కరోనా వాక్సినేషన్ గురించి ఏం తెలుసు?

568

న్యూఢిల్లీ, మే 3 (న్యూస్‌టైమ్): ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మొదటి దశ అంతరించే సమయం ఆసన్నమైందన్న తరుణంలో ఉప్పెనలా వచ్చి పడిన సెకండ్ వేవ్ ప్రధానంగా భారత్‌పైనే పగబట్టిందా? అన్నట్లు తాజాగా పెరుగుతున్న పాజిటివిటీ కేసులు, మరణాల శాతం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన టీకా (వ్యాక్సినేషన్) కార్యక్రమానికి ఇన్నాళ్లూ అడ్డొచ్చిన అపోహలు ఈ మధ్య క్రమంగా తొలగుతున్నట్లు వ్యాక్సినేషన్ సెంటర్లకు ఎగబడుతున్న వారిని బట్టి తెలుస్తోంది. అయినా, ఇంకా కరోనాపై సగటు మనిషిలో అనేక సందేహాలు, టీకాపై పలు అనుమానాలూ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.

అందుకే ఇది చదివితే ఆ అపోహలన్నీ పటాపంచలు కావడం ఖాయం.

ప్రశ్న: వ్యాక్సిన్ కరోనా వైరస్‌ని ఖతం చేస్తుంది అన్నారు, నిజమేనా?

సమాధానం: అలా జరగదు. వ్యాక్సిన్ అనేది కరోనా వైరస్‌ను ఖతం (చంపడం) చేయదు.

ప్రశ్న: మరి వ్యాక్సిన్ వలన ఉపయోగం ఏమిటి?

సమాధానం: వ్యాక్సిన్ అనేది మన శరీరంలో ఉండే మన రక్షక కణ (యాంటీ బాడీస్) వ్యవస్థని నిద్ర లేపుతుంది. మనలో యాంటీ బాడీస్ తయారయ్యేలా మన ఇమ్యునిటీ సిస్టంని బూస్ట్ అప్ చేస్తుంది.

ప్రశ్న: వ్యాక్సిన్‌ని ఎలా తయారు చేస్తారు?

సమాధానం: (ఏ) యాక్టివ్‌గా ఉన్న కరోనా వైరస్‌లని నిర్విర్యం చేసి వాక్సిన్‌గా ఇస్తారు. అంటే చచ్చి పోయిన కరోనా వైరస్‌నే మనకు వ్యాక్సిన్‌గా ఇస్తారన్న మాట.

(బీ) కొన్ని సార్లు వైరస్‌ని తీసుకొని దానిలోని హానికర జీన్స్‌ని తీసివేసి ఆ ప్లేస్‌లో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి, వెక్టార్ వ్యాక్సిన్‌గా ఇస్తారు. ఈ విధంగా రకరకాలుగా వ్యాక్సిన్‌ని తయారు చేసి మనకు ఇస్తారు.

ప్రశ్న: భారత్ బయోటెక్ వాళ్ళు కొవాక్సిన్, ఆస్ట్రాజెనికా వాళ్ళు కోవిషీల్డ్ ఎలా తయారు చేశారు?

సమాధానం: (ఏ) భారత్ బయోటెక్ కొవాక్సిన్: వీళ్ళు కరోనా వైరస్‌ని తీసుకొని ఫార్మాల్డిహైడ్ ద్రావణంలో ముంచి, చచ్చిపోయిన కరోనా వైరస్‌ని వ్యాక్సిన్‌గా ఇస్తారు.

(బీ) ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్: వీళ్ళు ఎడినో వైరస్‌ని తీసుకొని దానిలోని హానికర జీన్స్ తీసి వేసి, ఆ ప్లేస్‌లో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి వెక్టార్ వ్యాక్సిన్‌ని తయారు చేశారు.

ప్రశ్న: కొవాక్సిన్ ఎలా పనిచేస్తుంది?

సమాధానం: ముందే చెప్పినట్లు కొవాక్సిన్ పేరుతో ఉన్న వ్యాక్సిన్‌లో చచ్చిపోయిన కరోనా వైరస్ ఉంటుంది. దానినే వాక్సిన్‌గా ఎక్కిస్తారు. మనం కొవాక్సిన్ వేయించుకుంటున్నాం అంటే మన శరీరంలోకి చచ్చిపోయిన కరోనా వైరస్‌ని ఎక్కిస్తున్నారని అర్థం. వాటితో మనకు ఏ ప్రమాదమూ ఉండదు. ఐతే మన శరీరంలోని రక్షణ వ్యవస్థ బతికి ఉన్న వైరసే వచ్చింది, అనుకొని ఎక్కువ మొత్తంలో రక్షణ కణాలు (యాంటీ బాడీస్) ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా నిజమైన కరోనా వైరస్ వచ్చినా ముందే ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ కానీ, లేదా ఇంతక ముందు వచ్చిన చచ్చిపోయిన వైరస్‌ని (పోలిన, ఈ అసలు వైరస్ కూడా అలాంటిదే అని) మన రక్షణ వ్యవస్థ గుర్తుపట్టి, ఇంకా ఎక్కువ మొత్తంలో యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాంటీబాడీస్ కొత్తగా మన ఇంట్లోకి చేరిన వైరస్‌తో పోరాడి ఆ వైరస్‌ల పని పడతాయి.

ప్రశ్న: వ్యాక్సిన్ వేసుకుంటే 100% మనకి రక్షణ ఉంటుందా?

సమాధానం: సాధారణంగా ఏ వాక్సిన్ కూడా 100% పని చేయదు. ప్రస్తుతం ఇపుడు అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్లు కూడా 100% ఎఫెక్టివ్‌గా లేవు. ఒక వ్యాక్సిన్ 70%, ఇంకోటి 80%, మరొకటి 90% ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నై.

ప్రశ్న: అంటే వ్యాక్సిన్లలో లోపం ఉన్నట్లా?

సమాధానం: టెక్నికల్‌గా చూస్తే వాక్సిన్లలో ఏ లోపం లేదనే చెప్పాలి. వ్యాక్సిన్ తయారీలో లోపం ఏమీ ఉండదు. వ్యాక్సిన్ కరక్ట్‌గానే తయారు చేయబడి ఉంటుంది. కానీ మన శరీరంలోని రక్షణ వ్యవస్థ బద్దకంగా ఉండొచ్చు. యాంటీ బాడీస్ ఉత్పత్తికి సరైన వాతావరణం మన లోపల ఉండకపోవచ్చు.. ఉదాహరణకి అగ్గిపెట్టె, అగ్గి పుల్ల ఉన్నా అగ్గిపెట్టె తడిచి ఉంటే ఉపయోగం ఉండదు. ఆ విధంగా ప్రతి ఒక్కరి శరీర తత్వం, లోపల ఉన్న పరిస్థితులని బట్టి వ్యాక్సిన్ పనిచేయటం, పని చేయకపోవటం అనేది ఉంటుంది. మరి కొన్ని సార్లు వ్యాక్సిన్‌ని సరైన ఉష్నోగ్రతల మధ్య నిల్వ చేయకపోవడం వలన కూడా అది సరిగ్గా పని చేయదు. వాక్సిన్ పని చేయకపోవటానికి, ఈ విధంగా చాలా కారణాలు ఉంటై.

ప్రశ్న: ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే ఇక ఎప్పటికీ యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతూనే ఉంటాయా? లేదా ఆల్రెడీ ఉత్పత్తి ఐన యాంటిబాడీస్ ఎప్పటికీ అలానే వైరస్ రాక కోసం కాచుకుని కూచుంటయా?

సమాధానం: ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ 3 నెలలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండోచ్చు, కాదంటే 3 రోజులే ఉండొచ్చు. అది వారి వారి శరీర తత్వం, తీసుకునే ఆహారం, హెల్త్ ప్రొఫైల్, వయస్సు మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. (ఈ విషయంలో ఇంకా రీసెర్చ్ జరగాల్సి ఉంది).

ప్రశ్న: ఒకసారి కరోనా వస్తే మళ్ళీ 100% ఖచ్చితంగా రాదా?

సమాధానం: అలా అని ఖచ్చితంగా చెప్పలేం. ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయింది అంటే మన శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ ఆ వైరస్‌తో పోరాడి, ఆ వైరస్ పనిబట్టి విజయం సాధించినట్టు లెక్క. ఇక రెండో సారి కరోనా సోకినప్పుడు, ఒకేసారి అత్యధిక సంఖ్యలో వైరస్‌లు వచ్చి దాడి చేస్తే లేదా ఆ టైంలో మనలో యాంటీ బాడీస్ సరియైన మోతాదులో లేకపోతే మనకు మళ్ళీ కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. మంచి ఆహారం తీసుకొని డీ విటమిన్, సీ విటమిన్ లాంటివి కరక్ట్ మోతాదులో ఉంటే, యాంటీ బాడీస్ యాక్టివ్‌గా ఉండి మరొక సారి కరోనా రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది.

ప్రశ్న: ఒకసారి కరోనా వచ్చినవాళ్ళు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇద్దరూ సమానమేనా?

సమాధానం: మంచి ప్రశ్న. ఒక రకం గా ఇద్దరూ సమానమే అని చెప్పొచ్చు. కరోనా వచ్చి పోయిన వాళ్ళకి వారి లోపల యాంటీ బాడీస్ ఆల్రెడీ ఉంటై. వ్యాక్సిన్ వేసుకొన్న వాళ్ళ ఒంట్లో కూడా (ఆ వాక్సిన్ సరిగ్గా పనిచేస్తే) యాంటీ బాడీస్ తయారై ఉంటై. ఈ విధంగా చూస్తే ఒకసారి కరోనా వచ్చి తగ్గిన వాళ్ళూ, వాక్సిన్ వేయించుకున్న వాళ్ళూ ఇద్దరూ సమానమే.

ప్రశ్న: వ్యాక్సిన్ వేసుకున్నాక అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవటం ఎలా?

సమాధానం: యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకుంటే తెలుస్తుంది.

ప్రశ్న: ఏ యే యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకోవాలి?

సమాధానం: ఐజీజీ, ఐజీఎం అనే రెండు రకాల యాంటీ బాడీస్ టెస్ట్‌లు చేయించుకోవచ్చు.

ప్రశ్న: నేను వ్యాక్సిన్ తీసుకోను, మంచి ఆహారం తీసుకుంటాను. ఆరోగ్య కరమైన జీవన విధానం పాటిస్తాను. వ్యాక్సిన్ తీసుకోకపోయినా పరవాలేదా? ఇక నాకు వైరస్ సోకినా ఏమీ కదా?

సమాధానం: ముందే చెప్పినట్లు వ్యాక్సిన్ అనేది మనలో ఉన్న రక్షణ కణాలు తయారు చేసే వ్వస్థని నిద్ర లేపుతుంది. మీ శరీరంలో ఉన్న రక్షక కణాలు ఆల్రెడీ జాగురుకతతో ఉండి ఉంటే వ్యాక్సిన్ తీసుకోకపోయినా మీకు ఏమీ కాకపోవచ్చు. కానీ అదెలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఏ మాత్రం రిస్క్ తీసుకోకూడదు అంటే వాక్సిన్ తీసుకోవడమే అన్నివిధాలా ఉత్తమం.

ప్రశ్న: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?

సమాధానం: కోవిషీల్డ్ వ్యాక్సిన్ అంటే ఎడినో వైరస్‌ని ఎక్కించటం. కరోనా వైరస్‌కి ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్, ఎడినో వైరస్‌కి ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్ రెండూ ఒకటే. కోవిషీల్డ్ ద్వారా ఎడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్ మన శరీరంలో ఎక్కించినా అవే యాంటీ బాడీస్‌నే ఉత్పత్తి అవుతాయి.

ప్రశ్న: కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. సెకండ్ డోస్ తర్వాత కొన్ని రోజులకి యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకున్నాను, కానీ యాంటీబాడీస్ ఏమీ లేవు. అదెలా సాధ్యం? అంటే వ్యాక్సిన్ పని చేయలేదా ఏంటి?

సమాధానం: ఇక్కడ ఒక మతలబు ఉంది. మనం గతంలో ఎడినో వైరస్‌కి గురి అయ్యి ఉంటే ఆ సమయంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యి, ఆ వైరస్‌కు సంబంధించిన సమాచారం మన రక్షణ కణాల మెమొరీలో ఉంటుంది. ఈ సారి ఎడినో వైరస్ ఒకటో రెండో వ్యాక్సిన్ ద్వారా ఎక్కించినా వందలు, వేల సంఖ్యలో యాంటీ బాడీస్ ఉత్పత్తి కావు. కానీ నిజంగా కరోనా వైరస్‌కి గురి అయితే యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. సో, గతంలో ఎడినో వైరస్ వలన ఏదో ఒకటి వచ్చిన వాళ్ళకి ప్రస్తుతం కరోనా వచ్చినా త్వరగా తగ్గిపోవటానికి స్కోప్ ఉంటుంది.

ప్రశ్న: వ్యాక్సిన్ ఒకొకరికి ఒకోలా ఎందుకు పనిచేస్తుంది?

సమాధానం: చికెన్ కర్రీ చేసి 100 మందికి పెట్టి ఎలా ఉంది అంటే కొందరు ఉప్పు తక్కువ అయ్యింది అనీ, ఇంకా కొందరు ఉప్పు కొంచెం ఎక్కువైంది అనీ అలా తలా ఒకరకంగా చెప్తారు. నిజానికి అందరూ కరక్టే. వాళ్ళ శరీరంలోని కెమికల్స్ కాంబినేషన్స్ వలన వాళ్ళు అలా చెప్తారు. వ్యాక్సిన్ కూడా అంతే, ఎవరి శరీరంలో ఎంత కాల్సియం ఉంది, ఎంత డీ విటమిన్ ఉంది, ఎంత సీ విటమిన్ ఉంది ఇలాంటి వాటిని బట్టి వ్యాక్సిన్ ఎంత వరకు పనిచేస్తుంది, ఎంత వరకు పని చేయట్లేదు అనేది ఉంటుంది.

ప్రశ్న: వ్యాక్సిన్ వేయించుకున్నాక సినిమా నటులు, రాజకీయ నాయకుల లాగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా గుంపులు గుంపులుగా ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుతూ ఉండొచ్చా?

సమాధానం: ఉండ రాదు. వ్యాక్సిన్ తీసుకున్నాం అంటే మన పక్కన ఇద్దరు అంగ రక్షకులు రెడీగా ఉన్నట్లు లెక్క, అంతే.. దొంగలు (కరోనా వైరస్‌లు) ఒకేసారి 10 మంది, 20 మంది వస్తే మన పని అవుట్. ఉన్న ఆ ఇద్దరు అంగరక్షకులు మనల్నేం కాపాడుతారు? అందుకే వ్యాక్సిన్ వేసుకున్నా, వేసుకోకపోయినా మాస్క్ ధరించటం, జాగ్రత్తలు పాటించటం అన్నీ కంపల్సరీ.

ప్రశ్న: వ్యాక్సిన్ వేసుకుంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలా?

సమాధానం: వ్యాక్సిన్‌కి ఆహారపు అలవాట్లకి సంబంధం ఏమీ లేదు. ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు.

ప్రశ్న: వ్యాక్సిన్ వేసుకుంటే మందు తాగకూడదా? స్మోకింగ్ చేయకూడదా?

సమాధానం: సాధారణంగానే ఆల్కహాల్, స్మోకింగ్ మంచిది కాదు. ఆ అలవాట్లు మన రక్షణ వ్యవస్థ ని బలహీన పరుస్తాయి. వ్యాక్సిన్ వేసుకున్న కొన్ని రోజులు కనీసం యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యే వరకైనా కొన్ని రోజులు ఆల్కహాల్‌కి, స్మోకింగ్‌కి దూరంగా ఉంటే మంచిది.

ప్రశ్న: వ్యాక్సిన్ వేసుకున్నాక కొన్ని రోజులకి తాగొచ్చా, స్మోకింగ్ చేయొచ్చా?

సమాధానం: తప్పదు అనుకుంటే తాగొచ్చు, స్మోకింగ్ చేయొచ్చు. కాని దాని వలన మీలో ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ కొన్ని అయినా ఖచ్చితంగా తగ్గిపోతాయి.

ప్రశ్న: కొవాక్సిన్ బెటరా? కోవిషీల్డ్ బెటరా?

సమాధానం: రెండూ బెటరే.. ఐతే సాధారణంగా డెడ్ వైరస్ ఉన్న వ్యాక్సిన్ కొంత బెటర్ అంటున్నారు కాని ఏ వాక్సిన్ అయినా, అది మీ శరీర తత్వాన్ని బట్టి, మీ శరీరంలోని హెల్త్ ప్రొఫైల్, కెమికల్స్ స్థాయిని బట్టి ఉంటుంది. అన్ని వాక్సిన్‌లూ అందరికీ ఒకేలా పనిచేయవు.

ప్రశ్న: కొవాక్సిన్ సెకండ్ డోస్ ఎపుడు తీసుకోవాలి? అలాగే కోవిషీల్డ్ సెకండ్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి?

సమాధానం: ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్‌ని బట్టి కొవాక్సిన్ ఐతే 4-6 వారాలు, కోవిషీల్డ్ 6-8 వారాల గ్యాప్‌తో సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రశ్న: వ్యాక్సిన్ వేసుకున్నాక ఏమైనా అవుతుందా?

సమాధానం: మనిషి మనిషి ని బట్టి, అది పని చేస్తుందా లేదా చేస్తే, ఎంత మోతాదులో పని చేస్తుంది అనేదాన్ని బట్టి, మీ మీ హెల్త్ ప్రొఫైల్స్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాని సాధారణంగా 2-3 రోజులు ఫీవర్, వ్యాక్సిన్ ఇంజెక్షన్ చేసిన దగ్గర కొంచెం నొప్పి ఉంటుంది.

ప్రశ్న: ఫీవర్ వస్తే వాక్సిన్ పనిచేస్తుంది అని అనుకోవచ్చ?

సమాధానం: అలా ఏమీ ఉండదు. పనిచేస్తున్నా ఫీవర్ రావచ్చు, రాకపోవచ్చు, పని చేయకపోయినా వేరే కారణాల వలన కూడా ఫీవర్ రావొచ్చు, రాకనూ పోవచ్చు. సమాధానం అవును, కాదు అని చెప్పాల్సి ఉంటుంది.

ప్రశ్న: ఏ వయస్సు వారు వ్యాక్సిన్ వేసుకోవచ్చు?

సమాధానం: ప్రస్తుతం 45, ఆ పైన ఉన్న వారికి ఇస్తున్నారు. ముందు ముందు 18 ఆ పైన కూడా ఇవ్వొచ్చు.

ప్రశ్న: వ్యాక్సిన్ స్టాక్ లేదు అంటున్నారు?

సమాధానం: అది ప్రభుత్వాలని, కంపనీలని, వ్యాక్సిన్ సెంటర్స్‌ని అడగాలి.

ప్రశ్న: బ్లడ్ గ్రూప్స్‌ని బట్టి కరోనా తీవ్రత ఉంటుందా?

సమాధానం: ఉంటుంది. ఓ బ్లడ్ గ్రూపు వాళ్ళకి కొంచెం ఎక్కువ రక్షణ ఉంటుంది. ఏ బ్లడ్ గ్రూపు వాళ్ళకి కొంచెం తక్కువ రక్షణ ఉంటుంది. అందుకే ఏ వాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్త ఉండాలి. అయితే ఇది 1-10% మాత్రమే. ఎవరికైనా వస్తుంది, ఎవరు అయినా జాగ్రత్తగానే ఉండాలి, అందరూ ఈక్వల్‌గానే జాగ్రత్తగానే ఉండాలి.

ప్రశ్న: సాధారణ జాగ్రత్తలు ఏమిటి?

సమాధానం: డీ విటమిన్ కోసం రోజుకి 30 నిమిషాలు ఎండలో నిలబడటం లేదా డీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం, సీ విటమిన్ ట్యాబ్లెట్స్ లేదా ఫ్రూట్స్ తగిన మోతాదులో తీసుకోవటం. మంచి ఫౌష్టిక ఆహారం, తగిన వ్యాయాయం, మొదలగు సాధారణ జాగ్రత్తలతో పాటు బయటికి వెళ్తే మాస్క్ ధరించటం. బయట ఏమి ముట్టుకున్నా శానిటైజర్స్ వాడటం లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఇతరులతో ఆరు అడుగుల వరకు భౌతిక దూరం పాటించటం మొదలైనవి చేయాలి.

ప్రశ్న: రక రకాల మనుష్యులు, పత్రికలు, టీవీలు, డాక్టర్లు రకరకాలుగా చెప్తున్నారు. ఏది నమ్మాలి?

సమాధానం: చాలా మంది డాక్టర్స్‌తో పాటు, మనుషులు, పత్రికలు, టీవీలలో చాలా ఫేక్ సమాచారం ఉంది. ఎవరినీ పూర్తిగా నమ్మొద్దు నాతో సహా. మీకు మీరే సాధారణ జాగ్రత్తలు తీసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దు. మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంటుంది. వైరస్ మీ దగ్గరకు కావాలని రాదు. మీకు మీరై దాని దాని దగ్గరలోకి వెళ్తే మాత్రం మీకు తప్పకుండా అంటుకుంది.

ప్రశ్న: చివరగా ప్రజలకి ఏమి చెప్తారు?

సమాధానం: కారోనా వచ్చి సంవత్సరం దాటినా 138 కోట్ల మందిలో ఒక్క శాతం మంది అయినా 100% జాగ్రత్తలు పాటించారా? లేదు? అందరూ, ఇలాగే నెగ్లిజెంట్‌గా ఉంటే సెకండ్ వేవ్ మాత్రమే కాదు.. థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్ కూడా వస్తుంది. మనం ఎవరికి ఏమి చెప్పినా ఎవరూ వినరు, మన దేశంలో ఉన్న 138 కోట్ల మందిలో అందరూ ఇతరులకు చెప్పే స్థితిలోనే ఉన్నారు, మనం చెప్తే వినే స్థితిలో ఎవరూ లేరు. సో.. ప్రజలకి చెప్పటానికి ఏమీ లేదు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే వారు సురక్షితంగా ఉంటారు. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకుంటారు. అందుకే ఎవరి పరిధిలో వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. సెలవు..! అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి…