విశ్వదాత, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు

542
జననం, మే 1, 1867
వెంచర్‌ క్యాపిటలిస్టులు, స్టార్టప్‌లు అని ఇప్పుడు అంటున్నాం కానీ.. వందేళ్ల వెనక్కి వెళ్లి ఆలోచిస్తే… ఒక తెలుగు వ్యక్తి ఆయుర్వేద ఔషధ తయారీ సంస్థకు ప్రాణంపోసి.. విదేశీ కంపెనీలతో పోటీపడ్డారంటే… ఎంత సాహసవంతుడు అయి ఉండాలి? తెలుగు వాళ్లకు చిరపరిచితులైన తొలితరం వ్యాపారవేత్త కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ‘ఆంధ్రపత్రిక’ నిర్వాహకులుగానే ఎక్కువమందికి తెలుసు. అప్పట్లో ఆయన స్థాపించిన ‘అమృతాంజన్‌’ నవతరం వ్యాపారవేత్తలకూ స్ఫూర్తిదాయకం..

మద్రాసు, 2006..
‘ఏమండీ, మీరు పూజలో ఉన్నప్పుడు ప్రపంచ ప్రఖ్యాత చెస్‌ ఛాంపియన్‌ బాబీ ఫిషర్‌ ఫోన్‌ చేశారు. మీరక్కడికి వెళ్లేప్పుడు అమృతాంజన్‌ సీసాలు పట్టుకెళ్లాలట’ అంది చదరంగం ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ భార్య అరుణ.

‘అదేంటి, అతనికి అమృతాంజనమూ, అల్లం చూర్ణంతో పనేంటి? మన భారతీయ మలాం గురించి ఆయనకెలా తెలుసు? నువ్వు సరిగ్గానే విన్నావా?’ అంటూ తనే తిరిగి ఫోన్‌ చేశాడు.

‘హాయ్‌! ఆనంద్‌.. నాకు రెండేళ్లుగా పార్శ్వపు నొప్పి. ఇండియాకు వచ్చినప్పుడు అమృతాంజనం కొని వాడాను. ఉపశమనం కలిగింది. నువ్వు వచ్చే వారం చెస్‌ పోటీలకు ఐస్‌లాండ్‌ వస్తున్నావు కదా! ఓ డజను సీసాలు తీసుకురా..’

‘అయ్యో.. మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను. తప్పకుండా తీసుకొస్తా బాబీ..’

… అలా విశ్వనాథునికీ, కాశీనాథునికీ ముడి వేశాడు దివంగత చదరంగ రారాజు బాబీ ఫిషర్‌. ఇదొక్క సంఘటన చాలు.. ప్రపంచవ్యాప్తంగా మన అమృతాంజన్‌కు ఎంత పేరుందో చెప్పడానికి..!

‘భేతాళ తైలం’ ప్రేరణ..
కృష్ణా జిల్లాలోని ఎలకుర్రులో కాశీనాథుని బుచ్చయ్య, శ్యామలాంబ దంపతులకు నాగేశ్వరరావు 1867 మే 1న జన్మించారు. బందరు, గుంటూరులలో చదువుకున్నాక.. మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ‘వివేకవర్దని’ పత్రికలో కందుకూరి వీరేశలింగం రచనలు చదివి.. సామాజిక సంస్కరణ భావాలను పెంపొందించుకున్నారు. మద్రాసు హైకోర్టు న్యాయవాది, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రెంటాల సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. అనేక పుస్తకాలు రాసిన ఆయన, ‘మేడీజీ’ పేరుతో విద్యార్థుల కోసం గైడ్లు ప్రచురించి.. ఆ రోజుల్లోనే లక్షలు ఆర్జించారు. మరో వైపు విక్టోరియా మందుల డిపో నెలకొల్పి, ఔషధాలను కూడా ఉత్పత్తి చేశారు. తలనొప్పి నివారణకు సుబ్బారావు తయారు చేసిన ‘భేతాళ తైలం’ వాడాకే… నాగేశ్వరరావులో జిజ్ఞాస మొదలైంది. మనిషి తనలోని నైపుణ్యాన్ని వెలికితీసి, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలంటే.. ఓ మార్గదర్శి అవసరం. సుబ్బారావుగారి సాన్నిహిత్యం వల్ల నాగేశ్వరరావులో వ్యాపార ఆలోచనలకు బీజం పడింది. సొంతగా ఔషధాలను తయారుచేసి, మందుల వ్యాపారం చేయాలనుకున్నారు. ఆయుర్వేదంలో దిగ్గజాలు అనదగిన వారు కలకత్తాలో ఉన్నారని ఆయనకు తెలిసింది.

ఆయుర్వేద ప్రయోగం..
కలకత్తాలో అడుగుపెట్టారు నాగేశ్వరరావు.ఔషధాల తయారీలో మెలకువలు నేర్చుకున్నారు. అక్కడి నుంచి బొంబాయి వెళ్లారు. చిన్నాచితకా కొలువులు ఆయన్ని సంతృప్తి పరచలేదు. విలియం కంపెనీలో ఉద్యోగిగా చేరారు. కొన్నాళ్లకే యజమాని విశ్వాసాన్ని చూరగొన్నారు. విదేశీయుడైన విలియం మాతృభూమికి వెళ్లిపోతూ.. ఆ కంపెనీ బాధ్యతల్ని కాశీనాథునికి అప్పగించారు. తలనొప్పి, జలుబు, ఒళ్లు నొప్పుల నివారణ కోసం.. ఒక మలాం కనిపెట్టే ఆలోచనతో అనేక ప్రయోగాలు చేశారు. కర్పూరం, నీలగిరి, పుదీనా, వామాకు, దాల్చిన చెక్క, నిమ్మగడ్డి, టర్పెంటైన్ ఆయిల్, వింటర్ గ్రీన్, కుసుంభ నూనె, ఇతర మూలికలు కలిపిన ఓ ఔషధ తైలాన్ని తయారు చేశారు. అమృత అంజనంలా చిటికెలో పనిచేస్తోందని అందరూ చెప్పడంతో.. దానికి ‘అమృత అంజనం’ కొన్నాళ్లకు ‘అమృతాంజనం’గా పేర్లు స్థిరపడ్డాయి. ఈ ఉత్పత్తి అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. ఆయన్ని లక్షాధికారిని చేసింది.

తెలుగు పత్రికలకు బీజం..
పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు లేని రోజుల్లో.. వార్తా పత్రికల్లో ఆయుర్వేద, ఐరోపా మందుల ప్రకటనలు వెల్లువెత్తేవి. ఆయుర్వేద ఉత్పత్తుల తరువాత స్థానాన్ని సబ్బులు, నూనెలు, ముక్కుపొడుం, విదేశీ టానిక్‌ల అడ్వర్‌టైజ్‌మెంట్లు ఆక్రమించుకున్నాయి. వాణిజ్య ప్రకటనల హవా పెరుగుతున్నకొద్దీ..ఇండియన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, కలకత్తా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, బొంబాయి లో దత్తారామ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, మదరాసులో మోడరన్ పబ్లిసిటీ ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. 1902లో కృష్ణా జిల్లా అసోసియేషన్‌ పేరిట ప్రముఖ పాత్రికేయులంతా కలిసి ‘కృష్ణా’ పత్రికను స్థాపించారు. కలకత్తా గెజిట్‌, బొంబాయి క్రానికల్‌, కృష్ణా పత్రికలలో ఈ ఆయుర్వేద ప్రకటనలు వచ్చేవి.

బొంబాయి, మద్రాస్ నుండి డా. బాట్లీవ్వాలా, డా డి బి  సావంత్, సుబ్బారాయ్, గోపాలాచారియర్ ఆయుర్వేద, హైదరాలి డిస్పెన్సరీ, బెజవాడ నుండి రామన్ బ్రదర్స్, తుని నుండి అశ్వని ఆయుర్వేద ఒంగోలు నుండి సంజీవరక్ష ప్రకటనలు పత్రికలను ముంచెత్తేవి.ఇవన్నీ చూసిన నాగేశ్వరరావు కూడా తన అమృతాంజన్‌ ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. ఆన్లైన్ షాపింగ్, కొరియర్లు లేని ఆ రోజుల్లో మందులను, ఇతర సరకులను మందులను, సరుకులను పోస్టాఫీసు మెయిల్‌ ఆర్డర్‌ ద్వారా లేదంటే వీపీపీ ద్వారా డబ్బుకట్టి… విడిపించుకునే సౌకర్యం కల్పించారు. స్పందన బాగుండటంతో.. పత్రికల్లో ప్రకటనల రేట్లు అనూహ్యంగా పెరిగాయి. ఇవన్నీ నాగేశ్వరరావును పత్రికా స్థాపన దిశగా ఆలోచింపజేశాయి.
                                                                                                     – సత్యనారాయణరాజు