కొత్త పార్టీపై స్పందించిన ఈటెల

300

హైదరాబాద్, మే 3 (న్యూస్‌టైమ్): కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ బీ ఫామ్ ఉంటే కాదని, ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశానని ఈటెల పేర్కొన్నారు. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదన్నారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు.

పథకం ప్రకారమే తనపై కుట్ర జరిగిందని ఈటెల పేర్కొన్నారు. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారన్నారు. వేల కోట్లు సంపాధించానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జమున హ్యాచరీస్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. తనకు సంబంధం లేని భూముల్లో సర్వే చేశారన్నారు. ‘‘నాపై వచ్చిన ఆరోపణలపై కనీసం నా వివరణ కూడా తీసుకోలేదు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే. సంబంధం లేని భూములను నాకు అంటగడుతున్నారు. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కాను. నయీం గ్యాంగ్ నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించిందిజ అప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతానా?’’ అని ఈటెల ప్రశ్నించారు.

‘‘గత మూడు రోజులుగా పధకం ప్రకారం ఆరోపణలు చేస్తున్నారు. వేల ఎకరాల భూములు, అసైన్డ్ భూములు ఆక్రమించారని ప్రచారం జరుగుతుంది. 19 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తున్నాను. కమలాపూర్‌లో 2004లో గెలిచాను. 2009లో ఏడుగురు గెలిచిన తరువాత పార్టీలో ప్రాధాన్యత కల్పించారు. ఫ్లోర్ లీడర్‌గా అవకాశం కల్పించారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవి ఇచ్చారు. టీఆర్ఎస్‌కు మచ్చతెచ్చే పనిచేయలేదు. కేసీఆర్ ధర్నాన్మి నమ్ముకుని పనిచేశారు. అటువంటి నాయకులు ఈటల రాజేందర్ వంటి బలహీన వర్గానికి చెందిన నాయకుని మీద అన్ని శాఖల అధికారులతో సర్వే చేపిస్తున్నారు. నావంటి సామాన్యునిపై కేసీఆర్ అధికారం ప్రయోగించారు. ఉద్యమంలో పనిచేసినప్పుడు వ్యాపారంలోకి పోలేదు. 100 కోట్ల రూపాయల రుణం తీసుకుని వ్యాపార విస్తరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. అసైన్మెంట్ భూములు వున్నాయని నాకు నోటీసులు పంప లేదు. వందల మంది పోలీసులను పెట్టి భూములు కొలుస్తున్నారు.. రాజ్యానికి శిక్షించే అధికారం వుంటుంది. కాని చట్టాన్ని గౌరవించాలి. నేను చెట్లు కొట్టానని అన్నారు. మారుమూల ప్రాంతంలో ఐదెకరాలలో పౌల్ట్రీ ఫాం కడుతున్నాను. 66 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు రిపోర్ట్ ఇచ్చారు. నాకు నివేదిక అందలేదు. కాని నిన్నటి నుండి నా ఇంటిచుట్టూ పోలీసులు తిరుగుతున్నారు.’’ అని ఈటెల వ్యాఖ్యానించారు.

‘‘కోర్టును ఆశ్రయిస్తాను… కోర్టు శిక్ష వేస్తే శిరసావహిస్తాను… వ్యక్తులు వుంటరు పోతరు… పార్టీలు వుంటయి పోతయి… కాని వ్యవస్థ ముఖ్యం… ఇదేనా మన సంస్కృతి, సంప్రదాయాలు… ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమం. కేసులకు, అరెస్టులకు భయపడను… ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన చేస్తున్నప్పుడు మారువేశంలో వెళ్లి దీక్ష విరమింపజేశాను. నయీం బెదిరింపులకు భయపడలేదు. వైఎస్ఆర్ బెదిరింపులకు నిలిచిన వ్యక్తిని నేను, అంతరాత్మ సాక్షిగా పనిచేయాలి. దేవాలయ భూములు ఆక్రమించలేదు. నా భార్య ఎంటర్‌ప్రెన్యూర్, ఆమె మీద కేసులు పెడుతున్నారు. నేను కట్టుబట్టలతో వచ్చాను. తిరిగి ఆ స్ధాయికి పోవడానికి సిద్దంగా వున్నాను. పౌల్ట్రీ పరిశ్రమ వందల కోట్ల రూపాయల పరిశ్రమ, నేను కష్టపడి ఎకరం, ఎకరం కొన్నాను, ఇప్పుడు ఆ భూములు కోట్ల రూపాయల విలువ చేస్తున్నాయి, ఇరవై సంవత్సరాల నుండి నన్ను ఆదరిస్తున్న హుజూరాబాద్ ప్రజలతో సంప్రదించి ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటాను.’’ అని అన్నారు.

‘‘మేమెవరమో మీకు గుర్తుకు రావాలి కదా‌.. మా పోరాటాలు మీకు గుర్తుకు రావాలి… నేను ఒక్కడినే కావచ్చు… కాని నా వెనక తెలంగాణ ప్రజలు అండగా వున్నారు. మీ దగ్గర వున్న మంత్రులు గాని ఎమ్మెల్యేలు ఆత్మగౌరవంతో జీవించడం లేదు.’’ అని రాజేందర్ కాస్త కటువుగానే కేసీఆర్‌ను హెచ్చరిస్తున్న ధోరణిలో చెప్పుకొచ్చారు.