భగవంతుడు ఎవరు?

766

‘భగవంతుడు ఎవరు? ఆయన దేవుడా? లేక మానవ రూపంలో ప్రస్ఫుటమయ్యే శక్తినా?’ సర్వసాధారణ సందేహం ఇది. ‘భగవంతుడు’ అనేవాడు ఒక రూపంలోనో లేక మానవాకృతిలోనో వికసించేవాడు కాదు. ఒక భాషలో అక్షరాలకు, పదాలకు వాటి వ్యుత్పత్తులనుబట్టి అర్థాలు ఉంటాయి. వాటిని లోతుగా అర్థం చేసుకోవడమే సత్యశోధనకు తొలిమెట్టు. మన పూర్వీకులైన దార్శనికులు, ఋషులు ఆయా విషయాలను పరిశీలించి, పరిగ్రహించి, దర్శించి స్థిరపరచిన విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటేనే వారు కనుగొన్న సత్యాన్ని మనం సులువుగా అర్థం చేసుకోగలం.

మన ఋషులు కనుగొన్న భగవంతుని అర్థం చేసుకోవడానికే ‘ఆర్యసమాజ్‌’ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి ‘బ్యాక్‌ టు వేదాస్‌’ నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. మనమూ మన భాష మూలాల్లోకి, వాటి వైదిక అర్థాలలోకి వెళ్లడం ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవచ్చు. భగవంతుడనే పద వ్యుత్పత్తిని పరిశీలిస్తే, ‘భగము’ నుంచి భగవాన్‌, భగవంతుడు అనే పదాలు వచ్చాయి. ‘జ్ఞానం, ఐశ్వర్యం, బలం, వీర్యం, తేజస్సు, శక్తి’ అనే ఆరింటిని ‘షడ్గుణాలు’ (భగము) అంటారు. వీటిని సంపూర్ణంగా కలిగి ఉన్న చైతన్యమే ‘భగవంతుడు’. ఇవి ఆయన నిరంతరం అభివ్యక్తీకరించే సహజ లక్షణాలు. విశ్వ చైతన్యమంతా తొలి గుణమైన ‘జ్ఞానం’తోనే నిండి ఉంది. జ్ఞానమే ‘విశ్వరచన’ చేస్తుంది. జ్ఞానం లేనిదే గ్రహాలు, నక్షత్రాలన్నీ ఒక క్రమపద్ధతిలో, క్రమశిక్షణతో పరిభ్రమించ లేవు. ఇదే విషయాన్ని ‘విజ్ఞానమానంద బ్రహ్మ’ అని బృహదారణ్యకోపనిషత్తు, ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ అని తైత్తిరీయోపనిషత్తు ప్రకటించాయి. రెండో గుణమైన ‘ఐశ్వర్యం’ మనం అనుకునే భూమి, బంగారం, వజ్రాలు లాంటివన్నీ ఆయన సొత్తే కదా! వీటన్నిటినీ కలిగి ఉండే గ్రహాలు, నక్షత్రాలు ఆ అనంత చైతన్యం నుంచే కదా పుట్టేది. ‘ఐశ్వర్యం’ అంటే ‘అన్నిటినీ లొంగదీసుకునే తత్త్వం’ అని మరో అర్థం కూడా ఉంది. సృష్టిలోని అన్నిటితోపాటు కాలాన్ని కూడా లొంగ దీసుకున్నాడు కాబట్టే, ఆయన అందరిలోకెల్లా ఐశ్వర్యవంతుడు.

మూడో గుణమైన ‘బలం’ ఆ అనంత శక్తిని మించి ఎవరికి ఉంటుంది? మన సూర్యుడికన్నా వేల రెట్లు బరువైన నక్షత్రాలను నియంత్రించగలిగేదొక్క అనంతశక్తి మాత్రమే. అనాత్మరూపాన్ని నశింపజేసుకునే తత్త్వమే ‘బలమని’ అసలు అర్థం. ఈ సృష్టిని నశింపజేసేది ఆ అనంతశక్తియే. సృష్టి క్రియ అనేది 4వ గుణమైన ‘వీర్యాన్ని’ తెలుపుతుంది. విశ్వశక్తి నిత్యం విశ్వాన్ని సృష్టిస్తూనే ఉంటుంది. దాని పునఃసృష్టి అనంతమైన, నిరంతరమైన చర్య కాబట్టి, ఆయనకు అనంతమైన ‘వీర్యమే’ ఒక గుణమై అలరారుతున్నది. ఉదయం పూట దివాకరుని ‘తేజస్సు’ సౌమ్యంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం ఆయన ‘తేజస్సు’ను మన కళ్లు భరించలేవు. విశ్వంలోని తేజోరూపాలైన సూర్యుడు, నక్షత్రాలు ఆ విశ్వచైతన్యంలో స్వల్పకాలికమైనవి, అల్పమైనవని గుర్తిస్తే ఆ అనంతశక్తి యొక్క ఐదవ గుణమైన ‘తేజస్సు’ మన అంచనాకు అందదు.
‘షడ్గుణాల’లో ఆరవ గుణం ‘మాయాశక్తి’కి సంబంధించింది. ‘సృష్టి, స్థితి, లయ’లను చేయగలిగే సామర్థ్యమే ‘శక్తి’. దీనికి ‘ప్రసరించే తత్త్వమని’ మరో అర్థమూ ఉంది. ఆయన నిరంతరంగా ప్రసరిస్తాడు కాబట్టే, శక్తి తత్త్వమై విరాజిల్లుతున్నది. ఈ విధంగా ‘భగము’ అనే ఆరు గుణాల మహోన్నత చైతన్యమే భగవంతుడు. కనిపించేవన్నీ ఆయన ప్రతీకలుగానే మనం అర్థం చేసుకోవాలి.

                 సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్