత్రికేయ మేథావులు.. మానవ హక్కులను కాపాడమంటూ ప్రతిసారీ సంతగించే ముట్లుడిగిన జర్నలిస్టు, ప్రొఫెసర్ మహనీయులు.. బెంగాల్ ఘటనను ఖండించకుండా  నోట్లో ఏ బట్ట  కుక్కుకుని ఆత్మహననం చేసుకున్నారో తెలియదు.

ఇప్పుడు బెంగాల్‌లో జరిగింది దారుణాతి దారుణం. భాజపేయులు ఆరోపిస్తున్నట్లు.. బెంగాల్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చడానికా? లేక రోహింగ్యాల స్థావరంగా మార్చడానికా? అన్నది కాదు ముఖ్యం. చావుల చితిమంటలో చలి కాచుకునే ఈ రాజకీయ వ్యూహాలే ఇప్పుడు దేశానికి అసలైన శత్రువు. రాక్షసకాండలో ప్రాణాలు కోల్పోయింది భారతీయులు. లూటీలతో నష్టపోయింది సామాన్యులే. వారు బీజేపీ కార్యకర్తలా? లేక టీఎంసీ క్లైయిము చేసుకున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలా అన్నది కాదు. అంతర్జాతీయంగా పోయింది మాత్రం దేశ పరువే.

అసలే కరోనా టీకా వైఫల్య పరంపరలో.. మనం స్వాతంత్య్రం ఇప్పిస్తే గానీ దిక్కులేని బంగ్లాదేశ్, తిండికి గతిలేని పాకిస్తాన్ కూడా మనకు సాయం అందిస్తామన్న వెక్కిరింపులకు.. బెంగాలీ ఘటన అంతర్జాతీయంగా మరో అదనపు వెక్కిరింత! ఇంకా గద్దెనెక్కకముందే దీదీ రాజ్యంలో ఇన్ని కిరాతకాలు జరిగితే.. ఇక పగ్గాలందుకున్న తర్వాత మరెన్ని ఘోరాలను ఈ జాతి చూడాల్సి ఉంటుందో? ఎవరు కాదన్నా.. నరహహంతకుల చేత  గాయపడ్డ.. చెరచబడ్డ బెంగాల్‌కు, ఇప్పుడు రాష్ట్రపతి పాలనే మందు. అదే తాత్కాలిక ఉపశమనం కూడా!

అసలు.. ఎనిమిది దఫాలుగా ఎన్నికలు పెట్టి, దీదీని అన్ని రకాలుగా వేధించి, రెచ్చగొట్టి మత రాజకీయ మంటను రాజేసిన బీజేపీ కూడా.. ఈ దారుణంలో కచ్చితంగా భాగస్వామే. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు రెండు విడతల్లో జరిపించి, బెంగాల్‌లో మాత్రం ఎనిమిది వితడలు జరిపించి, పాలకుల పెదవులపై చిరునవ్వులు పూయించిన, ఎన్నికల సంఘమూ తాజా ఘటనలో దోషి. అక్కడ కూడా రెండు విడతల్లోనే ఎన్నికలు జరిపించి, మోదీ-అమిత్‌షాలు డజన్ల సార్లు అక్కడికి వెళ్లి, దీదీని రెచ్చగొట్టకుండా ఉండి ఉంటే.. టీఎంసీని రాజకీయంగా సమాధి చేయాలన్న రాజకీయ కుట్రలకు ఊపిరిపోసి, ఆ పార్టీలో చిచ్చురేపి, ఈడీలు, సీబీఐలను సంధించకపోయి ఉంటే.. ఈ ఘటనలు జరిగేవి కాదన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం!

ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం. బెంగాల్‌లో మేరుపర్వతమైన బీజేపీని ధీటుగా ఎదుర్కొందని, యావత్ ప్రజాస్వామ్య పిపాసుల నుంచి కితాబు అందుకున్న అదే దీదీ సివంగి.. రెండురోజుల్లోనే  బెంగాల్‌లో ప్రజాస్వామ్యానికి పాతర వేసిన కిరాతకులకు,  నాయకురాలిగా ఉందన్న అపకీర్తీ మూటకటున్నారన్నది నిష్ఠుర నిజం! ఇలాంటి అరాచకాలనే  తమిళనాడులో డీఎంకె మూకలు చేస్తే, వారిని స్టాలిన్ పార్టీని నుంచి వెలివేశారు. అమ్మ క్యాంటీన్లపై దాడులు చేసిన సొంత పార్టీ కార్యకర్తలను,  తామే పోలీసులకు పట్టించిన నిజమైన రాజకీయవాది స్టాలిన్. మమతకూ-స్టాలిన్‌కూ అదే తేడా!